‘సాయం’ కాదది మోసం

– ఈఏపీల పేరుతో కాలయాపనకు టీడీపీ, బీజేపీల కుట్ర
– పోలవరం అంచనా వ్యయం ఇప్పటికీ తేల్చని ప్రభుత్వాలు
– మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కొత్త ఎత్తుగడ 

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక సహాయాన్ని సాధించానని.. ప్రజల ఆకాంక్ష నెరవేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ, మండలిలో ప్రకటించి.. ప్రతిపాదించి.. తీర్మానం చేశారు. అయితే ప్రజలు నిజంగా కోరుకున్నది సాయమేనా.. ఆంధ్రాకు ప్రత్యేక హోదా అవసరం లేదా అనేది అసలు ప్రశ్న. కేంద్రం ప్రకటించిన ఈ సాయంతోనే హోదాను మించిన అభివృద్ధి జరుగుతుందా..? కేంద్రం మనకు ఏ విధంగా సాయం చేయబోతోంది.. వంటి విషయాలు చాలా మందికి సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోయే ఉన్నాయి. ఎంతిస్తారో కేంద్రం చెప్పదు.. ఇంత కావాలని చంద్రబాబు నిలదీయడు సరికదా కనీసం కేంద్రాన్ని నోరు తెరిచి అడిగే ధైర్యం లేదు. ఎంతిస్తే అంత తీసుకోవడం తప్ప చేసేదేమీ లేదని సిగ్గు విడిచి చెప్పుకున్నాడు. 

హామీలలో స్పష్టత లేదు
ఇంతకూ 2017 మార్చి 15 సాయంత్రం కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం ఏమిటి? దానివల్ల కొత్తగా రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఏమిటి? ’’ఐదు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రం అంగీకరించింది. అంతవరకైనా వచ్చిందని సంబర పడే అవకాశం మాత్రం లేదు.  2015 నుంచి 2020 మధ్య రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇచ్చివుంటే కలిగే లాభానికి సమానంగా ప్రత్యేక సహాయం ఉంటుంది అని చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర స్కీములలో రాష్ట్ర వాటా పది శాతం మాత్రమే ఉండి 90 శాతం కేంద్రం భరిస్తుంది. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు స్కీమును బట్టి కేంద్రం 50 శాతం గాని, 60 శాతం గాని భరిస్తుంది. 2017 మార్చి 15న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఈ అంశం లేదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో పరిశ్రమలకు పన్ను మినహాయింపులు, రాయితీలుగాని ఉన్నాయి. ఈ ప్రత్యేకత వల్ల కొన్ని పరిశ్రమలను ఆకర్షించే వీలుంటుంది. 2017 మార్చి 3న నిర్ణయంలో ఈ అంశం లేదు.

కాలయాపన కోసమే ఈఏపీలు.. 
2017లో నిర్ణయం ప్రకటిస్తూ రెండేళ్ల వెనక నుంచి అంటే 2015–16 నుంచి ’’ప్రత్యేక హోదా ఇచ్చివుంటే’’ అని చెప్పడం చెవిలో పువ్వు పెట్టడమే. ఇదే నిర్ణయం 2015–16 లోనే ప్రకటిస్తే ఈఏపీల(ఎక్సట్రనల్లీ ఎయిyð డ్‌ ప్రాజెక్టు)ను వెంటవెంటే కుదుర్చుకునే వ్యవధి ఉండేది. 2017లో ప్రకటించడంలోని ఆంతర్యం ఏమిటంటే రెండేళ్ల వెసులుబాటు లేకుండా చేయడమే కేంద్రం ఎత్తుగడ. ఈఏపీలు నెగోషియేట్‌ చేయటానికి, మదింపు చేయడానికి, నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం అనుమతివ్వడానికి సమయం చాలా అవసరం. తీరా ఒప్పందం కుదిరాక అది అమలు కావడానికి ఇంకా సమయం పడుతుంది. 2019–20 లోపు అమలు జరిగే వీలు దాదాపు లేదు. శాసనమండలిలో ముఖ్యమంత్రిని ఈ విషయంపై అడిగితే వివరణ స్పష్టంగా ఇవ్వలేక పోయారు. రాజధాని నిర్మాణం విషయంలో ఈఏపీలు విదేశీ సంస్థలతో కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఏదీ ఓ కొలిక్కిరాలేదు.  కనుక కేంద్ర ప్రభుత్వం 2017 మార్చి 15న చేసిన గొప్ప నిర్ణయంతో మనకు అదనంగా ఒరిగిందేమిటి? దేనికి మన ప్రజలు, చట్టసభలు, ముఖ్యమంత్రితో సహా కృతజ్ఞతా భారంతో కేంద్రం ముందు మోకరిల్లాలి.

