కాపీ బాబు.. కంగాళీ యాత్ర

పాదయాత్ర ప్రారంభించిన రెండో రోజునే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిగ్రహం కోల్పోయారు. సమైక్యవాదుల నినాదాలతో కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని ఆయన నిగ్రహించుకోలేకపోయారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పదేళ్ళ క్రితం ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయత్రను ఆదర్శంగా తీసుకున్న బాబు 'వస్తున్నా మీకోసం' అంటూ ఇప్పుడు కాలు కదిపారు. 

సమైక్యవాదులపై లేచిన చేయి
కొంచెం కాళ్ళు నొప్పులుగానే ఉన్నాయి.. అయినా పర్వాలేదు.. నడుస్తానంటూ రెండో రోజు యాత్ర మొదలు పెట్టిన ఆయనకు వినిపించిన సమైక్య నినాదాలు చిర్రెత్తించాయి. తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదంటూ లేఖ ఇచ్చి వచ్చిన ఆయనకు టీడీపీ సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కు కట్టుబడి ఉండాలని వారు విన్నవించడం రుచించలేదు. కొల్లకుంట  గ్రామస్థులతో ముచ్చటించే సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెద్దగా నినాదాలు చేస్తుండడంతో అసహనానికి గురయ్యారు. ఇలాంటి వారిని ఎందుకు రానిచ్చారంటూ పార్టీ నేతలపై చిందులేశారు. ఇలా వేరే వారి సభలోకి వచ్చి నినాదాలు చేస్తే తంతారంటూ సమైక్యాంధ్ర మద్దతుదారులపై మండిపడ్డారు. ఇదంతా చూసిన వారు అవాక్కయ్యారు. 

117 రోజుల బాబుగారి పాదయాత్రలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆంధ్రలో సమైక్యవాదులు.. తెలంగాణలో ఆ ప్రాంతీయుల నుంచి ఆయనకు ఇబ్బందులు తప్పవు. ఆంధ్రలో కాబట్టి ఆయన వెళ్ళిపోమంటే శాంతియుతంగా వెళ్ళిపోయారు. మరి తెలంగాణలో పరిస్థితి ఇంత శాంతంగా అయితే మాత్రం ఉండదని చెప్పకతప్పదు. 

అన్నీ చిరంజీవి నకళ్ళే
ప్రజాప్రస్థానంతో అఖండాంధ్రుల హృదయాలను కొల్లగొట్టారు మహానేత వైయస్ఆర్. అందువల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారనే భ్రమలో పడిన చంద్రబాబు కాలికి పనిచెప్పారు.   పాదయాత్ర చేసేస్తే ముఖ్యమంత్రినైపోతానని కలలు గంటున్నారు. దానిని దాచిపెట్టి సామాజిక న్యాయం కోసం పాదయాత్ర చేస్తున్నాని ఆయన చెప్పుకొస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో కూడా చిరంజీవి చెప్పిందిదే. చివరికి ఆయన కాంగ్రెస్‌లో తన పార్టీనే కలిపేశారు. సామాజిక న్యాయమనే నినాదంతో రాజకీయ తెరంగ్రేటం చేసిన చిరంజీవిలాగే సొంత వ్యక్తిత్వం కోల్పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
ప్రతి కార్యకర్తా తాను ప్రవచించిన సామాజిక న్యాయం అంశం గురించి పదిమందికి చెప్పాలని చంద్రబాబు పార్టీ క్యాడర్‌కు సూచించారు. ఇది 'ప్రతి ఒక్కరూ మరో ముగ్గురికి సాయం చేయాలని' స్టాలిన్ అనే సినిమాలో చిరంజీవి డైలాగ్‌కు నకలే. సినీ దర్శకుడి దర్శకత్వంలో సాగుతున్న పాదయాత్రలో ఇంతకంటే ట్విస్టులేముంటాయి బాబుగారూ! కొంచెం ప్రజల గురించైనా సొంతంగా ఆలోచించండి.

తాజా వీడియోలు

Back to Top