హోదాను తాకట్టు పెట్టి సన్మానాలా..?

()కాసుల కోసం ఏపీ సీఎం కక్కుర్తి
()కేసుల మాఫీ కోసం కేంద్రంతో లాలూచీ
()హోదా హుష్ కాకి...కమీషన్ల కోసం తాపత్రయం
()మాట తప్పిన  నేతలకు సన్మానాలు
()రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వైయస్ జగన్ మహోద్యమం

హైదరాబాద్‌: ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమ వేడిని పెంచింది. ఇందు కోసం ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెండేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. విభజనతో అన్యాయమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది హోదాతోనే సాధ్యం. నష్టపోయిన ఏపీని ఆదుకునేందుకు పార్లమెంట్‌ సాక్షిగా ఆనాటి ప్రధాని ఐదేళ్ల హోదా హామీ ఇస్తే, ప్రతిపక్ష బీజేపీ పదేళ్లు కావాలని కోరింది. టీడీపీ పదిహేనేళ్లు కావాలని అడిగింది. ఇదే అంశాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాయి. కానీ అధికారం దక్కాక ఆంధ్ర ప్రజలను ప్రస్తుత అధికార టీడీపీ, బీజేపీలు నిట్టనిలువునా దగా చేశాయి. హోదా తెచ్చేది మేమే.. ఇచ్చేది మేమే అన్న టీడీపీ, బీజేపీలు ఇచ్చిన హామీని విస్మరించి రాష్ట్ర ప్రజలను వంచించాయి. హోదా కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి చేష్టలూడగడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆ బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకొని అలుపెరగకుండా ఉద్యమిస్తున్నారు.  

గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరు
విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి హోదానే సంజీవిని. ఇందు కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అలుపెరగని పోరాటం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ 2015 ఆగస్టు 10న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వైయస్‌ జగన్‌ ధర్నా చేశారు. అదే ఏడాది అక్టోబర్‌ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక హోదా కావాలని వైయస్‌ జగన్‌ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. అప్పట్లో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని, హోదా అంశాన్ని వెలుగెత్తి చాటేందుకు ప్రతిపక్ష నేత దీక్ష చేస్తే ప్రభుత్వం ఏడు రోజుల తరువాత బలవంతంగా పోలీసులతో భగ్నం చేయించింది. 2016, మే 10న హోదా సాధనకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌వద్ద వైయస్‌ జగన్‌ మహాధర్నా చేపట్టారు. ధర్నాలు, దీక్షలు, బంద్‌ లతో గల్లీ నుంచి ఢిల్లీ దాక పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సిద్ధిస్తే చేకూరే ప్రయోజనాలపై రాష్ట్రవ్యాప్తంగా యువభేరి సదస్సులు నిర్వహించి యువతలో చైతన్యం తీసుకువస్తున్నారు. 

ప్రత్యేక హోదా తాకట్టు 
ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, హక్కులను ఢిల్లీకి తాకట్టు పెట్టారు. తనపై నమోదైన ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు బాబు కేంద్రంతో లాలూచీ పడ్డారు. అంతేకాకుండా హోదా కంటే, ప్యాకేజీ ఇస్తే అందులో కమీషన్లు దండుకోవచ్చు అన్నది టీడీపీ నేతల ప్రయత్నం. ఇందులో భాగంగానే హోదా ఇవ్వమని ప్రకటించిన మరుసటి రోజే ఈ నెల 8న పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్, అంచనాలు పెంచుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. హోదా తాకట్టులో చంద్రబాబుకు దక్కిన మొదటి ప్రతిఫలం పోలవరం కాంట్రాక్ట్‌ అని చెప్పవచ్చు. దశాబ్దాల ఆంధ్రుల కలగా మిగిలి ఉన్న పోలవవరం ప్రాజెక్టును సొంతానికి వాడుకునేందుకు బాబు సిద్ధపడ్డారు. జాతీయ ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని కేంద్రం ముందుకు వస్తే బాబు ససేమిరా అంటున్నాడు. కాసుల కోసం కక్కుర్తి పడి పట్టిసీమను తెరపైకి తెచ్చాడు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు హోదా అక్కర్లేదు పోలవరం మాకప్పగించండి అని తెలుగు ప్రజల హక్కును అమ్మేశాడు.

ఏం సాధించారని సన్మానాలు..?
నాడు పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్‌ చేసి..తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పిన బీజేపీ నేతలకు రాష్ట్రంలో సన్మానం చేయడం బాధాకరం. హోదా కోసం రాష్ట్ర ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే...చంద్రబాబు పోలీసులను పెట్టి వెంకయ్యనాయుడుకు సన్మానాలు చేయించడం విడ్డూరం. ఏం సాధించారని వెంకయ్యనాయుడుకు సన్మానాలు, స్వాగతాలు, ర్యాలీలు తీస్తున్నారని టీడీపీ, బీజేపీ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. హోదాను విస్మరించి ప్యాకేజీకి మోకరిల్లి... టీడీపీ, బీజేపీలు రాష్ట్రంలో కుటిల నాటకాలకు తెరలేపడంపై భగ్గుమంటున్నారు. హోదా ఏమైనా సంజీవనా, హోదాతోనే రాష్ట్రం స్వర్గమైపోతుందా, కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్తవద్దంటుందా అంటూ చంద్రబాబు నాయుడు....హోదాను  మేక, గొర్రెల మెడలో వేలాడే అవయవాలతో పోల్చుతూ వెంకయ్యనాయుడు హేళన చేయడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.  హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన టీడీపీ, బీజేపీలకు  తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. వైయస్‌ జగన్‌  ఆధ్వర్యంలో హోదాను సాధించుకుంటామని ప్రతీ ఒక్కరు నినదిస్తున్నారు. 
Back to Top