గవర్నర్ నోట హోదా మాట

గవర్నర్ తో హోదా కావాలని చెప్పించిన ప్రతిపక్షనేత 
ఎపి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. బడ్జెట్ సమావేశాల మొదలు లో గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం విన్నవాళ్లు ఈమధ్య రిపబ్లిక్ డే రోజు చేసిన ప్రసంగానికి కొన్ని హంగులు చేర్చినట్టు మాత్రమే అనిపించిందని వ్యాఖ్యానించారు. 

ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే
ఎపి విభజన చట్టంలోని అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఎపికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని, రెవెన్యూ లోటు భర్తీ చేయాలని కోరారు. హామీలు అమలు కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఎపిని విభజన సమస్యలు వెంటాడుతున్నాయని, ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోందని తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. 
మరి ఇదే గవర్నర్ గారు నిరుడు బడ్జెట్ సమావేశాల సందర్భంలో ఉభయ సభల సంయుక్త సమావేశంలో హోదా ప్యాకేజీ రెండూ ఒకటే అని శెలవిచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత నిధులను ఇచ్చేందుకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా పరిగిణలోకి తీసుకుంటున్నారని, అందువల్ల ప్రత్యేక హోదా విధానాన్ని కేంద్రం విరమించుకుంటోందని కూడా చెప్పారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఈ నెలాఖరు నుంచీ ఆ హోదాను కోల్పోతాయని కూడా గవర్నర్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా స్థానంలో మన రాష్ట్రానికి ప్రత్యేక సహాయాన్ని ప్రకటించడంలో కేంద్రంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి, వాళ్లను అంగీకరింప చేసామనీ, హోదా కింద రాష్ట్రానికి చేకూరే మద్దతు, రాయితీలు, సహాయాలన్నీ ప్రత్యేక సాయంలో ఉంటాయని గవర్నర్ తన ప్రసంగంలో సవివరంగా చెప్పుకొచ్చారు. 
రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా పెద్ద దిక్కుగా ఉండి, ప్రభుత్వాలు చేసే నీచమైన పనులకు అడ్డుకట్ట వేయాల్సింది పోయి, ఆయనే స్వయంగా ప్రభుత్వాలు చెప్పిన కాకమ్మ కబుర్లను యధాతథంగా అప్పజెప్పడం నిజంగా సిగ్గు చేటు. 
అచ్చం బాబు లాగే...
గవర్నర్ గారి ప్రసంగం పూర్తిగా చంద్రబాబు లాగే ఉందంటున్నారు ఇతర పార్టీ నేతలు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్తున్నామని, ఎపిలో 11.31 శాతం వృద్ధి రేటు సాధించామని, వ్యవసాయ రంగంలో 17.44 శాతం వృద్ధి రేటు నమోదైందని చెప్పుకొచ్చారు గవర్నర్ నరసింహన్. ఓ పక్కన కరువుతో అల్లాడుతున్న జిల్లాలు, నీటి కొరతతో విలవిల్లాడుతున్న గ్రామాలు 17శాతం వృద్ధిని ఎలా అందించాయో పెద్దలకే తెలియాలి. విద్యుత్ కొరత లేకుండా చేసామని, వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికీ కృషి చేస్తున్నట్టు తన ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలను, మైనారిటీలను చంద్రబాబు సర్కార్ ఎలా వేధిస్తోందో గవర్నర్ తన ప్రసంగంలో చెప్పనేలేదు.  వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు ఎలా ఎక్కడ ఎంత చొప్పున ఖర్చయ్యాయో లెక్కలు కూడా ఇవ్వలేదు. అనేక పథకాలు అమలౌతున్నాయని, జన్మభూమి మా ఊరు ద్వారా సమస్యల పరిష్కారం జరుగుతోందని ప్రకటించారు. ఆ జన్మభూమిలోనే ప్రజల దరఖాస్తులు చెత్తబుట్టల పాలౌతున్నాయని, జన్మభూమి కమిటీలు ఊళ్లలో అరాచకాలకు అడ్డాలుగా మారాయని మాటమాత్రమైనా ఒప్పుకోలేదు గవర్నర్ నరసింహన్. ఇక ఈమధ్యే మొదలైన డిజిటల్ క్లాస్ రూమ్ ల ప్రారంభం కూడా నరసింహన్ గారి ప్రసంగంలో చోటు చేసుకుంది. అయితే ఎపిలో ఎన్ని స్కూళ్లకు కంప్యూటర్లు, కరెంటు, లాబ్ సౌకర్యాలు ఉన్నాయో ఆయన లెక్క చెప్పనే లేదు. ఎన్ని స్కూళ్లలో ఈ డిజిటల్ క్లాసు రూములు పని చేస్తాయో ఓ అంచనా కూడా వేయలేదు. ఇక ఈ హాజరు పేరుతో మొదలు పెట్టిన విధానం తప్పుల తడకలా సాగుతోంది. సాంకేతిక లోపాల కారణంగా హాజరు నమోదు సరిగ్గా కావడం లేదని అటు విద్యార్థులు, ఇటు టీచర్లు మొత్తుకుంటున్నారు. ఇదేమీ గవర్నర్ ప్రసంగంలో వినబడనే లేదు. కొత్త అసెంబ్లీ భవనంలో రెండోసారి సమావేశాలు జరుగుతుండటం ఆనందం అంటూ తన ప్రసంగాన్నిఆయన సులభంగా ముగించారు.   

ఏదైతేనేం ఏడాదికో మాటతో మభ్యపుచ్చితేనేం...చివరకు హోదా వేరు ప్యాకేజీ వేరు అనే విషయాన్ని అటు ముఖ్యమంత్రితో, ఇటు గవర్నర్ తో, టిడిపి ఎమ్.పిలతో ఒప్పించారు వైఎస్ జగన్. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక సాయం అనే దయా భిక్షలో ఏమీ ఉండదనే విషయాన్ని ప్రజల ముందుకు తెచ్చారు. హోదా సాయం రెండూ ఒకటే అని చెప్పిన నాల్కలతోనే వాటిని మడతేసి హోదా కోసం పోరాటం చేస్తాం అనిపించారు ప్రతిపక్షనేత. ప్రత్యేక హోదాపై ప్రజలను, ఇతర పార్టీలనే కాదు ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించిన యువనేతకు తెలుగువారంతా అభినందనలు చెబుతున్నారు. 

 
Back to Top