అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మినీ యుద్ధం

హైదరాబాద్, 17 డిసెంబర్ 2013:

‌`ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు-2013’ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.‌ నిబంధనలకు విరుద్ధంగా బిల్లును సభలో ప్రవేశపెట్టిన తీరును నిరసిస్తూ సమైక్యవాదులు, స్వాగతిస్తూ తెలంగాణవాదులు నినాదాలకు దిగారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు బిల్లు ప్రతులను దగ్ధం చేయడం, చింపివేయడం.. తెలంగాణవాదులు వారిని తీవ్రస్థాయిలో ప్రతిఘటించేందుకు ప్రయత్నించడంతో తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. టీఆర్‌ఎస్, టీడీపీ, వైయస్ఆర్‌ కాంగ్రెస్, కాంగ్రె‌స్ పార్టీల‌లోని సమైక్య, తెలంగాణవాద ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకోగా ఒక దశలో ఘర్షణ వాతావరణం నెలకొంది. తమపై దాడి జరిగిందని, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలే కాకుండా బయటివారు కూడా వచ్చి దాడికి పాల్పడ్డారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ ఎమ్మెల్యేలు చెప్పారు. ఆ‌ మేరకు స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారు.

శాసనసభలో సోమవారం విభజన బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడినప్పుడు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ స్పందనను తెలియజేయడానికి మీడియా పాయింట్‌కు వచ్చారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ ఎమ్మెల్యేలు భూమన కరుణాక‌ర్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తెల్లం బాలరాజులు ఆంధ్రప్రదేశ్ విభజన సరికాదన్నారు. విభజనతో పాటు అందుకు అనుసరిస్తున్న ప్రక్రియను నిరసిస్తూ మీడియా పాయింట్ ప్రాంగ ణంలో బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం మాట్లాడేందుకు వేదికను ఎక్కుతుండగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వారిని తోసివేసే యత్నం చేశారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.

‌పోలీసుల రక్షణలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ‌వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌ పైకి ప్రభుత్వ చీఫ్ వి‌ప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహంతో దూసుకొనివెళ్లారు. ఈ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమైక్య, ప్రత్యేక వాదుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని రోప్ పార్టీని రంగంలోకి దించారు. గ్రూపులుగా విభజించి అక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేశారు.

పాత్రికేయుల జై తెలంగాణ  నినాదాలు :

మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతుండగా పలువురు పాత్రికేయులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ... గో బ్యా‌క్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ శాసనసభ్యులు ‘సే‌వ్ ఆంధ్రప్రదేశ్, జై సమైక్యాంధ్రప్రదేశ్’ అంటూ ప్రతి నినాదాలు చేస్తూ రాష్ట్ర విభజన బిల్లు ప్రతులను చించివేశారు. ఎమ్మెల్యేలు మాట్లాడటాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తూ పలువురు వారిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు ఎమ్మెల్యేలకు రక్షణగా నిలిచారు. అనంతరం వైయస్ఆర్‌సీపీ ‌ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. విభజన నిర్ణయం బాధాకరమన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడ‌తామని చెప్పిన సీఎం బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సభకు హాజరు కాకపోవడమేంటని ప్రశ్నించారు.

ప్రత్యేక బ్యారికేడ్లు :
అసెంబ్లీ మీడియా పాయింట్‌లో సోమవారం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై కొందరు తెలంగాణ నేతల దాడి నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో హుటాహుటిన ప్రత్యేక బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు మాట్లాడే పోడియం వద్దకు వారిని మాత్రమే అనుమతించడంతో పాటు మీడియా ప్రతినిధులను మరో వైపునకు పంపేందుకు అనువుగా రెండు ఎ‌న్‌క్లోజర్‌లను రాత్రికి రాత్రే నిర్మించారు. కొందరు తెలంగాణ నేతలు తమపై దాడి చేశారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే పోలీసులు ఈ ఏర్పాట్లు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top