హోదాకు అడ్డు పడింది ఎవరు..?

– అరెస్టులు చేయించింది.., విద్యార్థులు బెదించింది బాబు కాదా..?
– టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి వైయస్‌ఆర్‌సీపీకి సహకరించి ఉంటే హోదా వచ్చేదే
– మూడు విడతల్లో ఏపీ ప్రజలను బాబు వంచించాడు
– ప్రత్యేక హోదాను రాజకీయ అంశంగా మార్చిన ఘనత బాబుదే..

హోదా పదేళ్లు సరిపోదు.. కనీసం పదిహేనేళ్లు కావాలి(వెంకన్న సాక్షిగా) . కాంగ్రెస్‌ అశాస్తీ్రయంగా రాష్ట్రాన్ని విభజించింది. బీజేపీతో కలిసి నవ్యాంధ్రను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా.. మోడీ, చంద్రబాబు జోడీ ఏపీ కల నెరవేరుస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తుంది. 
– 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు 

హోదాతో ఏమొస్తుంది.. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా.. హోదా పేరెత్తితే జైల్లో పెడతాం.. ప్యాకేజీ బాగుంది..  కేంద్రానికి, మోడీకి రుణపడి ఉంటాం. (అరుణ్‌ జైట్లీ, వెంకయ్య నాయుడులకు సన్మానం).. కేంద్రం చాలా ఇచ్చింది.. ఇంతకుమించి అడగలేం... అందరికన్నా మనమే ఎక్కువ సాధించాం.. మగ పిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా.. జగన్‌ ప్రత్యేక హోదా మీద చేపట్టే యువభేరిలకు మీ పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులే జాగ్రత్త పడాలి. 25 మంది ఆంధ్రా ఎంపీలు  రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా. కేంద్రం నుంచి వైదొలుగుతాం. బీజేపీతో మా పొత్తు కొనసాగుతుంది. అవిశ్వాస తీర్మాణంతో బీజేపీ ప్రభుత్వం పడిపోతుందా.. దమ్ముంటే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేయాలి. 
– ఎన్నికలయ్యాక నాలుగేళ్లుగా చంద్రబాబు 

ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలి. ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేసింది. కేంద్రం మీద అవిశ్వాసం పెడతాం. ఎన్‌డీఏ నుంచి కూడా తప్పుకుంటాం. బీజేపీ నన్ను అరెస్టు చేయాలని చూస్తోంది. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. 25 మంది టీడీపీ ఎంపీలను గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదా సాధించిపెడతాం. 
ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చాక చంద్రబాబు

ఇలా మూడు దశల్లో చంద్రబాబు ఐదున్నర కోట్ల మంది ప్రజల మనోభావాలను ఢిల్లీలో తాకట్టుపెట్టాడు. తన వ్యక్తిగత అవసరాలు, ఓటుకు నోటు కేసులో అరెస్టు చేస్తారనే భయంతో ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై నోరెత్తలేదు. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్నా రెండేళ్లు మోడీ అపాయింట్‌మెంట్‌ దొరక్కపోయినా చంద్రబాబు నోరు మెదపలేదు. కానీ ఇప్పుడిప్పుడే బీజేపీపై నోరు పారేసుకుంటున్నాడు. నాలుగేళ్లుగా మైకు పట్టుకున్న ప్రతిసారీ విభజనకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమని నిప్పులు చెరిగిన బాబు.. కర్నాటకలో కాంగ్రెస్‌ విజయం తర్వాత తన గొంతు సవరించుకుంటున్నాడు. బహిరంగ సభలో రాహుల్‌తోపాటే బహిరంగంగానే చేతులూపిన బాబు.. అప్పుట్నుంచి కాంగ్రెస్‌ విషయంలో తన ధోరణి మార్చుకున్నాడు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో దోస్తీ కట్టబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు పంపాడు. ఎప్పుడూ ఏదో ఒక జాతీయపార్టీ పంచన చేరే అలవాటున్న చంద్రబాబు.. కాంగ్రెస్‌తో దోస్తీకి హామీ లభించాక బీజేపీపై తన ధోరణి మార్చుకున్నాడు. ఏపీకి కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందన్న మనిషే ఇప్పుడు బీజేపీ ఏపీని మోసం చేసిందని కొత్త రాగం ఎత్తుకున్నాడు. నాలుగేళ్లుగా పోలవరం, రాజధాని భూములు, అసెంబ్లీ నిర్మాణం, నీరు– చెట్టు.. కేంద్రం ఇచ్చిన ప్రతి పథకంలోనూ కమీషన్లు దండుకుని.. యూసీలు అడిగారన్న కారణంతో బీజేపీకి వ్యతిరేకంగా అనుకూల మీడియాలో  కథనాలు రాయిస్తున్నాడు. ఇలా చంద్రబాబు తన వ్యక్తిగత కారణాలతో ... తమపైనే చంద్రబాబు ఎదురుదాడి చేస్తాడా అని బీజేపీ.., ఇద్దరూ కలిసి ఏపీని అగాథంలోకి నెట్టారు. రాజకీయ కారణాలతో ఆంధ్రా అభివృద్ధిని పణంగా పెట్టారు. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నాడు. ఇన్నాళ్లు ఎంపీల రాజీనామాలు, కేంద్రంతో తెగతెంపులు అంటూ విడతలవారీ డ్రామాలాడి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నెపాన్ని బీజేపీ మీదకు నెట్టేసి రాబోయే ఎన్నికల్లో లబ్ధిపొందాలని కలలు కంటున్నాడు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలను, ఎంపీలను ప్రలోభాలకు గురిచేసి తనవైపునకు తిప్పుకున్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీల స్థానంలో ఎన్నికలకు వెళ్లాలని సిస్సిగ్గుగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే. ఎన్నికలకు వెళ్లి నిజంగా గెలవగలిగే సత్తా ఉండి ఉంటే చంద్రబాబు ఏనాడో కేంద్రంతో మాట్లాడి రాజీనామాలను ఆమోదింపజేసుకునేవాడే. (40 ఇయర్స్‌ ఇండస్తీ్ర కదా). కర్నాటక రాజకీయాలతో ముడి పెట్టి వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించండి అని బహిరంగంగానే బీజేపీని విమర్శించేవాడే. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన స్థానాల్లో గెలిచే సత్తా లేదు కనకే చంద్రబాబు ఇలాంటి చౌకబారు గోబెల్స్‌ విమర్శలు చేస్తున్నాడని అందరికీ తెలుసు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు తెలిసిన వారెవరికైనా ఈ విషయం ఈజీగానే తెలుస్తుంది. ఏదైమైనప్పటికీ కలిసి పోరాడి కేంద్రాన్ని నిలదీసి సాధించుకోవాల్సిన ప్రత్యేక హోదాను రాజకీయ అంశంగా మార్చడానికి చంద్రబాబు తీవ్ర ప్రయాస పడుతున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top