నంద్యాల‌లో పోటెత్తిన ఓటరు

- మ‌ధ్యాహ‌నానికి 50 శాతం పైగా పోలింగ్‌
- మ‌హిళ‌ల్లో చైత‌న్యం
 - ఉప ఎన్నిక‌లో రికార్డు స్థాయిలో పోలింగ్ 

నంద్యాల‌: న‌ంద్యాల ఉప ఎన్నిక‌లో ఓట‌ర్లు పోలింగ్ బూతుల‌కు క్యూ క‌ట్టారు. గ‌తంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ న‌మోదు అవుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో 2,18,858 మంది ఓట‌ర్లు ఉండ‌గా మధ్యాహ్న‌నానికే 50 శాతం పైగా ఓట్లు పోల్ అయ్యాయి. నంద్యాల నియోజక వర్గం ఏర్పాటు తర్వాత ఇప్పటికి 14 సార్లు శాసన సభ ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో నంద్యాల పట్టణంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. కొత్తగా చేరిన యువ ఓటర్ల సంఖ్యే దీనికి ముఖ్య కారణం. 2014లో జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 78,590 ఓట్లు పోలయ్యాయి. అంతకు ముందెన్నడూ ఓటింగ్ శాతం ఇంత ఎక్కవగా లేదని ఎన్నికల సంఘం ప్రకటించడం విశేషం. ఆ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌  సిపి అభ్యర్థి భారీ మెజారిటీతో విజయం సాధించడం గమనించాల్సిన విషయం. జాతీయ పార్టీ, ఏళ్లూగా వేళ్లూనుకున్న ప్రాంతీయ పార్టీని కాదని పసికందులాంటి వైయ‌స్ఆర్‌ సిపి పార్టీనుండి అభ్యర్థిని గెలిపించుకుంది నంద్యాల. 

ప్రస్తుత ఉప ఎన్నికల్లోనూ ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూతులకు తరలి వస్తున్నారు. తెల్లవారు ఝాము నుంచి పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు. మునుపటి ఎలక్షన్లో కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓటింగ్ కు హాజరౌతున్నారని ప్రాథ‌మిక అంచనా. పోలింగ్ ఆరంభమైన తొలి మూడు గంటల్లోనే 30 నుండి 40 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం సమయానికే 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి మొత్తంగా ఒక లక్షా పదహారు వేల ఓట్లు పోలయ్యాయి. గ్రామీణ ప్రాంతంలోనూ ఇప్పటికే 60 శాతం ఓట్లు పోలైనట్టు అధికారిక వర్గాలు చెబుతుండగా, ఇదంతా నంద్యాల సైలెంట్ ఓటర్ మహిమ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నంద్యాల్లో మైనారిటీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారు తమ వర్గానికి మేలు చేసే పార్టీని ఎన్నుకునే అవకాశాలే ఎక్కువని ఎన్నికల నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎండని కూడా లెక్క చేయకుండా క్యూలైన్లలో బారులు తీరి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరిలో అత్యధికశాతం మహిళలే ఉండటం గమనార్హం. దాదాపుగా 60వేల మహిళా ఓట్లు పోలవ్వగా, 56వేలు పురుషుల ఓట్లు పోలైనట్లు అధికారిక సమాచారం. 

ఎన్నిక‌ల నియ‌మావ‌ళి పాటించ‌ని టీడీపీ
ఒక పక్క అధికార పార్టీ నేతలు, మంత్రులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ రోజు ప్రచారం చేయకూడదు. కాని మంత్రి అఖిలప్రియ తన కాన్వాయ్ లో ప్రచారం చేస్తూ తిరుగుతుండగా, మంత్రి నారాయణ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా జరిగిన ప్రచార పర్వానికి, ఓటర్ల చైతన్యం తోడై సంక్షేమ పాలకుడిని ఎంచుకునే క్షణంలో నంద్యాల ఓటరు ఎవరికి పీఠాన్ని అందిస్తారో వేచి చూడాల్సి ఉంది. నంద్యాల సమరంలో విజయం ఎవరిదో తేలాల్సి ఉంది. 
Back to Top