ముగ్ధుల్ని చేస్తున్న షర్మిల పలకరింపు

రాజానగరం, 08 జూన్ 2013:

పదేళ్ళ క్రితం నాటి పలకరింపు తూర్పు గోదావరి వాసులను ముగ్ధులను చేస్తోంది. వారిని మైమరపింపజేస్తోంది. జిల్లా ప్రజలంతా పదేళ్ళనాటి డాక్టర్ వైయస్ రాజశఖరరెడ్డి ఆత్మీయతను గుర్తుతెచ్చుకుంటున్నారు. శ్రీమతి షర్మిల పలకరిస్తున్న విధానం వారిలో పదేళ్ళనాటి స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకునేలా చేస్తోంది.
‘బాగున్నారయ్యా...బాగున్నావమ్మా...ఏం చేస్తున్నావయ్యా.. పిల్లలెట్టున్నారు..’ ఆత్మీయత తొణికిసలాడే ఈ పలకరింపు ప్రజలను పులకరింపజేస్తోంది. రాజన్న లేకున్నా ఆయనలాగే ఆయన కుటుంబమంతా తమ సంక్షేమం కోసం తపిస్తోందన్న నమ్మకాన్ని బలపరుస్తోంది. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రతో తమ సమక్షానికి వస్తున్న షర్మిల ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలకరిస్తున్న తీరు పల్లెవాసులను ముగ్ధులను చేస్తోంది.

కాంగ్రెస్ ప్రజా కంటకపాలనకు, చంద్రబాబు కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం రాజానగరం నియోజకవర్గంలోని పల్లెల మీదుగా సాగింది. మండుతున్న సూరీడు శాంతించగా, వరుణుడు కూడా ఆమె వెంట  సాగాడా అన్నట్టు పాదయాత్రను వర్షం వెన్నాడింది. ఓ పక్క ప్రజలు కురి పించే అభిమాన వర్షంలో, మరో పక్క కుండపోత వర్షంలో తడిసి ముద్దవవుతూనే రాజన్న బిడ్డ యాత్ర సాగించారు.

ఉదయం పది గంటల సమయంలో రాజానగరంలోని పూసర్లరావు స్థలంలోని బస నుంచి ప్రారంభమైన నాలుగో రోజు (జిల్లాలో) పాదయాత్ర రాజానగరం, ఫరిజల్లిపేట గ్రామాల మీదుగా కానవరం సమీపంలోని పొలాల వరకు సాగింది. భోజన విరామం అనంతరం సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభ మై కానవరం, తోకాడ మీదుగా మల్లంపూడి వరకు సాగింది.

మహానేత విగ్రహావిష్కరణ
కానవరంలో మహానేత డాక్టర్ వైయస్ విగ్రహాన్ని శ్రీమతి షర్మిల ఆవిష్కరించారు. పాదయాత్ర సాగే దారిలో లేకున్నా  తాము ఏర్పాటు చేసుకున్న మహానేత విగ్రహాన్ని ఆయ న తన యతో ఆవిష్కరింపజేయాలని భావించిన గ్రామస్తులు మేళతాళాలతో  ఆమెకు ఎదురేగారు.  విగ్రహావిష్కరణ సమయంలో ‘జోహార్ వైఎస్సార్, జై జగన్’ అన్న నినాదాలతో గ్రామం మార్మోగింది. ఫరిజల్లిపేటలో జీడిపప్పు వలుస్తున్న కార్మికులు వాటిని షర్మిలకు ఆప్యాయంగా తినిపించి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆ గ్రామంలోనే చిన్నారులు ప్రేమగా పూలబొకే తెచ్చి ఇవ్వగానే షర్మిల వారి నుదుటిపై ముద్దాడి ‘ఇంట్లో దాచుకుంటాను’ అనడంతో వారు కేరింతలు కొట్టారు. దారి పొడవునా తన రాకకోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కర్నీ సాదరంగా పలకరిస్తూ షర్మిల ముందుకు సాగారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధుల దగ్గరకు వెళ్లి ‘బాగున్నావమ్మా.. బాగున్నావయ్యా’ అంటూ భుజం తట్టి వారి యోగ క్షేమాలను అడిగిన షర్మిలను చూసి తమ ఇంటి ఆడపడుచునే చూసినట్టు మురిసిపోయారు. పాదయాత్ర సాగినప్రతి గ్రామంలో షర్మిలను చూసేందుకు రోడ్లకిరువైపులా జనం బారులు తీరారు. పలుచోట్ల మహిళలు హారతులిచ్చి షర్మిలను ఆశీర్వదించారు.

కుండపోత వానైనా ఖాతరే లేదు..
తోకాడలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి వేలమంది పోటెత్తారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, రైతులు భారీగా తరలి వచ్చారు. శ్రీమతి షర్మిల సభావేదిక వద్దకు వచ్చే సమయంలో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు జోరున వర్షం కురిసింది. జనం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అలా తడుస్తూనే కూర్చుండిపోయారు. ఆమె మాట్లాడుతున్నంత సేపూ ఏ ఒక్కరూ కదల లేదు. తన మాటలు వినేందుకు వర్షంలో తడిసి ముద్దయిన గ్రామస్తుల అభిమానాన్ని చూసి  చలించిపోయారు. అనంతరం ఆ జోరు వర్షంలోనే షర్మిల తోకాడ నుంచి మల్లంపూడి వరకు సుమారు రెండు కిలో మీటర్ల పాదయాత్ర కొనసాగించారు. వేలాది మంది తడుస్తూనే ఆమె వెంట సాగారు. మల్లంపూడి లో గ్రామస్తులు తడుస్తూనే షర్మిలకు ఘన స్వాగతం పలికారు. తన కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కర్నీ పలకరిస్తూ, వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ రాత్రి ఏడు గంటల సమయంలో గ్రామశివారులోని కాటన్‌రాజు స్థలంలోని బసకు చేరుకున్నారు.

Back to Top