సిగ్గు... సిగ్గు

*నిస్సిగ్గుగా ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు
*పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బాబు
*రాజ్యాంగ విలువలకు తిలోదకాలు
*ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి అవినీతికి బాటలు
*చంద్రబాబుపై మండిపడుతున్న రాష్ట్ర ప్రజానీకం

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను ఏపీ సీఎం చంద్రబాబు భ్రష్టుపట్టిస్తున్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం, అనైతిక కార్యక్రమాలకు పాల్పడడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఓ పార్టీ సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బులు, మంత్రి పదవలు ఆశచూపి ప్రలోభాలతో అక్కున చేర్చుకొని వాపును చూసి బాబు బలుపులా ఫీలవుతున్నారు. సొంత పార్టీ నేతలను పక్కనబెట్టి కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుక్కున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు కట్టబెట్టడం పట్ల చంద్రబాబుపై ప్రతీ ఒక్కరూ దుమ్మెత్తిపోస్తున్నారు. నాయకుడు అనేవాడు ప్రజలకు మంచి చేసి మెప్పు పొందాలి గానీ, డబ్బులతో, ప్రలోభాలతో, బెదిరింపులతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ దిగజారుడు రాజకీయాలు చేయడం కాదని బాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.  చంద్రబాబు జీవితమంతా అబద్ధాలు, మోసాలు, వెన్నుపోటు రాజకీయాలేనని ఎత్తిపొడుస్తున్నారు.  

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు మరింత అన్యాయానికి గురిచేశారు. అనుభవజ్ఞఢిని అది చేస్తా, ఇది చేస్తానని అబద్ధపు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన బాబు... రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అభివృద్ధిని పక్కనబెట్టి అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోని ఏపీని అవినీతిలో నంబర్ వన్ చేశాడు. ముఖ్యమంత్రి మొదలు టీడీపీ కార్యకర్త దాకా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ..కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తూ...సర్వం భక్షించేశారు. భూ మాఫియా, ఇసుకమాఫియా, కాల్ మనీ సెక్స్ రాకెట్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా విచ్చలవిడిగా కుంభకోణాలకు పాల్పడుతూ ఆంధ్రప్రదేశ్ ను స్కాం ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు. ఇచ్చిన హామీలు విస్మరించి అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచాడు. 

ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు అవినీతి సొమ్మును వెదజల్లుతూ ఆడియో, వీడియో టేపులతో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా రాజీనామా చేయకుండా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ బాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు.  ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి అవినీతి, అక్రమాలు, అనైతిక కార్యక్రమాలే ధ్యేయంగా పని చేస్తూ ఏపీ పరువు తీస్తున్నారు. ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉన్నా కూడ వైయస్సార్సీపీ సింబల్ పై గెలిచిన 21మంది ఎమ్మెల్యేలను కొనుక్కోని...వారిని అనర్హులుగా ప్రకటించకుండా నిస్సిగ్గుగా మంత్రిపదవులు కట్టబెట్టడంపై ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రజా, విద్యార్థిసంఘాలు, మేధావులు అంతా మండిపడుతున్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. 
Back to Top