పుష్కరం చెప్పిన పాఠం


న్యాయం కోసం ఎదురు చూస్తే ఆశాభంగమే తప్పదని మరోసారి రుజువు చేసింది పుష్కర దుర్ఘటన నివేదిక. అయినా దర్యాప్తు సంస్థలే జేబు సంస్థలని చంద్రబాబు ప్రకటించాక కూడా ఈ కమీషన్లు, నివేదికలు నిజాలను రాస్తాయని ఆశించడం ప్రజల వెర్రితనమే అవుతుంది. అధికారం ప్రదర్శించే అహంకారం, అధికారానికి లోబడి పనిచేసే వ్యవస్థలు, ఆ వ్యవస్థలను చెప్పుచేతుల్లో పెట్టుకునే అధికారం...అంతా ఒక విషవలయం. ఇందులో సామాన్యుడికి దక్కేది అవమానం, అన్యాయమే. 
గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన దుర్ఘటనకు కారకులెవరో రాష్ట్రం మొత్తానికీ తెలుసు. ఆ రోజు జరిగిన దుర్ఘటనలో ముఖ్యమంత్రి పాత్ర ఏమిటో అక్కడ విధులు నిర్వర్తించిన పోలీసులకు, సిబ్బందికి, భక్తులకు, బాధితులకూ కూడా తెలుసు. ఆ దుర్ఘటన తర్వాత కూడా బాధితులకు సహాయక చర్యలు అందడంలో జరిగిన ఆలస్యం, దానివల్ల కలిగిన నష్టం కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్కరికీ తెలిసింది... కానీ చివరకు ఏం జరిగింది? ఇందులో ప్రభుత్వానిది కానీ, చంద్రబాబుది కానీ బాధ్యతే లేదని తేల్చింది సోమయాజులు కమీషన్. పైగా ఆ దుర్ఘటనకు జరిగిన కారణాల విశ్లేషించిన తీరు చూస్తేనే అర్థం అవుతుంది, విచారణ ఎంత పేలవంగా జరిగిందో...ఆ నివేదిక ఎవ్వరికి అనుకూలంగా సాగిందో అని. ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వని సోమయాజులు కమీషన్ నివేదిక పుష్కర దుర్ఘటన సమయంలో చంద్రబాబు అక్కడలేరు...వెళ్లిపోయారు...
అంటే తొక్కిసలాట ముందు వరకూ చంద్రబాబు అక్కడే ఉన్నారని రుజువౌతోంది. సాధారణ భక్తుల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ లో ముఖ్యమంత్రి స్నానానికి వస్తే జరిగేదేమిటి? ప్రోటోకాల్ ప్రకారం అయినా, రక్షణ కోసమైనా సామాన్యు భక్తులను నదిలో దిగకుండా ఆపేస్తారు. అలా ఎంత సేపు ఆపారు అన్నదానికి సమాధానం ఈ కమిటీ నివేదికలో ఎందుకు ఇవ్వలేదు? అసలు విఐపి ఘాట్ ను కాదని చంద్రబాబు సాధారణ భక్తులు స్నానం చేసే ఘాట్ కు రావడానికి కారణం ఏమిటి?
దుర్ఘటనకు ప్రభుత్వం కారణం కాదు
అంటే పుష్కర దుర్ఘటనకు ప్రభుత్వ ఏర్పాట్లలో లోపం, నిర్వహాణా నిర్లక్ష్యం కారణం కాదని నివేదిక తేల్చేసింది. వేలాదిగా తరలి వస్తున్న భక్తులను ఒకే ఘాట్ కు తరలించడం నిర్వహణాలోపం కాదా? వివిధ రవాణా మార్గాల ద్వారా వస్తున్న ప్రజలను మరో ఘాట్ కు తరలించే ఏర్పాట్లు చేయకపోవడం నిర్వహణా లోపం అవ్వదా?
ఒకవేళ ఒకే ఘాట్ లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు, విఐపిల స్నానాలకోసం వారిని గంటలకొద్దీ నిరీక్షించేలా చేయడం ప్రభుత్వం చేసిన గొప్ప ఏర్పాటనుకోవాలా?
ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే సిగ్నల్ దగ్గర కూడా జాగ్రత్తగా కొద్దికొద్దిగా వాహనాలను వదిలి పెడతారు. అలాంటప్పుడు అన్ని వేలమంది ఉన్న చోట ఆ పని ఎందుకు చేయలేకపోయారు? ఒక్కసారిగా అంతమందిని ఎలా వదిలేసారు?  అంటే ఆ ప్రదేశంలో తగినంతమంది సిబ్బంది లేరన్నమాటే కదా?

ఇక పుష్కర ఏర్పాట్లలో భాగంగా సిసి టివి కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్టు పోలీసులు, ప్రభుత్వ అధికారులు చెప్పారు. మరి ఈ దుర్ఘటన సమయంలో సిసి కెమెరాల ఫుటేజ్ ఏమైంది?  దుర్ఘటన జరిగిన చాలా గంటల వరకూ అంబులెన్సులు ప్రమాద స్థలానికి చేరుకోలేక పోయాయి అని అప్పుడే మీడియాలో బాధితులు చెప్పారు.
అంటే పుష్కర ఏర్పాట్లలో ప్రమాదం జరిగితే అంబులెన్సులు అందుబాటులోనే ఉంచామని ప్రభుత్వం చెప్పిన మాట పచ్చి అబద్ధం అన్నమాట. అంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? అత్యవసర ఏర్పాట్లలో భాగంగా అంబులెన్సు వెళ్లలేని విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోవడం నిర్వహణాలోపంగా కమీషన్ కు అనిపించలేదా?
పుష్కరాల దుర్ఘటనకు ముఖ్యమంత్రికీ సంబంధం లేదు...
అసలు ఈ ఘటనకు మూలకారణం ముఖ్యమంత్రి ప్రచార వీడియో అని ఇన్నేళ్లుగా ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. టీవీ ఛానెల్స్ కూడా చంద్రబాబు పుష్కర స్నానం సమయంలో జిమ్మీలతో షూటింగ్ జరగడాన్ని చిత్రీకరించాయి. దర్శకుడు బోయపాటి డైరెక్షన్లో చంద్రబాబు కుటుంబం అంతా చిరునవ్వులతో షూటింగ్ లో పాల్గొనడాన్ని గంటలకొద్దీ ప్రసారం చేసాయి కూడా...మరి ఆ షూటింగ్ గురించి నివేదికలో ఎందుకు ప్రస్తావించలేదు?
బోయపాటి తీసిన ఆ వీడియో ఏమైంది?
అందులో చంద్రబాబు, పెద్ద ఎత్తున భక్తులకు సంబంధించి తీసిన విజువల్స్ ఈ ఘటనకు గల కారణాన్ని బైటపెడతాయనే ఆ విషయాలను నివేదికలో మరుగుపరిచారా?
గంటల తరబడి గేట్లు మూసి, ఒక్కసారిగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగిందని జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు?
ఇన్నాళ్లుగా పుష్కర ఘటనలో బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశించారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. కనీసం సోమయాజులు కమీషన్ నివేదిక వచ్చిన తర్వాత అయినా ఈ సంఘటనకు బాధ్యులెవ్వరో స్పష్టంగా బయటపడుతుందని ఆశించారు బాధితులు. కానీ రెండూ జరగలేదు. అధికారబలం ముందు న్యాయానికి ఓటమి ఎదురైంది. ఆ సంఘటనలో తమ వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఈ నివేదిక తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది....పుష్కరాలకు భారీగా తరలిరండి అని చెప్పిన ప్రభుత్వాలు నిర్వహణను గాలికొదిలేస్తాయా? ప్రజల రక్షణను పట్టించుకోవా? ప్రచారాలు తప్ప ప్రజల ప్రాణాలకు విలువే లేదా అని ఆక్రోశిస్తున్నాయి బాధిత కుటుంబాలు. అక్రమాలకు, అన్యాయానికి, అవినీతికి అధికారం అందిస్తే ఆఖరికి దక్కేది అన్యాయమే అని బాధపడుతున్నారు. పుష్కరం చెప్పిన ఈ పాఠాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.   
Back to Top