రాజన్న నడిపిన ఎడ్లబండి!

కామేపల్లి (ఖమ్మం జిల్లా) : ‘అమ్మా.. ఇది మీ నాన్న.. మా రాజన్న నడిపిన ఎడ్లబండి.. 2003లో ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో సాతానుగూడెం వచ్చినపుడు ఈ ఎడ్లబండి నడిపారు. ఆయన గుర్తుగా ఈ బండిని అలాగే ఉంచాను. ఓసారి ఈ బండి ఎక్కమ్మా..’ అని సాతానుగూడెం రైతు కీసర ఇంద్రారెడ్డి శ్రీమతి షర్మిలను కోరారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల ఆదివారం సాతానుగూడెంలో ఎడ్లబండిని తాకి పాదయాత్రను కొనసాగించారు.

షర్మిలమ్మా... నాన్న మా పొలం దున్నారు :
‘ఇదిగో అమ్మా.. నాన్న మా పొలం దున్నారు.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నాన్నగారు పాదయాత్ర చేస్తూ మా ఊరు వచ్చారు. అరక పట్టుకొని మా చేలో దున్నారు. ఆయన దున్నిన నాగలి ఇప్పటికీ అలాగే ఉందమ్మా..’ అని పండితాపురం రైతు బొగ్గారపు నర్సింహారావు ఆ గ్రామ శివారులో శ్రీమతి షర్మిల‌కు మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ పొలం దున్నుతున్న ఫొటోను చూపించారు. ఆ చిత్రపటాన్ని చూసిన‌ ఆమె ‘వ్యవసాయం ఎలా ఉంది.. బాగా చేయండి’ అని నర్సింహారావుకు సూచించారు.

మా ఇంటికి మీ నాయనే ముగ్గు పోసిండు :
‘బిడ్డా మా ఇంటికి మీ నాయనే ముగ్గుపోసిండు. గుడిశెలో ఉండే నాకు కాలనీ ఇల్లు ఇచ్చిండు. ఇల్లు పూర్తయింది. కాలనీలో రోడ్లు గిట్ల పోయించాలె’ అంటూ బూడిదంపాడుకు చెందిన కేలోత్ భీమ్లా‌ నాయక్ మరో‌ ప్రజాప్రస్థానం యాత్ర గ్రామానికి రాగానే ఎంతో ఆనందంగా శ్రీమతి షర్మిలకు చెప్పారు. ‘సరే తాతా.. ఎలాగుంది ఆరోగ్యం.. జాగ్రత్త.. నాన్న కట్టించిన ఇంటికి జగనన్న రోడ్డు పోయిస్తాడులే..’ అని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. ‘ఏం తాతా బాగున్నావా.. ఏమైంది ముఖానికి? ఈ కణితి ఎప్పటి నుంచి ఉం ది? వైద్యం చేయించుకోవడం లేదా? మంచిగా వైద్యం చేయించుకో తాతా.. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు..’ అని మంచుకొండకు చెందిన బాణోత్ రాంకోటి అనే వృద్ధునికి‌ శ్రీమతి షర్మిల సూచించారు. సరే తల్లి మంచిగా చూపించుకుంటా.. నీ ఆరోగ్యం జాగ్రత్త అని రాంకోటి ఆమెతో అన్నారు.

నీ లక్ష్యం గొప్పది బిడ్డా...:
మంచుకొండ, బూడిదంపాడు గ్రామాల మధ్య ఇద్దరు వ్యక్తుల సహాయంతో శ్రీమతి షర్మిలను చూసేందుకు వచ్చిన మరో వృద్ధుడ్ని కూడా ఆమె పలకరించారు. సమస్య ఏమిటని అడిగారు. రెండు కళ్లూ కనిపించడం లేదని ఆ వృద్ధుడు తెలపడంతో మంచిగా వైద్యం చేయించుకో తాతా అని సూచించారు. పాదయాత్ర బూడిదంపాడు వద్దకు చేరుకునే సరికి ఎదురుగా ఓ ఆటో వస్తోంది. అందులో ఉన్న జానకమ్మ అనే వృద్ధురాలు శ్రీమతి షర్మిలను చూసి చేయి ఊపింది. శ్రీమతి షర్మిల ఆమె దగ్గరకు వెళ్లి పలకరించడంతో... ‘నీ లక్ష్యం చాలా గొప్పది బిడ్డా... మీ అన్నకోసం నువ్వు పడుతున్న శ్రమ వృథా కాదు తల్లీ.. మీరు గెలుస్తరు బిడ్డా.. మీ అన్న సిఎం అవుతడు..’ అని దీవించారు.

ఇలా ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకున్నారు శ్రీమతి షర్మిల. సమస్యలను సావధానంగా విన్నారు. ‘మీకు మేమున్నాం. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ అండదండలు ఉన్నాయి.‌ భవిష్యత్ మనదే.‌ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెస్తారు. అంత వరకు ఓపికపట్టండి..’ అంటూ శ్రీమతి షర్మిల ప్రజలకు భరోసానిచ్చారు. జిల్లాలో ఏడవ రోజు పాదయాత్ర ఆదివారం ఖమ్మం అర్బన్, కామేపల్లి మండలాల్లో కొనసాగింది.‌ శ్రీమతి షర్మిల కోసం అభిమానులు రహదారుల పైన ఎదురుచూశారు. ఆమెను చూసేందుకు చెట్టూ పుట్టలను సైతం లెక్కచేయకుండా పరుగులు తీస్తూ వచ్చారు. ప్రతిచోటా అపూర్వ స్వాగతం పలికారు.
Back to Top