హస్తినలో బాబు డ్రామాలు

()మరోసారి కేంద్రం వద్ద మోకరిల్లిన చంద్రబాబు
()ఓటుకు కోట్లు భయంతో కేంద్రంతో కాళ్లబేరం
()బాబు డైరక్షన్ లో హోదా పేరుతో సుజనాచౌదరి వీధి నాటకం
()స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు బలిపెట్టిన బాబు

 స్విస్ చాలెంజ్, ఓటుకు కోట్లు వ్యవహారాలలో కోర్టులు ఇస్తున్న తీర్పులతో తలబొప్పికట్టిన  చంద్రబాబు పరువు కాపాడుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం ప్రత్యేకహోదా పేరుతో హస్తినలో ‘ప్యాకేజీ’అనే వీధినాటకం ఆడిస్తున్నారని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బాబు డెరైక్షన్‌లో కేంద్ర మంత్రి సుజనాచౌదరి నాయకత్వంలో ఢిల్లీలో జరుగుతున్నదంతా ఈ నాటకంలో భాగమేనని ఆ వర్గాలు పేర్కొంటున్నా యి. రెండున్నరేళ్లుగా చంద్రబాబునాయుడు ఎన్నడూ ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టిన పాపాన పోలేదన్న విషయం అందరికీ తెల్సిందే. మరోవైపు ప్యాకేజీయే ఇవ్వబోతున్నట్లు కేంద్రం ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి కూడా విదితమే. 

హోదా సంజీవని కాదు అని వ్యంగ్యంగా మాట్లాడిన చంద్రబాబు వైయస్సార్సీపీ ఉధృత పోరాటాలతో ప్రజలలో భావోద్వేగాలు పెరగడం గమనించి స్వరం మార్చారు. రూ.1.90లక్షల కోట్ల నిధులిచ్చామన్న కేంద్రాన్ని.. ఎక్కడిచ్చారు..? రోడ్లకిచ్చిన నిధులన్నీ కలిపిచెబుతున్నారని హూం కరించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో పునర్విచారణకు ప్రత్యేక కోర్టు ఆదేశించగానే మళ్లీ కేంద్రం ముందు మోకరిల్లారు. ప్రత్యేక హోదా కోసం చర్చలు జరుపుతున్నట్లు బిల్డప్ ఇచ్చా రు. మరోవైపు కేంద్రం కొన్ని ప్రతిపాదనలతో ముసాయిదా తయారు చేసిందని అవన్నీ హోదా కన్నా ఎక్కువగానే ఉంటాయని అనుకూల మీడియాలో ప్రచారం చేయించారు. ఐదుకోట్ల మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి, కోట్లాది మంది నిరుద్యోగుల భవిష్యత్‌ను బలిపెట్టి చంద్రబాబు ఆడించిన నాటకం ఇది. సుజనా వంటి పాత్రధారులు శతవిధాలుగా శ్రమించినా అది రక్తికట్టలేదు.

 హోదా కోసం ఏనాడు పోరాడని చంద్రబాబు, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా  స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు....ఓటుకు కోట్లు కేసు పునర్విచారణ భయంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు హోదా కోసం ఏదో చేసేస్తున్నట్లు ఎల్లో మీడియాలో బిల్డప్ లిచ్చారు. రాష్ర్టప్రభుత్వం తరఫున ప్యాకేజీకి కొన్ని ప్రతిపాదనలు చేసి వాటిని కేంద్రం దృష్టికి తీసుకొచ్చినట్లు నటించారు. తీరా చూస్తే అవి ప్రతిపాదనలేనని, కొత్తవేవీ లేవని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని పట్టుపట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మెట్టుదిగిపోయి ప్యాకేజీ అంటూ ప్రతిపాదనలు సమర్పించడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది.

కేంద్రప్రభుత్వం నుంచి వైదొలుగుతామని, మంత్రుల చేత రాజీనామా చేయిస్తామని... అల్టిమేటమ్ జారీ చేయడంతో పాటు కేంద్రంపై వత్తిడి తీసుకురావడానికి అనేక మార్గాలున్నా...ఇచ్చిందే తీసుకుంటామన్న ధోరణిలో బాబు కేంద్రాన్ని అడుక్కునే విధానం ఎంచుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి 1.60 లక్షల కోట్ల రూపాయల నిధులిచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఎక్కడిచ్చారు..? రోడ్లకు ఇచ్చిన నిధులన్నీ కలిపి చెబుతున్నారని, కేంద్రం మనకు అన్యాయం చేసిందని చంద్రబాబు ఈ మధ్య ప్రకటనలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో ఊరట లభించగానే అలాంటి హూంకరింపులు వదిలేశారు. కేసు నుంచి బయటపడడం కోసమే.. ఏవో కొన్ని ప్రతిపాదనలతో ఓ మెమొరాండం తీసుకుపోయి కేంద్ర మంత్రులతో, బీజేపీ నేతలతో భేటీలు జరిపి హడావిడి చేశారు తప్ప.. రాష్ట్రానికి మేలు చేయాలన్న చిత్తశుద్ధి బాబుకు లేదన్నది స్పష్టమవుతోందని విశ్లేషకులంటున్నారు.

Back to Top