గుంటూరు : మహానేత డాక్టర్ రాజన్న వేసిన అడుగు నాడు వేలాది జీవితాలకు వెలుగు బాట వేసింది.. ఆయన తనయ శ్రీమతి షర్మిల వేస్తున్న అడుగు నేడు ప్రతి ఒక్కరికీ అండగా ఉన్నామన్న భరోసా కల్పిస్తోంది. జననేత జగనన్న ఓదార్పు ఎన్నో కుటుంబాలకు ఊరట ఇచ్చింది. ఆయన సోదరి సాంత్వన పలుకులు మరెందరికో మనోధైర్యాన్నిస్తున్నాయి. ఒక పక్కన ముదిరిన ఎండలు ఇబ్బంది పెడుతున్నా అలుపెరుగని శ్రీమతి షర్మిల పయనం ముందుకు కొనసాగుతోంది. భేషజాలు లేకుండా రాజన్న తనయ తమ చెంతకే వస్తుంటే... తమ కష్టాలు నేరుగా తెలుసుకుంటుంటే... ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఓదార్పునిస్తుంటే... నుదుట చుంబించి లాలిస్తుంటే.. పల్లెల వాసులు భావోద్వేగానికి గురవుతున్నారు. చిన్న వయసులోనే ఆమెలో ఉన్న పెద్దరికానికి జోహార్లు అర్పిస్తున్నారు. ఆమె వెళ్లిపోయినా... ఆ జ్ఞాపకాలతో మధురానుభూతులు పొందుతున్నారు.
నాటి రాజన్న ప్రజాప్రస్థానం.. మొన్నటి జగన్ ఓదార్పు... నేటి షర్మిల మరో ప్రజాప్రస్థానం.. ఇలా ప్రతీ కార్యక్రమం పల్లెవాసుల్లో చెరగని ముద్ర వేస్తున్నాయి. మహానేత నాడు చేసిన పాదయాత్ర ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో పథకాల రూపకల్పనకు దోహదం చేసింది. ఆయన కుమారుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన ఓదార్పు ఎన్నో కుటుంబాలకు ఊరటనిస్తే, నేడు శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం భరోసానిస్తోంది.
అన్ని వర్గాల ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ, ఆప్యాయంగా పలకరిస్తూ, మంచి రోజులు త్వరలో వస్తాయని దైర్యం చెబుతూ శ్రీమతి షర్మిల ముందుకు సాగుతున్నారు. ఆమె అడుగులో అడుగేస్తూ జనమంతా ఆమె బాటలో పయనిస్తున్నారు. కాంగ్రెస్, టిడిపిలు అనుసరిస్తున్న విధానాలపై శ్రీమతి షర్మిల బహిరంగ సభల్లో విమర్శలు గుప్పిస్తుంటే బాగా స్పందిస్తున్నారు. ఎంతైనా 'వైయస్ బిడ్డ కదా' అంటూ మురిసిపోతున్నారు.
అన్నదాతలకు భరోసా :శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్ధానం సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు, వేమూరు నియోజకవర్గాలలో కొనసాగింది. పంట పొలాలకు సాగునీరు అందక ఎన్నెన్నో అగచాట్లు పడుతున్నామని, 150 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కెనాల్ ఎండిపోయిందని దీంతో పంటలు ఎండిపోయి నష్టపోయామని చేబ్రోలు నుంచి మంచాల వెళ్లే మార్గంలో కొమ్మమూరు బ్రిడ్జి వద్ద రైతులు చెప్పారు. జగనన్న రాజ్యంలో రైతే రాజని, కాలువల మరమ్మతులతో పాటు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తారని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు. బ్రాహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద గానుగ, నేరేడుచెట్లను శ్రీమతి షర్మిల నాటారు.
సమస్యలు తెలుసుకున్న షర్మిల :అక్కడి నుంచి వెల్లలూరు మీదుగా పాదయాత్ర సాగించిన శ్రీమతి షర్మిల భోజన విరామం తరువాత తొట్టెంపూడి మీదుగా మామిళ్లపల్లికి వెళ్లి వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన రచ్చబండలో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న రాజ్యం వరకు ఓపిక పట్టాలన్నారు. ఈ రచ్చబండలో మహిళలు మరుగుదొడ్ల సమస్యను వివరించారు. కట్టిన ఇందిరమ్మ ఇళ్లు, మరుగుదొడ్లకు బిల్లులు రావడం లేదని చెప్పారు. అక్కడి నుంచి శ్రీమతి షర్మిల పాదయాత్ర వేమూరు నియోజకవర్గం తొట్టెంపూడి, మామిళ్లపల్లి, మోదుకూరుల్లో కొనసాగింది.
మోదుకూరులో ఘన స్వాగతం :మోదుకూరు చేరుకున్న శ్రీమతి షర్మిలకు గ్రామం వెలుపలే మహిళలు పెద్ద ఎత్తున హారతులతో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ శ్రీమతి షర్మిలను గ్రామంలోకి తీసుకుని వెళ్లారు. శ్రీమతి షర్మిల రాకతో మోదుకూరులో దీపావళి పండుగ వాతావరణం నెలకొంది. ఆళ్లవారిపాలెంలో మహానేత వైయస్ విగ్రహానికి నివాళులు అర్పించిన శ్రీమతి షర్మిల అక్కడి మహిళలను పలకరించి గ్రామంలోని లైబ్రరీ సెంటరుకు చేరుకుని అక్కడి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి గ్రామస్తులనుద్దేశించి ప్రసంగించారు. తర్వాత కందేపాడు మీదుగా రాత్రి బసకు చేరుకున్నారు.