మొక్కుబడి దీక్షలు.. కపట నాటకాలు

– బీజేపీతో విడివడినా  పద్ధతి మార్చని తెలుగు తమ్ముళ్లు
– చిత్తశుద్ధి లేని నిరసనలతో జనాన్ని మాయ చే సే వ్యూహం
– టీడీపీ నైజాన్ని బయటపెట్టిన సీఎం రమేశ్‌ దీక్ష



టీడీపీ కపట నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడిపోతున్నాయి. బీజేపీ నుంచి తెగదెంపులు చేసుకున్నాకైనా నాలుగేళ్ల నాటకాలకు తెరపడుతుందనుకుంటే ‘అంతకు మించి..’ అన్నట్టుగా చెలరేగిపోతున్నారు.. బీజేపీ మోసం చేసిందనీ, ప్రత్యేక హోదా సాధించాలని బయటకొచ్చామని చెప్పుకుంటూనే అదే బీజేపీ నాయకుల భార్యలకు టీటీడీలో పదవులు కల్పించడం చంద్రబాబుకే చెల్లింది. ఇలాంటి తెరవెనుక నాటకాలకు పెట్టింది పేరైన చంద్రబాబు.. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైయస్‌ జగన్, వైయస్‌ఆర్‌సీపీకి చెక్‌ పెట్టి క్రెడిట్‌ సాధించేందుకు కొత్త ఉద్యమాన్ని తెరపైకి తెచ్చాడు. కడప ఉక్కు పేరుతో నాటకాన్ని రక్తి కట్టించడానికి పథక రచన చేసి ఎల్లో మీడియాను ఉసిగొల్పాడు. అయితే నిజం నిప్పులాంటిది అన్నట్టు చంద్రబాబు పాపాలు బయటకొచ్చాయి. ఆరోజు కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎవరు అడ్డుపడిందో ఆధారాలతో సహా బయటకొచ్చాయి. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా చేయడానికి ఎల్లో మీడియాలో చంద్రబాబు రాయించిన అసత్య ప్రచారాలను ఆరోజే వైయస్‌ఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. తొండలు గుడ్లు పెట్టే బంజరు భూములను  మూడు పంటలు పండే పచ్చ పొలాలుగా ప్రచారం చేయించి అనుమతులు దక్కకుండా ఎలా అడ్డుకోవాలని చూసిందీ ప్రజలంతా చూశారు. పచ్చ పత్రికలో వచ్చిన వార్తలను చదివి వినిపిస్తూ వైయస్‌ఆర్‌ ఆనాడు అసెంబ్లీలో చేసిన ప్రసంగం తాలూకా వీడియోలు వైరల్‌ కావడంతో టీడీపీ నాలుక్కరుచుకుంది. 

   ప్రత్యేక హోదా పేరెత్తితో ఎక్కడ చూసినా వైయస్‌ జగన్‌ గురించే చర్చ. అందుకే తమ చేతులతో భూస్థాపితం చేద్దామనుకున్న కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని భుజానకెత్తుకున్నారు. నాలుగేళ్లుగా ఏ ఊసూ లేకుండా పోయిన దాని గురించి దొంగ దీక్షలు మొదలు పెట్టేశారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కడప జిల్లాకు కూడా సంబంధించింది కావడంతో హడావుడి చేసి కూసంత జనాల్లో క్రేజ్‌ తెచ్చుకుందామని టీడీపీ కన్న కలలు సీఎం రమేశ్‌ హైటెక్‌ నిరాహార దీక్షతో రచ్చరచ్చయ్యింది. 9 రోజులు నిరాహార దీక్ష చేసి బరువు తగ్గని వ్యక్తిగా సీఎం రమేశ్‌ చరిత్ర పుటలకెక్కాడు. ఎప్పడు దీక్షను విరమించాలో కూడా ముందుగానే నిర్ణయించుకుని అభాసుపాలయ్యారు. బయటకు మాత్రం గుక్కతిప్పుకోకుండా ఉపన్యాసాలు దంచేస్తూ రాష్ట్ర ప్రయోజనాలే ఊపిరిగా క్షణక్షణం తపించే పోరాట యోధుల్లాగా కనపడే పచ్చ దొరల బాగోతం తాజాగా బయట పడి వారి పరువును బజారున పడేసింది. సినిమాల్లో చూపించినట్టు ఎంపీలంతా తీరుబడిగా కూర్చుని హోదా లేదా గీదా లేదని.. నిరాహార దీక్ష చేసి బరువు తగ్గాలని హేళనగా మాట్లాడి వారి నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. చిత్తశుద్ధి లేని మొక్కుబడి దీక్షలతో మరోసారి ఐదున్నర కోట్ల మంది ఆంధ్రా ప్రజలను మోసం చేయాలని కలలు కంటున్నారు. కానీ అందర్నీ మళ్లీ మళ్లీ మోసం చేయడమనేది అసంభమని త్వరలోనే తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. 
Back to Top