విజయవాడ: విజయవాడలోని 35, 36వ డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు కూటమి రెండున్నరేళ్ల పాలనతో విసిగిపోయారని, వైయస్ జగన్ పాలనలో అందిన సంక్షేమాన్ని గుర్తుచేసుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళలు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని, వైయస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్తోందని చెప్పిన నేతలు, ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. తుఫానును ఆపానని చంద్రబాబు చెప్పడం, తుఫాను కారణంగా సీట్లు ఇవ్వలేకపోయామని పవన్ కల్యాణ్ చెప్పడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని విమర్శించారు. లోకేష్ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమేనని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతోందని విమర్శించారు. విజయవాడలో పూట వర్షం పడితే రోడ్లు మునిగిపోతున్నాయని, పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, దోమల బెడద పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ప్రకటించిన “దోమలపై దండయాత్ర” ఏమైందని ప్రశ్నించారు. వైయస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థి గెలిస్తే విజయవాడ ప్రజల నుంచి వసూలయ్యే పన్నులను నగర అభివృద్ధికే ఖర్చు చేస్తామని, పన్నులు పెంచబోమని వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. రోడ్లు, పారిశుధ్యం, దోమల నివారణ వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. 35, 36వ డివిజన్లలో ప్రజలతో మమేకమవుతూ వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు మద్దతు కోరుతున్నామని చెప్పారు.