ఇంటింటా టీడీపీకి భంగపాటు

దొంగే... దొంగా దొంగా అని అరిచినట్టుంది టిడిపి నాయకుల తీరు. ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ పునాదులతో సహా భూస్థాపితం అయిపోతుందనే భయంతో, 2014లో అధికారమే లక్ష్యంగా నోటికొచ్చిన వాగ్గానాలు ఇచ్చేశాడు చంద్రబాబు. మొత్తానికి అతికష్టం మీద అధికారం దక్కించుకున్నాడు. ఆ తర్వాత యథాబాబు తథా పాలన అన్నట్లుగా తెలుగు తమ్ముళ్ల దోపిడీ తప్ప ప్రజలకిచ్చిన వాగ్గానాల ఊసే లేకుండా పక్కన పెట్టేశాడు. ఎవరైనా ఎదురుపడి నువు చెప్పిన మాటేం చేశావయ్యా బాబూ అని అడిగితే, నా రోడ్డు మీద నుంచున్నావ్, నా గాలి పీలుస్తున్నావ్, నా నీళ్లు తాగుతున్నావ్ అంటూ నోటికొచ్చింది మాట్లాడి దబాయించే పనిలో పడ్డాడు. మొత్తానికి అలా అడ్గగోలుగా ప్రజల్ని బెదిరిస్తూనే మూడున్నర సంవత్సరాలు గడిపేశాడు. నమ్మి ఓట్లేసిన ప్రజలేమో కక్కలేక మింగలేక అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. 

బాబుగారి నయవంచనను మొదటినుంచీ ఎండగడుతున్న ప్రతిపక్షం ప్రభుత్వానికి అస్సలు మింగుడుపడటం లేదు. దానికి తోడు ప్రతిపక్షనాయకుడు ఈ మధ్య ప్రకటించిన  నవరత్నాలు ప్రజల్లోకి బాగా వెళ్లడంతో ఎల్లోనాయకులకు భవిష్యత్తు భయం పట్టుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏమి నెరవేర్చిందో, ఎంత మోసం చేసిందో ఇంటింటికీ వెళ్లి తెలుసుకోవాలని వైయస్ జగన్ తన సైన్యానికి పిలుపునిచ్చారు. గడప గడపకు వెళ్లి ప్రజల అభిప్రాయాలు, వారి కష్టాలు తెలుసుకుని వైయస్సార్ కుటుంబంలో వారిని సభ్యుల్ని చేయాలని చెప్పారు. దీంతో టిడిపి శిబిరంలో అలజడి పెరిగిపోయింది. ఏదో ఒకటి చేసి ప్రజల్ని మాయచేయాలని, ప్రతిపక్షనాయకుడి మంచి ఆలోచనను అడ్డుకోవాలని కంకణం కట్టుకున్నాడు బాబు. అదే ఆదేశాలను తన బ్యాచ్ మొత్తానికి జారీ చేశాడు. ఇంకేముంది, జగన్ ఇంత మంచి ఆలోచన చేశాక కూడా ఇంకా మనం కొత్తగా ఆలోచించడం మూర్ఖత్వం అవుతుందని అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేశారు. తామూ గడప గడపకు టిడిపి అంటే పోలా..! అని సింపుల్ గా తేల్చేశారు. యథావిధిగా ఒకరిది లాక్కుని తనదని చెప్పకోవడంలో చంద్రబాబుకి దొరికే కిక్కేవేరు కాబట్టి ఆయన జెండా ఊపేశారు. 

అంతా బాగానే ఉంది కానీ, అసలు సమస్య ప్రజలదగ్గరకు వెళ్లినప్పుడే అర్థమైంది టిడిపి నాయకులకు. ఏ గుమ్మం తొక్కినా, నువ్వేం చేశావని ఇక్కడికొచ్చి అడుగుతున్నావ్, ఏం చెప్పాలి నీకు? నువ్వేం చెయ్యనక్కర్లేదు ఇంకో ఏడాది ఇలాగే నీ పనిలో ఉండు అని జనం రివర్స్ లో ఝలక్ ఇస్తున్నారట. కాల్వ శ్రీనివాసులు లాంటి వాళ్లకయితే కాగితాలు ముఖంమీద విసిరికొట్టి మరీ బయటకు పొమ్మన్నారట. అయినా చేసిందంతా చేసి.. ఇప్పుడు నీకు ఏ పథకాలొచ్చాయి? ఏ మాఫీ అయింది అని అడిగితే ప్రజలకు కాలదా మరి. దొంగే దెబ్బలకు భయపడి రోడ్డుమీదకొచ్చి దొంగా... దొంగా... అని అరిచినట్లు, మోసం చేసినవాళ్లే గుమ్మంలోకి అడుగుపెట్టి కుశలప్రశ్నలు వేయాలంటే ఎంతైనా వాళ్లు బాబుగారి మనుషులై ఉండాలి. ఆయన నిప్పు సెగ తగిలితేనే అది సాధ్యం. 

Back to Top