‘దావోస్‌’ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌

– సోషల్‌ మీడియా దెబ్బకు అభాసుపాలైన సీఎం
– డబ్ల్యూఎఫ్‌ సదస్సుకు 4.5 కోట్లతో ఎంట్రీ పాసు కొన్న బాబు 
– గత అక్టోబర్‌లో పర్యటన కోసం రూ. 6. 39 కోట్లు విడుదల 
– వెలుగుచూసిన ఒబామాతో లోకేష్‌ కరచాలనం డ్రామా
– పచ్చ మీడియాకు షాకిచ్చిన తండ్రీకొడుకులు 

సోషల్‌ మీడియా పుణ్యమా అని బాబు చేస్తున్న ప్రచారం అబద్ధాలేనని ఒక్కొక్కటీ వెలుగు చూస్తుంటే చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెత గుర్తుకొస్తుంది. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో ప్రసగించడానికి చంద్రబాబు వెళ్తున్నాడని పచ్చ మీడియా చేసిన కంపు ప్రచారం చూసి జనం పళ్లు నూరుతున్నారు. ఛానళ్లన్నీ మూకుమ్మడిగా చేసిన బాబు భజనకు.. వాస్తవాలకూ మధ్యన ఉన్న వ్యత్యాసం చూసి జనం బిత్తరపోయారు. బాబు డైరెక్షన్‌లో పచ్చ పత్రిక.. ఇతర మీడియా చేసిన అబద్ధపు సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. దావోస్‌ సదస్సులో బాబు ఫలానా అంశాలపై ప్రసంగిస్తారంటూ చేసిన ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. బాబు ప్రచార ఆర్భాటం గురించి ఛానళ్లు మర్చిపోయాయో లేదా నిజమేనని నమ్మాయో తెలీదు కానీ నిజాలు తెలిసి పచ్చ మీడియా సంస్థలన్నీ ఖంగు తిన్నాయి. ఓరి నీ యేసాలో అని నోరెళ్లబెట్టాయి. 

దావోస్‌... ఏటా జనవరిలో ఈ పేరు ఏపీ వ్యాప్తంగా మార్మోగుతుంటుంది. ఎందుకంటే ఏటా క్రమం తప్పకుండా జనవరిలో చంద్రబాబు దావోస్‌ వెళ్తుంటారు. ఆయన అలా ఫ్లయిట్‌ ఎక్కగానే ఇక్కడి ఆయన అనుకూల మీడియా ప్రతి అరగంటకు ఒక కథనాన్ని కట్టకట్టి జనం మీదకు వదులుతుంది. లక్షల కోట్ల పెట్టుబడులను దావోస్‌లో మూటకట్టుకుని వస్తున్నారని చెవిలో స్టోరీలు వినిపిస్తుంది. దావోస్‌ సమ్మిట్‌లో చంద్రబాబుపైనే అందరి దృష్టి అని, చంద్రబాబును చూడగానే బిల్‌గేట్స్, సత్యనాదెళ్ల భావోధ్వేగానికి లోనయ్యారని చెవులు వాచిపోయేలా మోతపుట్టిస్తుంది. గడ్డ కట్టే చలిలోనూ బాబు మాత్రం కనీసం చలి కోటు కూడా వేసుకోకుండా (మంగళవారం ఒక టీడీపీ అనుకూల పత్రిక చలికోటుపై కథనం రాసేసింది. అందరూ నాలుగైదు అంచెల దుస్తులు ధరిస్తుంటే చంద్రబాబు మాత్రం కనీసం చలి కోటు కూడా వేసుకోలేదని) తిరుగుతున్నారంటూ సైడ్‌ లైట్స్‌ కామన్‌. 

రూ. 4.5 కోట్లు పెట్టి పాస్‌ కొన్నాడు
సోషల్‌ మీడియా కారణంగా బాబు బండారం మొత్తం బయటకు వచ్చేస్తోంది. చంద్రబాబు లేకుంటే దావోస్‌ సమ్మిట్‌కు సరైన కళ ఉండదన్న ఉద్దేశంతో నిర్వాహకులే ప్రత్యేకంగా ఆహ్వానించారని గతంలో ఆయన మీడియా జనానికి చెప్పేది. కానీ నిజం అది కాదు. దావోస్‌ సమ్మిట్‌లో అడుగు పెట్టేందు కోసం కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును పెట్టి చంద్రబాబు ఎంట్రీ పాస్‌ కొనుక్కొన్నారు. ఏకంగా రూ. 4.5 కోట్లు ఖర్చు పెట్టి దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో అడుగుపెట్టే అవకాశాన్ని కొనుక్కొన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు, డబ్బులు రిలీజ్‌ చేసిన జీవోలు కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

