షర్మిలక్కను చూద్దాం రారండీ!

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి సర్వత్రా జనాదరణ లభిస్తోంది.
రాజన్న బిడ్డ, జగనన్న సోదరి శ్రీమతి షర్మిల 179 రోజులుగా చేస్తున్న
పాదయాత్రకు లభిస్తున్న అపూర్వ స్పందనే దీనికి సాక్ష్యం. పాదయాత్ర
కొనసాగుతున్న ప్రతి బాటా మమతల పూదోటగా మారిపోతోంది. ప్రేమను చవి చూపించే
ఫలవనం అవుతోంది. జనహృదయాలు చిలకరిస్తున్న ఆదరాభిమానాలను చవిచూస్తూ శ్రీమతి
షర్మిల ఉత్సాహంగా మునుముందుకు సాగిపోతున్నారు.

కాకినాడ :

'షర్మిలక్కను చూడాలి.. ఆమెతో కష్ట సుఖాలు చెప్పుకోవాలి.. ఆ తల్లిని చూసే అవకాశం దొరుకుతుందా? పాదయాత్ర కొనసాగుతున్న దారుల్లో ఎవరిని పలుకరించినా ఈ మాటలే వినిపిస్తున్నాయి. రాజన్న తనయపై వారు పెట్టుకున్న ఆశలకు ఈ మాటలు అద్దం పడుతున్నాయి. మరో ప్రజాప్రస్థానం పాద యాత్ర సాగుతున్న మార్గంలో పల్లె.. పట్టణమనే తేడా లేకుండా శ్రీమతి షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాకంటక పాలన, చంద్రబాబు కుట్రలకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. రాజన్న బిడ్డను చూసి ఊరూవాడా ఉప్పొంగుతోంది. కాకినాడలో గురువారం జనసునామీ మాదిరిగానే.. శుక్రవారం కూడా రహదారుల వెంట జనకెరటాలు ఎగిశాయి. కాకినాడ సినిమా రోడ్డులోని వెంకటేశ్వర ఫంక్షన్‌ హాలు ఆవరణలో గురువారం రాత్రి బస చేసిన శ్రీమతి షర్మిల.. శుక్రవారం ఉదయం జిల్లాలో 11వ రోజు పాదయాత్ర ప్రారంభించారు.

ఆప్యాయత నిండిన పలుకరింపు !:
పాదయాత్ర కొనసాగిన దారుల్లో వేలాదిగా బారులు తీరిన ప్రజలు శ్రీమతి షర్మిలను చూసేందుకు, ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ప్రజల గుండెల్లో నుంచి పెల్లుబుకుతున్న అభిమాన ఝరిని చూసి శ్రీమతి షర్మిల ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. రోడ్ల పక్కన వేచి ఉన్న ప్రతి ఒక్కరినీ ‘ఏమ్మా బాగున్నావమ్మా!’ ‘బాగున్నావాయ్యా!’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. పార్టీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నాయకత్వంలో నగరంలోని పార్టీ క్యాడరంతా పాదయాత్రలో కదం తొక్కింది. వెంకటేశ్వర ఫంక్షన్‌ ‌హాలు నుంచి ప్రారంభమైన పాదయాత్ర సినిమా రోడ్డు, కొత్తపేట చిన్న మసీదు, టూటౌన్‌ పోలీస్ స్టేషన్‌‌, మెయిన్‌రోడ్‌ ఫ్లై ఓవర్‌, భానుగుడి జంక్షన్, ఎస్పీ ఆఫీస్‌‌, ఆర్ఎంసి, నాగమల్లితోట జంక్షన్ల మీదుగా బోట్‌క్లబ్‌ వరకూ కొనసాగింది.

మధ్యాహ్న భోజన విరామం అనంతరం ప్రారంభమైన యాత్రకు.. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు చలమలశెట్టి సునీల్, కాకినాడ రూరల్ ‌నియోజకవర్గ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మధ్యాహ్నం స‌ర్పవరం జంక్షన్, భవానీ కాస్టింగ్సు, ఏపీఎస్పీ, అచ్చంపేట జంక్షన్ల మీదుగా తిమ్మాపురం వరకూ పాదయాత్ర సాగింది. కాకినాడలో కొత్తపేట చిన్న మసీదు, భానుగుడి జంక్షన్‌, ఏపీఎస్పీ అంబేద్కర్ విగ్రహం సెంట‌ర్‌, రాయుడుపాలెం సెంటర్, అచ్చంపేట జంక్షన్‌లు జనంతో కిక్కిరిసిపోయాయి. ఏపీఎస్పీ అంబేద్కర్‌ విగ్రహం వద్ద మహానేత వైయస్‌ఆర్‌ చిత్రపటానికి, అలాగే అచ్చంపేట జంక్షన్‌లో ఆ మహానేత విగ్రహానికి శ్రీమతి షర్మిల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

తిమ్మాపురం పోలీస్‌ స్టేషన్‌ సెంటర్‌లో పార్టీ నాయకులు కర్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో పలు గ్రామాల మహిళలు శ్రీమతి షర్మిల ఎదుట తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారు చెప్పిన సమస్యలన్నీ ఓపికగా విన్న శ్రీమతి షర్మిల జగనన్న రాజ్యం వస్తే మన కష్టాలన్నీ తీరుతాయన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రచ్చబండ అనంతరం గ్రామ శివారున గోవర్ధన్‌ డైరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బసకు రాత్రి ఏడు గంటలకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు.

Back to Top