<br/>సంస్కార వంతుడికి అహంకారికీ ఉన్న తేడా తెలియాలంటే వైఎస్ జగన్ ను చంద్రబాబును గమనిస్తే చాలు. ప్రజలతో మాట్లాడా తీరులో ఈ ఇద్దరు నాయకులకు ఎంతో తేడా ఉంటుంది. చంద్రబాబు ప్రతిమాటలో అధికారం ఇచ్చిన అహంకారం ప్రతిఫలిస్తుంటుంది. ప్రతిపక్షంలో ఉన్న యువ నాయకుడి కంఠంలో అంతులేని సంస్కారం తొణికిసలాడుతుంది. శ్రీకాకుళాన వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు వారి బాధలను గుర్తించకపోగా, బుల్డోజర్లతో తొక్కిస్తా, తాట తీస్తా తమాషాలా అంటూ చిందులు తొక్కడం చూసాం. ప్రజాస్వామ్యానికి దేవుళ్లు ప్రజలే. పాలకులకు ఆ అధికార పీఠం అందించిన ఓటర్లు ప్రజలే. అలాంటి వారిని ఎంతో అవమానకరంగా మాట్లాడే కుసంస్కారం చంద్రబాబులో కనిపిస్తుంటుంది. ఒక్కసారి గద్దెనెక్కితే చాలు, ఇక నియంతలా నచ్చినట్టు చేయడం చంద్రబాబు అలవాటు. <br/>కానీ వైఎస్ జగన్ పదేళ్ల రాజకీయ జీవితాన్ని వెదకి చూసినా మచ్చుకు కూడా అలాంటి అమానవీయమైన మాటలు, దూషణలు మచ్చుకు కూడా కనిపించవు. ఒకటి మాత్రం నిజం...ఏ ప్రజల కోసమైతే తన తండ్రి ప్రతిక్షణం పరితపించాడో వారికోసమే, వారికి జరిగిన అన్యాయాలపైనే వైఎస్ జగన్ తన విమర్శల బాణాలు ఎక్కుపెట్టాడు. ప్రభుత్వం ప్రజలకోసం కాకుండా తమకోసం పని చేసుకోవడాన్ని అడుగడుగునా ప్రశ్నించాడు. సుపరిపాలన చేయమని అధికారం ఇస్తే స్వపరిపాలన, స్వజనుల పరిపాలన చేసుకోవడాన్ని అనునిత్యం అడ్డగించాడు. అవినీతి ప్రభుత్వాన్ని ఆగ్రహంతో తిట్టాడేమో కానీ, ఎలాంటి ప్రతికూలతల్లోనూ తన అసహనాన్ని ప్రజలపై ప్రదర్శించలేదు. తనపై దారుణమైన విమర్శలకు పాల్పడ్డవారికి కూడా నిరూపించమని సవాల్ విసిరాడే కాని, దిగజారి బజారుకెక్కలేదు. తన వెన్నంటి నడిచి, తన పార్టీ జెండాను అడ్డుపెట్టుకుని గెలిచి, చివరకు అధికార పార్టీకి అమ్ముడుపోయిన నేతలను కూడా పల్లెత్తు మాట అనని సంస్కారి వైఎస్ జగన్. ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా వారందరూ తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు రావాలంటూ డిమాండ్ చేసారా ప్రతిపక్ష నేత. అసెంబ్లీ సమావేశాల్లో అధికారపక్షం ప్రతిపక్ష సభ్యులను అవమానించినప్పుడు సైతం ఎంతో హుందాగా తన ఆగ్రహాన్ని వెలిబుచ్చి, ప్రజాసమస్యలకు వేదిక కాని చోటు మాకు అక్కర్లేదని చెప్పి జన స్రవంతిలోకి అడుగుపెట్టిన అభిమానవంతుడు వైఎస్ జగన్. <br/>ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్కచిన్న ఉదాహరణ చాలు అహంకారి సముద్రంమంత గొప్పవాడు కావచ్చు. కానీ ఆ సముద్రం నీళ్లు ఒక్కడి దాహం కూడా తీర్చలేవు. సంస్కారవంతుడు బావిలాంటి వాడు. తోడే కొద్దీ ఊరే నీటిలా అతడు ఎందరి ఆర్తినో తీరుస్తాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం కలవాడే కావచ్చు, కానీ ప్రజల మనసులను గెలుచుకునే నాయకుడు ఎప్పటికీ కాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోనే ఉండొచ్చు...కానీ ప్రతి గుండెనూ కదిలించి అందరివాడనిపించుకున్నాడు. తనపై నమ్మకాన్ని నిర్మించుకున్నాడు.