మహానేత తనయకు బ్రహ్మరథం

వెల్లువెత్తుతున్న జనం ఆత్మీయ పలకరింపుల నడుమ దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల సాగిస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. శుక్రవారంనాడు కామవరపుకోట మండలం వెంకటాపురం, యడవల్లి, ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామాల్లో 12.5 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. పన్నుల మోత.. చార్జీల వాత.. సౌకర్యాల కొరత.. అవినీతి.. అక్రమాలు.. కుట్రలతో ప్రజా సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ సర్కారు తీరుపై జనం మండిపడ్డారు. ఈ సర్కారు పాలనలో తాము పడుతున్న కష్టాలను శ్రీమతి షర్మిలకు వివరించారు. జగన్ పాలన రావాలని.. రాజన్న రాజ్యం తేవాలని ఆకాంక్షించారు.

కామవరపుకోట(గోపాలపురం), 18 మే 2013:

పింఛను రావడం లేదని ఓ అవ్వ.. రోగమొస్తే సర్కారు దవాఖానాలో మందుబిళ్లలు కూడా లేవని ఓ వృద్ధుడు.. తాగేందుకు గుక్కెడు నీరు కూడా అందడం లేదని మహిళలు.. కనీసం రెండు గంటలైనా కరెంటు ఇవ్వకపోవడంతో కూరగాయ పంటలు ఎండిపోతున్నాయని రైతులు.. ఏ పల్లెకెళ్లినా ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్న పాలకుల తీరును వృద్ధులు, మహిళలు, రైతులు, యువకులు శ్రీమతి షర్మిలకు ఏకరువు పెట్టారు. పల్లె గుండెచప్పుడు వింటూ.. ప్రజా సమస్యల్ని ఆలకిస్తూ శ్రీమతి షర్మిల చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ఆరో రోజు పాదయాత్ర నిర్వహించారు. మహానేతకు నివాళులర్పిస్తూ.. మంచి రోజులొస్తాయని ఆమె గ్రామీణులకు ధైర్యం చెప్పారు.

మండుటెండను లెక్కచేయక...
శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కామవరపుకోట మండలం రావికంపాడు బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు మొదలైంది. పాత వెంకటాపురం, కొత్త వెంకటాపురం, యడవల్లి, దొరసానిపాడు గ్రామాల ప్రజలు దారిపొడవునా ఆమెకు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆయిల్‌పామ్, కోకో తోటల్లోని కూలీలు రాజన్న తనయను చూసేందుకు ఉరుకులు పరుగులు తీస్తూ వచ్చారు. కొత్త వెంకటాపురం మార్గంలో ఓ వృద్ధుడు శ్రీమతి షర్మిలకు కూల్‌డ్రింక్ ఇచ్చి ‘దప్పిక తీర్చుకో తల్లీ’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. థైరాయిడ్ శస్త్ర చికిత్స చేయించుకున్న ఓ మహిళ.. పోలియో వ్యాధి సోకిన ఓ చిన్నారి శ్రీమతి షర్మిలను కలిసి తమ ఇబ్బందులను వివరించారు. చింతలపూడి నియోజకవర్గంలో పాదయాత్రను ముగించుకుని గోపాలపురం నియోజకవర్గంలో అడుగుపెట్టిన రాజన్న బిడ్డకు వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.

చంద్రబాబు ఖల్‌నాయకుడు
యడవల్లిలో మహానేత వైయస్ విగ్రహానికి శ్రీమతి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం  ప్రసంగిస్తూ జగనన్నను ఆశీర్వదించాలని, రాజన్న రాజ్యంలో కష్టాలన్నీ తీరతాయని భరోసా ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకుడు కానే కాదని.. ఖల్ నాయకుడని అభివర్ణించారు. గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత శ్రీమతి షర్మిలకు చీరె, సారెతో స్వాగతం పలికారు. యడవల్లిలో దొండసాగు చేస్తున్న కూరగాయల రైతులు కరెంటు లేక పంట దిగుబడి తగ్గిపోతున్న వైనాన్ని వివరించారు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలో గిరియమ్మ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను షర్మిల పరిశీలించారు.

రూ.8 కోట్ల విలువైన ఈ పథకాన్ని మహానేత డాక్టర్ వైయస్ మరణం తర్వాత పట్టించుకునే నాథుడే లేడని రైతులు ఆమెకు వివరించారు. దొరసానిపాడులో ఆమెను చూసేందుకు జనం పోటెత్తారు. దొరసానిపాడులో మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు పాదయాత్రలో పాల్గొన్నారు. మొత్తం 12.5 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో ఎమ్మెల్యేలు తానేటి వనిత, ఆళ్ల నాని, మద్దాల రాజేష్, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, బొడ్డు భాస్కరరామారావు, పార్టీ నేతలు మొవ్వా ఆనంద శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ, తలారి వెంకట్రావు, డి.సువర్ణరాజు, కాపు భారతి, బొడ్డు వెంకట రమణచౌదరి, ఎస్.రాజీవ్‌కృష్ణ, గూడూరి ఉమాబాల, పాశం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top