నేడు ‘చలో పోతిరెడ్డిపాడు’

బాబు సీమ ద్రోహానికి ప్రతిఘటన
 
తిరుపతి మాజీ శాసన సభ్యులు భూమన కరుణాకరరెడ్డి  అభిప్రాయం 

సీమ సమాజం నీళ్లను కలవరిస్తోంది, పలవరిస్తోంది. నీళ్లలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్నాయి. నీళ్లలో సుఖ సంతోషాలున్నాయి. నీళ్లలో నాగరికత ఉంది. నీళ్లలో సృష్టి రహస్యం దాగివుంది. నీళ్లలో బీడు భూముల్ని సస్యశ్యామలం చేసే మహాద్భుత శక్తి ఉంది. నీళ్లలో పవర్‌ ఉంది. నీళ్లలో అమ్మ ప్రేమ, తండ్రి సాంత్వన ఉన్నాయి. అసలు సమస్త ప్రపంచం మనుగడే నీళ్లలో ఉంది. 

అలాంటి నీళ్లకు రాయలసీమ సమాజం దశాబ్దాల తరబడి నోచుకోలేదు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాలే దిక్కు. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని అనే సామెత చందంగా రాయలసీమ వాసుల పరిస్థితి తయారైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా, వాడుకోలేని దయనీయ స్థితి. సీమకూ, కృష్ణా జలాలకూ అడ్డంకిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే సీమకు పట్టిన ‘చంద్ర’గ్రహణం బాబు అని మా కరవు సమాజం భావిస్తోంది.

మరో స్వాతంత్య్ర పోరాటం
బ్రిటిష్‌ వారి పీడన పాలనను ప్రత్యక్షంగా చూడని తరం... దాని గురించి కథలు కథలుగా విని ఉంటారు. కానీ బాబు పీడన పాలనను ప్రత్యక్షంగా చూస్తూ, నరకాన్ని అనుభవిస్తున్నాం.  రాయల సీమ అంటే కరవు పీడిత ప్రాంతం కాదు, బాబు పీడిత ప్రాంతమని గతంలో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. బాబు పీడన పాలన నుంచి రాయల సీమకు సాగు, తాగునీటి హక్కుల్ని సాధించుకునేందుకు మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన పరి స్థితి ఏర్పడింది. ఔను, రాయలసీమ ప్రజలు నీళ్ల కోసం అలమ టిస్తున్నారు. ఇక్కడి బీడు భూములు నీళ్ల కోసం నోళ్లు బార్లా తెరుచు కున్నాయి. నీళ్లంటే రాయలసీమ సమాజానికి ఒక కలగా మారింది.  

రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయంగా ఎదిగిన నారా చంద్రబాబు నాయుడు తన మాతృభూమికి చేసింది శూన్యం. కరవు ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తొమ్మిదేళ్లు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను చంద్రబాబు పాలించినా, ఏనాడూ కరవు ప్రాంతానికి గుక్కెడు సాగు, తాగునీళ్లు అందించాలన్న ఆలోచన చేసిన పాపాన పోలేదు. 

‘ఏ దేశ మేగినా ఎందుకాలిడినా
ఏ పీఠ మెక్కినా, ఎవ్వ రేమనిన
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవం’
అని మహాకవి రాయప్రోలు సుబ్బారావు జన్మనిచ్చిన గడ్డ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చంద్రబాబు సీఎం పీఠమెక్కినా, తానొచ్చిన ప్రాంతాన్ని విస్మరించడం, ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ఒక నాయకుడి విజన్‌ అంటే... సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం. తాను పాలిస్తున్న ప్రాంత జీవనోపాధి ఏంటో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సమృద్ధిగా సౌకర్యాలు కల్పించడం.

రాయలసీమ కరవు కాటకాలతో అల్లాడుతోందని అక్కడ పుట్టి పెరిగిన చిన్నపిల్లలకు కూడా తెలుసు. తొమ్మిదేళ్లుగా సీఎంగా ప్రజలు అవకాశం కల్పిస్తే, కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న చెడ్డపేరు తప్ప, ప్రజలు గుర్తించుకునేలా ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. అధికారంలో ఎంత కాలం ఉన్నామన్నది ముఖ్యం కాదు, ప్రజలకు ఏం చేశామన్నదే ప్రధానం.