ఈ ఎంట్రీ పాస్‌ సాధించేందుకు అక్టోబర్‌ నెలలోనే గుట్టుచప్పుడు కాకుండా ఆర్ధిక శాఖ నిధులను విడుదల చేసింది. చంద్రబాబు దావోస్‌ పర్యటన కోసం అక్టోబర్‌లో రూ. 6. 39 కోట్లను విడుదల చేశారు. కొన్ని నెలల ముందే నిధులు విడుదల ఎందుకు చేయాల్సి వచ్చిదంటే ఇప్పుడు జరుగుతున్న ఈవెంట్‌కు టికెట్‌ బుకింగ్‌ అక్టోబర్‌లోనే జరిగింది. రూ. 6.39 కోట్ల నిధుల్లో రూ. 4.5 కోట్లను ఎంట్రీ పాస్‌కు కట్టబెట్టేశారు చంద్రబాబు. చంద్రబాబును వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వారే ప్రత్యేకంగా ఆహ్వానించారని ఇక్కడి అనుకూల మీడియా డబ్బా కొడుతోంది. అయితే అక్కడ చంద్రబాబు స్థాయి ఏంటో చెప్పేందుకు ఒక పాయింట్‌ చాలు. చంద్రబాబు ఇక్కడ ఇంత గొప్పలు చెబుతున్నా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం మెయిన్‌ ఈవెంట్‌లో చంద్రబాబుకు మాట్లాడే అవకాశం లేదు.

వక్తల జాబితాలో బాబు పేరే లేదు
వక్తల జాబితాలో చంద్రబాబు పేరు లేదు. అయితే ఈవెంట్‌ విరామ సమయంలో, కొన్ని గుంపు చర్చల్లో మాట్లాడేసి ఆ ఫొటోలను బయటకు విడుదల చేస్తుంటారు. ఇప్పుడే కాదు 1997 నుంచి 2003 వరకు ప్రతిఏటా దావోస్‌ వెళ్తున్నారు. అప్పుడు కూడా ఇలాగే ఎంట్రీ పాస్‌ కొనుక్కుని వెళ్లారు. అయితే అప్పట్లో టీడీపీ అనుకూల మీడియా మాత్రమే ఉండడంతో నిజాలు బయటకు వచ్చేవి కాదు. 

ప్రసంగింకులు ఎవరంటే..
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ప్రసగించేవారి జాబితాలో సీఎం చంద్రబాబు పేరే లేదు. ఆయన కేవలం పాస్‌ కొనుగోలు చేసి వెళ్లిన ఒక ప్రేక్షకుడు మాత్రమే. మన దేశం నుంచి ప్రసంగీకులు ఎవరంటే.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, బిజినెస్‌ మ్యాన్‌ ముఖేష్‌ అంబానీ, అరుంధతీ భట్టాచార్య, కరణ్‌ జోహర్, సునీల్‌ మిట్టల్, ప్రణయ్‌రాయ్‌ తదితరులు. అయితే ఈ లిస్టులో భూతద్దం పెట్టి వెదికినా బాబు పేరు ఎక్కడా కనిపంచకపోవడం ఆశ్చర్యం. అయితే ఆయన బూతు పత్రిక మాత్రం 17 నుంచి 20 వ తేదీ వరకు ఆయన ఏయే అంశాల మీద ప్రసంగిస్తారో వివరిస్తూ కథనం వండేసింది. 

తండ్రి బాటలోనే కొడుకు కూడా
చంద్రబాబు 1997 నుంచి ఫాలో అవుతున్న ఈ ఎత్తును కుమారుడు లోకేష్‌కు కూడా నేర్పించారు. అందుకే ఇటీవల లోకేష్‌ అమెరికా వెళ్లి అధ్యక్షుడు ఒబామాను పార్టీ ఫండ్‌ సేకరించే కార్యక్రమంలో డబ్బులు కట్టి పాల్గొని ఫొటో దిగారు. అమెరికా అధ్యక్ష కార్యాలయం ఆహ్వానం మేరకే లోకేష్‌ అక్కడికి వెళ్లారని తొలుత సొంత మీడియా డప్పు వాయించింది.  పైగా లోకేష్‌ను చూడగానే నాన్నగారు (చంద్రబాబు) ఎలా ఉన్నారంటూ ఒబామా పలకరించారంటూ ప్రచారం చేశారు. వాస్తవానికి చంద్రబాబు ఎవరో ఒబామాకు తెలిసి ఉండదు. ఒబామాకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు లోకేష్‌ 10వేల డాలర్లు చెల్లించిన విషయం బయటకు రావడంతో నారా వారు నవ్వుల పాలయ్యారు. ఇప్పుడు బాబు దావోస్‌ సీక్రెట్‌ కూడా బయటపడిపోయింది. ఏటా నాలుగున్నర కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి ఎంట్రీ పాస్‌ తెచ్చుకుంటున్నారు చంద్రబాబు. ప్రస్తుతం చంద్రబాబు దావోస్‌ పర్యటన మొత్తం ఖర్చు 24 కోట్లు అని చెబుతున్నారు. చంద్రబాబు ప్రత్యేక విమానంలో దావోస్‌ వెళ్లారు. 
Back to Top