కేంద్రం నిర్లక్ష్యం రాష్ట్రం నిస్తేజం


భౌతిక సామాజిక మౌలిక వసతుల విస్తరణ కోసం ఎపి, తెలంగాణా రాష్ట్రాల్లోని వెనుకబడ్డ జిల్లాల్లో చేపట్టే కార్యక్రమాల కోసం కేంద్రం మద్దతుగా కొంత నిధులను అందిస్తోంది. గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 350 కోట్లు చొప్పున మూడుసార్లు నిధులు మంజూరయ్యాయి. గతేడాది రావాల్సిన 350 కోట్లు ఏడాది చివర్లో ఇచ్చి వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది అయితే సొమ్ము గురించే ఊసేలేదు. పుండు మీద కారంలా పక్కనున్న తెలుగు రాష్ట్రం తెలంగాణాకు 450 కోట్లు మంజూరు చేసింది. 
నిధుల వెనుక భాగోతం
ఈ విషయంపై టిడిపి ప్రభుత్వం చేస్తున్న వాఖ్యలు వింటే తెలుగు ప్రజలకు కడుపు మండుతోంది. ఇన్నేళ్లుగా రాని అక్కరా, ఆవేశాలు నేడు చంద్రబాబుకు ఎలా వస్తున్నాయంటూ నిలదీస్తున్నారు ఆంధ్రా ప్రజలు. ఈ బుద్ధి హోదా బదులు పాకేజీకి ఆమోదం తెలిపినప్పుడు ఏమైంది అంటున్నారు. మూడేళ్లుగా ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పమంటే నీళ్లు నమిలి ఇప్పుడు నిధులు రాకుండా పోయాక నిందలేస్తే ప్రయోజనమేంటని ఫైర్ అయిపోతున్నారు. బిజెపి నాయకులే తమ మాజీ స్నేహితుడు చంద్రబాబు నిధుల లీల గురించి నిక్కచ్చిగా బైటపెట్టారు. కేంద్రం వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చిన నిధుల నుంచి మొదలుపెట్టి రాజధాని కోసం ఇచ్చిన సొమ్ముదాకా దేనికీ బాబుగారు వినియోగ పత్రాలు ఇవ్వలేదని అమిత్ షా స్వయంగా బహిరంగ లేఖే రాసారు. ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల కోసం కేంద్రం ఇచ్చిన 1,050 కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. వీటిలో 12 శాతం మాత్రమే ఖర్చు చేసి 88 శాతాన్ని అలాగే ఉంచారని, అలాంటప్పుడు మళ్లీ నిధులు ఎలా అడుగుతారని ఘాటుగా విమర్శించారు. 
ఇదీ బాబుగారి బండారం
రౌతు సరైన వాడైతే గుర్రం సవ్యంగా ఉంటుంది. నాయకుడు సరైన వాడైతే రాష్ట్రం గాడిలో ఉంటుంది. కానీ బాబుగారి తో అలాకాదు. దుబారాలు, నిరుపయోగ విషయాలపై వేల కోట్ల ఖర్చులు. గత కొన్నేళ్లుగా తమ అధికారంలో భాగస్వామిగా ఉన్న బాబుగారి లీలను గమనించిన కేంద్రం ప్రభుత్వం నిధుల విషయంలో ఎపికి మొండి చేయి చూపిస్తోంది. కన్వెన్షన్ సెంటర్లలో మీటింగులు, ప్రచారాలకు ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక విమానాల్లో మందీ మార్బలంతో విదేశీ ప్రయాణాలు, హెలికాఫ్టర్ ఖర్చులు, ఖరీదైన బస్సులు, లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ చేస్తూ, ఉన్న నిధులు ఊరకే ఖర్చు చేస్తూ ఇప్పుడు కేంద్రంపై నిందలు మోపుతారా అంటోంది ఎన్డీయే ప్రభుత్వం. చంద్రబాబు రాష్ట్ర ఆదాయాన్ని నిరర్థక ఆస్తులకు ఖర్చు చేస్తున్నారని, విలాసాలకు వాడేసి ఖజానాను ఖాళీ చేస్తున్నారని కాగ్ చాలాకాలంగా మొత్తుకుంటోంది. నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలు కూడా అత్యంత విలాసవంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరునే ఖరారు చేసాయి. మరి ఇంతలా మంది సొమ్మును జల్సాలు చేస్తుంటే కేంద్రం ఊరుకుంటుందా? ఇచ్చిన నిధులను ఖర్చూ చేయక, చేసిన ఖర్చుకు జమా ఖర్చులు ఇవ్వక, అనవసర వ్యయాలతో గండి కొడుతూ నేడు కేంద్రం నిధులివ్వడం లేదంటూ దొంగేడుపులు ఎందుకు? ఇదంతా ఎన్నికల ముందు డ్రామాల్లో భాగమే అని ప్రజలకు ఆమాత్రం తెలియదని బాబు అనుకుంటే అంతకంటే వెర్రిబాగులతనం మరోటి ఉండదు. మొత్తానికి సత్తాలేని చంద్రబాబు వల్ల కేంద్రం ఎపిని నిర్లక్ష్యం చేస్తుంటే, చంద్రబాబు వల్ల రాష్ట్రం నిధులు లేక అభివృద్ధికి నోచుకోక చతికిల పడుతోంది. 
 
Back to Top