జలవృష్టి నిలిచింది.. జనవృష్టి పెరిగింది

ప్రకృతి శక్తి కన్నా అభిమానుల అనురక్తే బలీయమైనది. అభిమానుల అనురాగం ముందు మహాపర్వతం సైతం నలుసంత అయిపోవాల్సిందే! తూర్పుగోదావరి జిల్లాలో మహానేత రాజన్న తనయ, జననేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు రెండవ రోజు కనిపించిన అశేష జనాదరణే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. జిల్లాలో తొలిరోజు మంగళవారం శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభ సమయంలో హోరెత్తిన గాలి సద్దుమణిగింది. కురిసిన జడివాన వెలిసిపోయింది. కానీ, శ్రీమతి షర్మిల పాదయాత్రకు పోటెత్తుతున్న అభిమాన జనం మాత్రం బుధవారం రెట్టింపయ్యారు. ఆమెపై వారి అభిమానం కుంభవృష్టిగా కురుస్తూనే ఉంది. ఆ అభిమానాన్ని ఆస్వాదిస్తూ శ్రీమతి షర్మిల ముందుకు సాగుతున్నారు.

రాజమండ్రి :

తూర్పు గోదావరి జిల్లాలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర రెండవ రోజు బుధవారం ఆద్యంతం జనహోరు మధ్య కొనసాగింది. అడుగడుగునా మహిళలు, వృద్ధులు, కార్మికులు... అన్ని వర్గాల ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. రాజన్న రాజ్యం ఉండి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి తమకు ఎదురయ్యేది కాదని శ్రీమతి షర్మిలకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మాటలు శ్రద్ధగా విన్న శ్రీమతి షర్మిల చిరునవ్వులు చిందిస్తూ, వారికి మనోధైర్యాన్నిస్తూ ముందుకు సాగారు.

ప్రజాకంటక కాంగ్రె‌స్ పాలనకు, చంద్రబాబు కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్ర బుధవారం 170వ రోజు కొనసాగింది. దశాబ్దం క్రితం మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగిన దారిలోనే రెం‌డవ రోజు శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగింది. నాడు నాన్న నడిచిన బాటలో అడుగులు వేస్తూ, నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ బరువెక్కిన హృదయంతోనే శ్రీమతి షర్మిల ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. యాత్ర మొదలైన రాజమండ్రి నుంచి బూరుగుపూడిలో రాత్రి బస చేసే బత్తుల సత్తిరాజు తోట నాడు (ప్రజాప్రస్థానం ‌చేస్తూ అస్వస్థతకు గురైన వైయస్ విశ్రాంతి తీసుకున్నది ఈ తోటలోనే) వరకు రాజన్న బిడ్డను చూసేందుకు, ఆమెతో చేయి కలిపేందుకు రోడ్లకు ఇరువైపులా జనం బారులు తీరారు.

జోహార్ వైయస్‌ఆర్.. జోహార్ జక్కంపూడి‌:

రాజమండ్రిలో మంగళవారం రాత్రి బస చేసిన సెయింట్‌‌ పాల్ చర్చి కాంపౌండ్ నుంచి‌ బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీమతి షర్మిల రెండవ రోజు పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఆజాద్‌చౌక్, నందం గనిరాజు సెంట‌ర్‌ మీదుగా కంబాలచెరువు సెంటర్‌కు చేరుకున్నారు. శ్రీమతి షర్మిల అక్కడ జనయోధుడు దివంగత జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా ‘జోహార్ వై‌యస్‌ఆర్.. జోహా‌ర్ జక్కంపూడి’ నినాదాలతో మార్మోగింది. మార్కె‌ట్ యా‌ర్డు, రాజా థియేటర్ మీదుగా క్వారీ సెంట‌ర్‌కు చేరుకున్న శ్రీమతి షర్మిల అక్కడ మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భారీగా తరలి వచ్చిన జనానికి ఆమె అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తిపోయింది.

అందరి‌కీ ఆప్యాయ పలకరింపు :
శానిటోరియం సెంటర్‌లో భోజన విరామం అనంతరం పాదయాత్ర సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైంది. కొంతమూరు, కోలమూరు, గాడాల, నిడిగట్ల, మధురపూడి మీదుగా కొనసాగిన పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. రోడ్లకు ఇరువైపులా బారులుతీరి రాజన్న బిడ్డకు స్వాగతం పలికారు. హారతులిచ్చి.. పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్రకు ఎదురైన ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో ఉన్న ప్రయాణికులు శ్రీమతి షర్మిలతో కరచాలనం చేసేందుకు ఉత్సాహపడ్డారు. అభిమానుల బాణసంచా కాల్పులు.. డప్పుల మోతలు.. గరగల నృత్యాలతో హోరెత్తించారు.

గాడాల సెంటర్‌లో మహానేత డాక్టర్ వై‌యస్ విగ్రహానికి‌ శ్రీమతి షర్మిలతో పూలమాల వేయించిన స్థానికులు మహదానందంతో హర్షం వ్యక్తంచేశారు. కోలమూరులో నిలువెత్తు వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన‌ శ్రీమతి షర్మిల ఆ గ్రామానికి చెందిన జునిపే నాగరాజు దంపతుల కుమారుడు తొమ్మిది నెలల వర్షిత్‌ను ఎత్తుకుని ముద్దాడటంతో స్థానికులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. మధురపూడి విమానాశ్రయయం రోడ్డు గుండా పాదయాత్ర వెళుతుండగా నిడిగట్ల గ్రామస్తులు అక్కడ వైయస్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి‌ శ్రీమతి షర్మిల చేత పూలమాల వేయించి అభిమానాన్ని చాటుకున్నారు. రెండవ రోజు పాదయాత్ర రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరర్, రాజానగరం నియోజకవర్గాల్లో కొనసాగి రాత్రి 7.30 గంటలకు బూరుగుపూడి సమీపంలోని బత్తుల సత్తిరాజు తోటకు చేరుకుంది.

అదే బాట.. అదే తోట :
పది సంవత్సరాల క్రితం మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం సాగిన రాజమండ్రి - భద్రాచలం రోడ్డులోనే బుధవారం ఆయన తనయ శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం జరిగింది. నాడు అస్వస్థతకు గురైన వైయస్ విశ్రాంతి తీసుకున్న బత్తుల సత్తిరాజు తోటలోనే ఆయన తనయ శ్రీమతి షర్మిల కూడా రాత్రి బస చేశారు. అదే దారిలో నాడు వైయస్‌ను చూసిన జనం నేడు ఆయన తనయను చూసి ఆనంద పరవశులయ్యారు. శ్రీమతి షర్మిలలో రాజన్నను చూసుకుంటున్నామని పలుచోట్ల జనం నాటి వైయస్ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. రెండవ రోజు పాదయాత్రకు ముగింపుగా బూరుగుపూడి వద్ద సత్తిరాజు తోటలో అడుగుపెట్టిన సందర్భంలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ‘నాన్న అస్వస్థతతో ఉన్నప్పుడు అమ్మ శ్రీమతి విజయమ్మతో కలిసి వచ్చి మీరు ఇక్కడే ఉన్నారు’ అని గుర్తు చేసినప్పుడు శ్రీమతి షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు.

Back to Top