విత్తు చూపించి వందకాయలనడం బాబు స్టైల్. పునాది వేసి జాతికి అంకితం చేసేయడం చంద్రబాబు హాబీ. రాష్ట్రంలో అంగుళానికో పునాదిరాయి వేయిగల సమర్థుడు చంద్రబాబు. రాజధాని పేరు చెప్పి వేసిన రాళ్లు శిలాఫలకాలు తుప్పల్లో వెతుక్కోవాల్సిన దుస్థితి. అసలు పునాదిరాళ్ల సిఎంగా చంద్రబాబుకు పాతపేరే ఉంది. ఇప్పుడు కొత్తగా విశాఖలో ఐ హబ్ పునాది రాయి పేర మరో బండ నెత్తినేస్తున్నాడు చంద్రబాబు. రాళ్లుపాతడం తప్ప పనులు చేయడం బాబు చరిత్రలో లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విజనరీ లీడర్ అంటూ ప్రచారం చేసారు. కానీ బాబు విజన్ ఏమిటో ఆయన నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర తిరగేస్తే సులువుగా తెలిసిపోతుంది. అవినీతి, అధికార కాంక్ష తప్ప ఆయన విజన్ లో మరేదీ లేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి కేంద్రం అనుమతులివ్వడం లేదు కనుకే రాష్ట్రప్రభుత్వమే కట్టేస్తుందని బీరాలు పలికాడు. ప్రైవేటు భాగస్వామ్యంతో నెల తిరిగేలోపు పునాదిరాయి అన్నాడు. విశాఖ మెట్రో రైలుకు ప్రతిపాదనలు పంపినా అవి ఫలితం చూపకపోవడంతో మళ్లీ మెట్రోనూ తానే నిర్మిస్తానంటూ కబుర్లు చెప్పాడు. 8300 కోట్లు వ్యయం అయ్యే ఈ భారీ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో కట్టేస్తాన్నాడు. ఇవాళో రేపో పునాదిరాయి అన్నాడు.ఇక రాయపట్నం పోర్టకు కూడా రాయేసేస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకుందట. ఏడాదిలో కట్టేస్తామని చెప్పిన బందరుపోర్టుకు ఇంతవరకూ అతీగతీ లేదు. వేసిన పునాదిరాళ్లపైనే మళ్లీ పునాదిరాళ్లు వేయడమే బాబు స్పెషాలిటీ. దేవాదుల, సుజల స్రవంతి ప్రాజెక్టులు అలాగే రాళ్లమధ్య ఉండిపోయాయి. పోలవరం కూడా వైఎస్సార్ చొరవతో ప్రారంభం అయ్యింది కనుకగానీ లేకపోతే బాబు హయాంలో పోలవరం పేరే ఉండేది కాదన్నది జగమెరిగిన సత్యం. ఇక జిల్లాల వారీగా బాబు వేసిన పునాదిరాళ్లను పోగేస్తే ఓ పెద్ద ప్రాజెక్టో, బడా బిల్డింగో కట్టేయచ్చు. మచ్చుకు కర్నూలు జిల్లానే చూడండి. ఉర్దూ యూనివర్సిటీ, విత్తనోత్పత్తి కేంద్రం, మెగా ఆల్ట్రా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇంకా ఎన్నో పునాదిరాళ్లు వేసినా ఒక్కటి కూడా అమల్లో జరగడం లేదు. ఇదీ బాబు పునాదిరాళ్ల రాజకీయం. ప్రాజెక్టులు, పరిశ్రమలు, పోర్టులు, యూనివర్సిటీలూ, రాజధాని అంటూ వేసిన పునాదిరాళ్లు సమాధిరాళ్లుగా మారుతున్నాయి తప్ప అభివృద్ధికి ఆనవాళ్లుగా మాత్రం మారడం లేదు. ఎన్నో ఏళ్లుగా బాబు చేసే ఎఏన్నికల స్టంట్లలో ఈ పునాదిరాళ్లకు ప్రాధాన్యం ఉంది. ఈ పనులు జరగాలంటే మీరు నాకే ఓటేసి తీరాలంటూ ప్రజలను నమ్మబలికే విద్యలో బాబుకు డాక్టరేట్ ఉంది. కనుక ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. పునాదిరాళ్ల మాయలో పడితే ఐదేళ్లపాటు మళ్లీ ప్రమాదంలో పడిపోతారు జాగ్రత్త.