జనానికి ఉపయోగ పడని జన్మభూమి

– నాలుగవ విడత జన్మభూమిలో సమస్యలు పరిష్కారం శూన్యం
– 10 రోజులు టిడిపి ప్రచారానికి ఉపయోగ పడ్డ జన్మభూమి
– నాలుగవ విడతలోనూ వినతి పత్రాల స్వీకరణకే పరిమితం
– మొక్కుబడిగా ఫించన్లు, రేషన్‌కార్డుల పంపిణీ 
– మంజూరైన వారికి పంపిణీ లేదు..టిడిపి వారికే పంపిణీ
– వెబ్‌లో మాత్రం అందరికీ పంపిణీ చేసినట్లు దొంగ లెక్కలు
– టిడిపి మార్కు ఉన్న వారికే ఇళ్లు మంజూరు
-పచ్చచొక్కాల ఊకదంపుడు ఉపన్యాసాలకు విసిగిపోయిన ప్రజలు
-ఎన్నికల హామీలపై నిలదీత..బిక్కముఖం వేసిన పచ్చచొక్కాలు


               నాలుగవ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో వేలాదిగా రేషన్‌ కార్డులు, పింఛన్లులతో పాటు అడిగిన వారందరికీ సంక్షేమ పథకాలుతో పాటు గూడు లేని వారందరికి  మంజూరు చేస్తామని పథకం ప్రకారం ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. కానీ జనానికి నాలుగవ విడతలోను ప్రభుత్వం శఠగోపం పెట్టింది. గత మూడు సార్లు జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన వినతులు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదు. గతంలో ఇచ్చిన వినతి పత్రాలు ఇచ్చినవి ఇచ్చినట్లే చెత్త బుట్టపాలు చేశారు. కానీ నాలుగవ విడతల్లో నమ్మకంగా పలికిన ప్రభుత్వం ఈ సారీ నిజమైన లబ్దిదారులకు మోసం చేసింది. 

అరకొరగా యిచ్చిన రేషన్‌ కార్డులు, పింఛన్లు అన్నీ టిడిపి వారికే అందించింది. పేరుకే జన్మభూమి మా ఊరు కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ అధికారులతో టిడిపి ప్రచారం చేపట్టింది. జన్మభూమి కమిటి, అధికార పార్టీ సర్పంచ్‌లు ఉన్నచోట సిఫారస్సు చేసిన వారు జన్మభూమి కార్యక్రమానికి రాకున్న రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లు మంజూరు చేశారు. ఆశతో వచ్చి అడిగిన వారికి ఆధార్‌ కార్డు ట్యాలీ కాలేదనో..ఆన్‌లైన్‌ పెండింగ్‌లో ఉందనో..అప్రూవల్‌ రాలేదనో..జనాలను మోసంచేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు  మొదలుకొని పక్కా గృహాలు గురించి మాట్లాడిన చోటల్లా మళ్లీ వినతి పత్రాలు యివ్వాలంటూ అధికారులు పాత పాట మొదలెట్టారు.

పాలకులను,  అధికారులను నిలేసిన ప్రజలు
సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్మభూమి మా ఊరు కార్యకరమంలో అడుగడుగునా అధికారులను, టిడిపి నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలేశారు. ప్రచార ఆర్భాటం కోసమే టీడీపీ జన్మభూమి కార్యక్రమాలు పెడుతుంది తప్ప తమకు చేస్తున్న మేలు ఏమీ లేదని గుర్తించిన ప్రజలు పాలకులను సమావేశాల్లో నిలదీశారు.  పింఛన్లు, రేషన్లు, ఇళ్లు ఇస్తామంటూ మభ్యపెడుతూ మోసగిస్తున్న టీడీపీ నేతలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  మూడు విడతలుగా జరిగిన జన్మభూమిలో ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని ప్రజలు సమావేశాల్లోనే టీడీపీ నేతలను కడిగిపారేశారు.  ఎన్నికల హామీలపై  ప్రజలు నిలదీస్తుండడంతో పారిపోవడం టీడీపీ నేతల వంతైంది. మరికొన్ని చోట్ల ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెలుగుదేశం ప్రజాప్రతినిధులు నీళ్లు నమిలారు. మొత్తంగా జన్మభూమి నాలుగవ విడత కార్యక్రమం టిడిపిలో వర్గపోరుకు వేదికైందే కానీ జనం సమస్యలు పట్టించుకో లేదని ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తాయి.

 

Back to Top