ఆరోపణలతో ఆశయాలు ఆపలేరు

బురద జల్లడంలో, అడ్డగోలు ఆరోపణలు చేయడం చంద్రబాబు నైజం. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని కోరుకుంటారు చంద్రబాబు. ఎందుకంటే తనను ప్రశ్నించే గొంతుక ఉండకూడదని ఆయన అభిప్రాయం. అదే పద్ధతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులతో, మాటల దాడులు చేయమని తెలుగు తమ్ముళ్లను ఎగదోస్తున్నారు బాబు. నాలుక ఎటుతిరిగితే అటు మాట్లాడటం, శాసన సభా ప్రాంగణంలో, స్పీకర్ ముందే అభ్యంతరకరమైన భాష వాడటం తెలుగు తమ్ముళ్లకు అలవాటే. అధికారం ఉంది గనుక ఏం చేసినా చెల్లుతుందనే అహంకారమే అందుకు కారణం. 

ప్రతిపక్ష నేత నవంబర్ 2 నుంచీ ఆరంభించనున్న పాదయాత్ర గురించి ప్రజలందరూ చర్చించుకోవడం మొదలైంది. ప్రజలతో మమేకమై, ప్రజల కోసం జరిపే ఈ పాదయాత్రలో చంద్రబాబు నిరంకుశ పాలనను ఎండగడతానని చెప్పారు వైయస్ జగన్. హోదాపై టిడిపి సర్కార్ తీరును ఖండిస్తూ, ప్రజల మద్దతు కూడగడతానని కూడా చెప్పారు. టిడిపి చేసిన అన్యాయాలు, అమలు చేయని హామీలపై ప్రజలను అడిగి తెలుసుకుంటానని విపక్ష నేత ప్రకటించారు. దీంతో ఎలాగైనా పాదయాత్ర లక్ష్యాన్ని ప్రజలకు చేరనీయకుండా, తప్పుడు ప్రచారానికి తెరతీసారు బాబు. ప్రతిపక్ష నేతపై మోపిన కక్ష పూరిత కేసులను, కోర్టు ప్రొసీడింగ్సును విమర్శలుగా వాడుకోవాలని చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు ఆదేశించారు. దాంతో రెచ్చిపోయిన ఎల్లో గ్యాంగ్ శుక్రవారం కోర్టుకు హాజరయ్యే విషయంపై విమర్శలు గుప్పిస్తోంది.  

వైయస్సార్ మరణానంతరం కాంగ్రెస్ తో కుమ్మక్కై కుట్రలు చేసిన చంద్రబాబు నేడు జగన్ పై  తన అనుకూల మీడియాతో జైలు, కోర్టుకు హాజరీ వంటి విషయాలపై విషపు రాతలు రాయిస్తూనే ఉన్నాడు. అయితే బాబు ఒక్క విషయాన్ని మర్చిపోకూడదు అంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్…న్యాయస్థానం మీద నమ్మకంతోనే వైయస్ జగన్ తన పోరాటాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఏనాటికైనా న్యాయానికి గెలుపు తథ్యమని నమ్మి తన విలువల బాటను విస్మరించకుండా రాజకీయాల్లో పయనిస్తున్నారు. ధర్మానికి కట్టుబడి ఉన్నవారికి న్యాయస్థానంలో ఎప్పుడూ అన్యాయం జరగదని యువనేత నమ్ముతున్నారు. సుదీర్ఘకాలం అందుకు పోరాడాల్సి వచ్చినా సరే అందుకు సిద్ధమన్నారు వైయస్ జగన్. జగన్ నిర్దోషిత్వాన్ని కోర్టు నమ్మడానికంటే ముందే రాష్ట్రప్రజలు నిండు మనసుతో నమ్మారు. అందుకే ఆయన అడుగుపెట్టిన ప్రతి చోటా ప్రజలు నీరాజనాలే పలుకుతున్నారు. అన్యాయాల చిట్టా బైటపడ్డప్పుడల్లా స్టేలు తెచ్చుకుని, తప్పించుకుంటున్న చంద్రబాబు ఎంతో కాలం న్యాయం కళ్లు కప్పి నిలవలేరని, రానున్న జగన్నాధ రథ చక్రాలను ఆపలేరని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Back to Top