పోలవరం లెక్కల్లో అన్నీ చిక్కులే.. 
ఇక మిగిలింది పోలవరం ప్రాజెక్టు. ఇది ఎటూ జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని విభజన చట్టమే స్పష్టం చేసింది. మోడీ ప్రభుత్వం అదనంగా చేసిందేమిటి? మొదటిది ముంపు మండలాలను మన రాష్ట్రంలో కలపడం. అంటే పునరావాస సమస్యను మన రాష్ట్రానికే కట్టబెట్టి తాను తెలివిగా తప్పుకుంది. కలపక పోయివుంటే తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం పెట్టివుండేదని, పోలవరం ప్రాజెక్ట్‌ నిలిచిపోయేదని, కనుక ముంపు మండలాలను కలపడం మనకు పెద్ద ఉపకారం అని చంద్రబాబు అంటున్నారు. ఒకసారి జాతీయ ప్రాజజెక్టును చేపట్టాక కేంద్రానిదే బాధ్యత అవుతుంది. ఇప్పుడు నిధులు ఇవ్వడం తప్ప కేంద్రానికి ఏ బాధ్యతా లేదు. పోనీ, ప్రాజెక్టు వల్ల లాభపడేది మన రాష్ట్రం గనుక మనమే నిర్మాణ బాధ్యత తీసుకుంటే త్వరగా పూర్తిచేసుకోవచ్చు కదా అని వాదించవచ్చు. దానికి అంగీకరిద్దాం. అయితే కేంద్రం తీసుకున్న బాధ్యత ఏమిటి? 2014 ఏప్రిల్‌ 1 తర్వాత ఖర్చును మాత్రమే కేంద్రం భరిస్తుందట. అంతకు మునుపే రూ.4 వేల కోట్లు ఖర్చయింది. అది కేంద్రం ఇవ్వదు. ఆ తర్వాత కూడా జలవిద్యుదుత్పత్తి కంపోనెంట్‌ సుమారు రూ.4 వేల కోట్లు కేంద్రం ఇవ్వదు. 2010–11 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా సుమారు రూ.16,000 కోట్లు. ఇందులో విద్యుదుత్పత్తి కంపోనెంట్‌ తీసేస్తే మిగిలింది రూ.12,000 కోట్లు. దానిలో 2014కు ముందు ఖర్చయింది తీసేస్తే మిగిలింది రూ.8 వేల కోట్లు. దీనిలో ఇంతవరకు ఇచ్చింది రూ.2,915 కోట్లు. అంటే మరో రూ.5 వేల కోట్లు వస్తాయన్నమాట. 2010–11 అంచనాలను మించిపోయి ప్రాజెక్టు వ్యయం పెరిగింది. తాజా లెక్కలేమిటో ప్రభుత్వం బైటపెట్టడం లేదు. గత సంవత్సరం కేంద్రానికి సహాయం కోరుతూ రాసిన లేఖలో ముఖ్యమంత్రి సుమారు రూ.36 వేల కోట్లు పోలవరానికి అవసరం అని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చయింది అన్నదాన్ని బట్టి కేంద్రం అంత మొత్తం చెల్లిస్తుందని అనుకుంటే పొరబాటే. కేంద్ర పరిశీలకులు ఎంత ఖర్చును ఆమోదిస్తే అంతే ఇస్తారు. రాష్ట్రం ఎంత అడిగిందో ప్రకటించలేదు. కేంద్రం అందులో ఎంత ఆమోదించిందో దానినీ ప్రకటించలేదు. 

మూడేళ్లలో కేంద్రం ఇచ్చింది రూ.9445 కోట్లే
బీజేపీ నాయకులేమో రూ.1 లక్ష కోట్లకు పైగా మన రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టుల కింద ఇచ్చేసినట్టు, ఇస్తున్నట్టు ప్రకటించేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగారు కృతజ్ఞతలు చెప్పేస్తున్నారు. ఇంతకూ విభజన అనంతరం కేంద్రం నుంచి మనకు వచ్చిన ప్రత్యేక నిధులు ఎంతమొత్తం? నిన్న శాసనమండలిలో ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం అయితే రూ.9,445 కోట్లు అన్నింటినీ కలిపి ఇప్పటి దాకా వచ్చింది. రావల్సినదెంత? 2014–15 ఆర్థిక సంవత్సరానికి వనరుల సమీకరణలో వచ్చిన రిసోర్స్‌ గ్యాప్‌ రూ.14 వేల కోట్లు. అమరావతి నిర్మాణానికయ్యే ఖర్చు (చంద్రబాబు రూ.48 వేల కోట్లు కోరారు) రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి(రాయలసీమకు రూ.24 వేల కోట్లు అడిగారు). ఇవిగాక కేంద్ర యూనివర్సిటీలు, విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, పరిశోధనా కేంద్రాలు విభజన చట్టం ప్రకారం కేంద్రమే నెలకొల్పాలి. ఇవన్నీ కలుపుకుంటే మన రాష్ట్రాన్ని విడగొట్టినందుకు కేంద్రం చెల్లించడానికి ఒప్పుకున్న పరిహారం రూ.1 లక్ష కోట్లకు పైబడే ఉంటుంది. కానీ చెల్లించిందెంత? మూడేళ్లలో రూ.9,445 కోట్లు! దీనికే మురిసిపోయి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు ముఖ్యమంత్రి. నిజాయితీ ఉంటే విభజన చట్టం నిర్దేశించిన ప్రకారం ఏ పద్దు క్రింద కేంద్రం ఎంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందో చంద్రబాబు నిర్దిష్టంగా డిమాండ్‌ చేసి దానిని ప్రజలకు తెలియజెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం తానెంత ఇవ్వదలచిందీ తనవైపు నుంచి తెలియజెయ్యాలి. తేడా ఉంటే తేల్చుకోవాలి. లేకపోతే ప్రజలే తేలుస్తారు.
Back to Top