రంగారెడ్డి జిల్లాలోనూ పోటెత్తిన జనసందోహం

కోళ్ళపడకల్‌ (రంగారెడ్డి జిల్లా): అభిమాన జనం పోటీ పడుతున్నారు.. జనసందోహం ఆనందంతో ఉరకలెత్తుతోంది. తమ గుండెల్లో పదిలంగా కొలువైన మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, తాము అభిమానించే యువ నాయకుడు జగనన్న సోదరి శ్రీమతి షర్మిలకు రంగారెడ్డి జిల్లా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ‘మరో ప్రజాప్రస్థానం’ యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాలోకి అడుగిడిన షర్మిలకు జిల్లా నుంచే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రాంతం నుంచీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామంలోకి‌ శ్రీమతి షర్మిల ప్రవేశించినప్పుడు జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఎదురేగి ఆమెకు అఖండ స్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయానికి, సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ ఆడి, బతుకమ్మ పాటలు పాడి, గిరిజనులు నృత్యాలతో ఘనంగా ఆహ్వానించారు. కోళ్లపడకల్. దుబ్బచర్ల, పెండ్యా‌ల క్రాస్‌రోడ్సు నుంచి మన్సాన్‌పల్లి వరకు సాగిన యాత్రకు జనం నీరాజనాలు పట్టారు.


తమ ప్రాంతానికి వడివడిగా వస్తున్న శ్రీమతి షర్మిలను సమీపంలో చూసేందుకు వీలుగా చెట్లు, చేమలు, డాబాలపైకి వందలాది మంది అభిమానులు ఎక్కారు. అభిమానులు, పార్టీశ్రేణులు, ప్రజలతో పాదయాత్ర మార్గమంతా కిటకిటలాడుతోంది. జిల్లాలోకి అడుగిడిన తర్వాత మన్సాన్‌పల్లిలో శ్రీమతి షర్మిల తొలిసారి ప్రసంగానికి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. జై జగన్‌ అంటూ మిన్నంటేలా నినాదాలు చేశారు. తమ జిల్లాపై మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి ఉన్న ప్రేమ, ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలను శ్రీమతి షర్మిల గుర్తు చేస్తుంటే స్థానికుల చప్పట్లతో ఆ ప్రాంతమంతా మార్మోగుతున్నది. వైయస్‌ఆర్, ఆనంత‌పురం, కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో యాత్ర ముగించుకొని రంగారెడ్డి జిల్లాలోకి రాగానే తనకు అపూర్వ స్వాగతం పలికారని, ఆప్యాయంగా ఆహ్వానించారని శ్రీమతి షర్మిల అనగానే ప్రజల నుంచి హర్షధ్వనాలు వెల్లువెత్తాయి.

పాదయాత్రలో వైయస్‌ఆర్ ‌సిపి జిల్లా కన్వీనర్ బి. జనార్ద‌న్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, సీఈజీ సభ్యుడు రాజ్‌ఠాకూర్, జిల్లా మహిళ విభాగం కన్వీన‌ర్ అమృతసాగ‌ర్, రాష్ట్ర వై‌యస్‌ఆర్ సేవాద‌ళ్ కన్వీన‌ర్ కోటంరెడ్డి విన‌య్‌రెడ్డి, పార్టీ నాయకులు పి.శ్రీనివాసులునాయుడు, సింగిరెడ్డి హరివర్థన్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, బొక్క జంగారెడ్డి, పార్టీ జిల్లా యువజన విభాగం కన్వీనర్ సురే‌ష్‌రెడ్డి, ఎస్సీసెల్ కన్వీన‌ర్ రాచమల్ల సిద్దేశ్వ‌ర్, కార్పొరేట‌ర్ దేప సురేఖ, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు‌.
Back to Top