మంచి పాలకులంటే, ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. భౌతికంగా మన నుంచి దూరమైనా, మానసికంగా సంబంధం కలిగి ఉండేలా పాలించాలి. అలాంటి ఘనతను దివంగత వైఎస్‌ రాజశేఖర రెడ్డి దక్కించుకున్నారు. రాయలసీమ సమాజం ఆయనను అపర భగీరథుడిగా ఆరాధిస్తోంది. ఈ ప్రజాభిమానం ఊరకే రాలేదు. రాయలసీమకు తాగు, సాగునీళ్లు అందించేందుకు ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన కృషిని కరవు (బాబు) పీడిత సమాజం గుర్తించింది. 

సాగు, తాగునీటికి గేట్‌ వే! 
సాగు, తాగునీళ్ల విలువ బాగా తెలిసిన రాజశేఖరరెడ్డి, 2004లో అధికారంలోకి వచ్చిన వెంటనే పోతిరెడ్డి హెడ్‌ రెగ్యులేటర్‌ సామ ర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి ఏకంగా 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పట్లో ఈ పెంపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వివా దానికి దారి తీసింది. ఇటు కాంగ్రెస్‌లోని స్వపక్షం, అటు చంద్రబాబు నాయకత్వంలోని విపక్షం కలిసి రాజశేఖరరెడ్డిపై దండెత్తాయి. ఎవరెంతగా ఒత్తిడి తెచ్చినా, రాయలసీమకు సాగు, తాగునీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన భీష్మించారు. అదీ మాతృగడ్డపై ప్రేమ అంటే! కరవు  ప్రాంతానికి నీళ్లు అందించి, పీడన నుంచి విముక్తి కల్పించాలనే నిజమైన సంకల్పం ఉన్న నాయకులు చేయాల్సిన పని. అందుకే రాయలసీమ గుండెల్లో వైఎస్సార్‌ కొలువుదీరారు.

తండ్రి ఆశయ సాధనలో భాగంగా 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో పది అడుగులు ముందు కేశారు. రాయలసీమను శాశ్వతంగా కరవు నుంచి విముక్తి చేసేందుకు రూ. 3,825 కోట్ల ఖర్చుతో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూపకల్పన చేశారు. 2023 ఆగస్టు 11న జగన్‌ ప్రభుత్వం మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టింది.  
ఈ ప్రాజెక్ట్‌ రూపకల్పన వెనుక ఎంతో దూరదృష్టి ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే 854 అడుగులకు చేరినప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేసే అవకాశం. అది కూడా రోజుకు 7 వేల క్యూసెక్కులు మాత్రమే. ఈ పద్ధతిలో ఎప్పటికీ రాయలసీమను సస్యశ్యామలం చేయలేమని జగన్‌  భావించారు. 854 అడుగుల కంటే ఒక అడుగు తక్కువ ఉన్నా పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరూ అందదు. ఈ ఇబ్బందిని గమనించి, రావాల్సిన నీటిని 800 అడుగుల నుంచే తీసుకునేలా పోతి రెడ్డిపాడు దిగువన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నీటిని పోతిరెడ్డిపాడు కాలువలో ఎత్తిపోసే పనులు చేపట్టడం ఒక చరిత్ర. రాయలసీమ పాలిట సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టిన మహా నాయకుడిగా, తండ్రిని మించిన తనయు డిగా వైఎస్‌ జగన్‌ ను కరవు ప్రాంతం గుర్తుంచుకుంటుంది. 

