ఎగిసిన అభిమాన జనకెరటం

గుంతకల్లు:

గుంతకల్లు పట్టణం  హనుమాన్ సర్కిల్ చేరుకున్న మహానేత తనయ వైయస్ షర్మిలకు పట్టణ ప్రజలు ఘనస్వాగతం పలికారు. హనుమాన్ సర్కిల్‌లో ఉన్న వైయస్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.  అనంతరం గుంతకల్లు పట్టణంలోకి అడుగుపెట్టారు. హనుమాన్ సర్కిల్ నుంచి బీరప్ప సర్కిల్ వరకు ఎటు చూసినా జనమే.. ఇసుకేస్తే కిందకు రాలనంత స్థాయిలో పోటెత్తారు. కాలుకదపడానికి కూడా వీలులేని స్థాయిలో కిక్కిరిసిన జనం మధ్య అడుగులో అడుగేస్తూ బీరప్ప సర్కిల్‌కు చేరుకున్న షర్మిల అక్కడే కనకదాసు విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అక్కడి నుంచి భారీ జనసందోహం పాత గుంతకల్లు మీదుగా వాల్మీకి సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి, ప్రత్యేక పూజలు చేసిన షర్మిల మార్కెట్ యార్డుకు చేరుకున్నారు.

    మార్కెట్‌యార్డులో మధ్యాహ్న భోజనం చేసిన షర్మిల.. కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 గంటలకు పాదయాత్రను కొనసాగించారు. అప్పటికే గుంతకల్లులో జనకెరటం ఉవ్వెత్తున ఎగిసింది. జనాభిమానం ఉప్పొంగింది. భారీ జనసందోహం మధ్య కథల గేరి, ఆర్టీసీ బస్టాండు మీదుగా అజంతా సర్కిల్ దిశగా సాగారు. మార్గ మధ్యలో మహిళలు షర్మిలకు అడుగడుగునా హారతులు పట్టి.. గుమ్మడికాయలతో దిష్టితీసి, ఇంటిబిడ్డలా ఆదరించారు. ఆ తర్వాత అజంతా సర్కిల్ సర్కిల్ చేరుకున్న ఆమె బహిరంగ సభలో మాట్లాడారు.

కాంగ్రెస్, టీడీపీలపై మండిపాటు
    కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు.. ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తోన్న తీరును అస్త్రంగా చేసుకుని ఆ రెండు పార్టీలను షర్మిల కడిగిపారేస్తూ చేసిన ప్రసంగానికి జనం నుంచి భారీ స్పందన లభించింది. ‘కాంగ్రెస్‌ను రెండో సారి అధికారంలోకి తీసుకురావడానికి వైయస్ రెండే రెండు హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒకటి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్.. మరొకటి రేషన్‌కార్డుకు 30 కేజీల బియ్యం.. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు హామీలను తుంగలోతొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది.. వైయస్ చేపట్టిన ప్రతి పథకాన్ని నీరుగార్చుతోంది. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది’ అని ధ్వజమెత్తారు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని దించేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. అధికారపక్షం కాంగ్రెస్‌తో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఈసడించారు. ‘ఫలితంగా చంద్రబాబు అక్రమాలకు పాల్పడినా ఈ ప్రభుత్వం విచారణ చేయదు.

    ఐఎంజీ భూముల కేసులో చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయాలని కోర్టు ఆదేశించినా ఈ ప్రభుత్వం పట్టించుకోదు. ఎమ్మార్‌కు చంద్రబాబు అత్తెసరు ధరకే భూములు కట్టబెట్టినా పట్టించుకోదు. తెహల్కా అనే పత్రిక దేశంలో చంద్రబాబు అంతటి ధనవంతుడైన రాజకీయవేత్త లేడని తెగేసి చెప్పినా ఈ ప్రభుత్వం చెవికెక్కించుకోదు. వామపక్ష పార్టీలు చంద్రబాబు అవినీతిపై ఓ పుస్తకం వేసినా ఈ ప్రభుత్వం విచారణ చేయదు. దీన్ని బట్టి కాంగ్రెస్, టీడీపీలు ఏ స్థాయిలో కుమ్మక్కయ్యాయో విశదం చేసుకోవచ్చు’ అంటూ వివరించారు. ‘ప్రజల కోసం పోరాడుతోన్న జగన్‌పై ఆ రెండు పార్టీలు కుమ్మక్కై అన్యాయంగా కేసులు పెట్టి.. జైల్లో పెట్టించాయి. దేవుడనే వాడు ఉన్నాడు. ఆ దేవుడు మంచి వైపే నిలుస్తాడు.

    చరిత్ర అదే చెబుతోంది. జగనన్న బయటకు వస్తాడు. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తాడు. అప్పడు ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా.. అందరికీ మేలు చేకూరుస్తారు’ అంటూ భరోసా ఇచ్చారు. బహిరంగసభ అనంతరం మెయిన్ బజార్, ధర్మవరం గేట్ రోడ్, మండి సర్కిల్, గాంధీ సర్కిల్, ఓల్డ్ గుత్తి రోడ్డు, కసాపురం రోడ్డు, సత్యనారాయణపేట మీదుగా పాదయాత్ర సాగింది. బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు టీటీడీ కల్యాణమండపం వద్ద పాదయాత్రను ముగించిన షర్మిల.. అక్కడే బస చేశారు. పాదయాత్రలో బుధవారం షర్మిల పది కిలోమీటర్లు నడిచారు. గురువారం కసాపురం మీదుగా మద్దికెర వద్ద కర్నూలుజిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించనుంది.

నేటితో ‘అనంత’లో పాదయాత్ర పూర్తి
    బుధవారం రాత్రి గుంతకల్లులోని టీటీడీ కల్యాణమండపం సమీపంలో వేసిన గుడారాల్లో బస చేసిన షర్మిల గురువారం ఉదయం కసాపురం చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని మద్దికెరకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. పాదయాత్రలో గురువారం మొత్తం 12.5 కిలోమీటర్ల దూరం షర్మిల నడవనున్నారు. ఇందులో అనంతపురం జిల్లా పరిధిలో ఎనిమిది కిలోమీటర్లు మేర నడవనున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ తెలిపారు.

Back to Top