అడుగడుగునా అడ్డంకులు
శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులకు చేరుకోకపోయినా, 800 అడుగుల నుంచే హక్కుగా రావాల్సిన నీటిని దక్కించుకోవచ్చని రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించడంపై కరవు ప్రాంతం ఆనందానికి అవధుల్లేవు. 2024 మే నెల నాటికి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కు సంబంధించి రూ.990 కోట్ల విలువైన పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే దక్కింది. అయితే ఆ ప్రాజెక్ట్‌ రూపకల్పన సమయంలోనే చంద్రబాబు నేతృత్వంలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేయించి, రాక్షసుల్లా అడ్డంకులు సృష్టించడం జగమెరిగిన సత్యం. ఈ అడ్డంకుల్ని లెక్క చేయకుండా మా ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు పూర్తి చేయడంలో అడుగులు ముందుకే వేసింది. అందుకే ఆ మాత్రం పనులు పూర్తయ్యాయి.

ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పొరుగు రాష్ట్రంలో శిష్యుడైన రేవంత్‌రెడ్డి ప్రలోభాలకు తలొగ్గి, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల్ని అర్ధంతరంగా నిలుపుదల చేసింది. తాను చెప్పడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనుల్ని నిలుపుదల చేసినట్టు అసెంబ్లీ వేదికగా రేవంత్‌రెడ్డి ప్రకటించడం ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయి. సీమకు కృష్ణా జలాలు అందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేలకు జగన్‌ పెంచడమే ఒక అద్భుతం. రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నైకి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఒక సంజీవనిగా జగన్‌ భావించారు. సాగు, తాగునీళ్లకు నోచుకోని రాయలసీమ ప్రాంతా నికి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఇక ఇన్సూరెన్స్‌ పాలసీగా భావించి జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకొస్తే, దాని గొంతుకోసిన పాల కుడిగా చంద్రబాబు చరిత్రలో చీకటి అధ్యాయాన్ని రాసుకున్నారు. 

పోరాడితే పోయేదేమీ లేదు!
రాయలసీమకు తాగు, సాగునీటితో పాటు నెల్లూరు సాగునీటికి చేస్తున్న ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఫిబ్రవరి 5న ‘చలో పోతిరెడ్డిపాడు’ తలపెట్టింది. ఇది రాయలసీమ సమాజం చేపట్టిన నీటి స్వాతంత్య్ర పోరాటంగా చూడాలి. తమ ప్రాంతానికి చంద్ర బాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టడానికి రాయలసీమ, అలాగే నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాతో పాటు ప్రజానీకాన్ని అక్కడికి వెళ్ల కుండా నిలువరించాలని చంద్రబాబు సర్కార్‌ కుట్రలు చేస్తోంది. 

యావత్‌ బాబు పీడిత సమాజానికి వాస్తవాలు తెలియకూడ దనేదే ప్రభుత్వ దురుద్దేశంగా కనిపిస్తోంది. బాబు సీమ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే పోయేదేమీ లేదు... సాగు, తాగునీళ్లను సాధించుకోవడం తప్ప! తద్వారా గొంతుల్ని తడుపు కోవచ్చు, బీడు భూముల్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. పచ్చని పంటలతో కోనసీమను తలపించేలా రాయలసీమను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ వస్తే, తిరుపతి పూర్తి దాహార్తి కూడా తీరుతుంది. రాయలసీమ వ్యాప్తంగా 9.6 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించి కరవు నుంచి విముక్తి చేయాలన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కలిసి పోరాడుదాం. ఆశయ సాధనలో పిడికిలి బిగిద్దాం. 

రాయలసీమ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీ ఉద్యమబాట పట్టింది. అయితే రాజకీయ విభేదాలు సృష్టించడం చంద్రబాబుకు తెలిసిన విద్య. రాయలసీమ విడిపోవడమే చంద్రబాబుకు బలం. కావున రాయలసీమను సస్యశ్యామలం చేసుకునేందుకు సాగు, తాగునీటి హక్కుల కోసం చేపట్టే నీటి స్వాతంత్య్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వేడుకుంటున్నా. మన భవిష్యత్‌ తరాలకు తాగు సాగునీళ్ల కంటే మనమిచ్చే ఆస్తి మరొకటేదీ లేదు. ఎందుకంటే, ఈ ఆస్తికి వెలకట్టలేం!  

 

Back to Top