బాబు వెడలె భయభక్తులు చూపగం

రాజు వెడలె రవితేజములలరగ, కుడిఎడమల డాల్ కత్తులు మెరయగ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి పొగడిన పొగడ్త పొగడకుండా పొగిడిపోగిడి మరీ తరించాయి ఎల్లో మీడియా మైకులు. సమరమే అంటూ మహేష్ బాబు పోకిరీ సాంగ్ లెవల్ ఇంట్రడక్షన్లు ఇచ్చాయి. ఆఖరికి ఇదో కురుక్షేత్ర సంగ్రామం అని, చంద్రబాబు అర్జునుడు ఇంకా అందుకు సమానమైన వాడు అని హైప్ బిల్డప్ చేసాయి. దేశంలోని ముఖ్యమంత్రులందరితో ప్రధాని మోదీ జరిపిన నీతీ ఆయోగ్ మీటింగ్ గురించే ఈ సీన్ అంతా. అవసరమైతే నీతిఆయోగ్  సమావేశాన్ని బాబు బహిష్కరిస్తారని, ప్రధానిపై సీఎం చద్రబాబు యుద్ధం ప్రకటిస్తారని, రాష్ట్ర సమస్యలపై కేంద్రం వైఖరి ఎండగడతారని, మోదీని నుంచోబెట్టే ఉతికి ఆరేస్తారని...ఇలా శతసహస్రవిధాలుగా చంద్రబాబు చేయబోయే వీరధీరకార్యశూరత్వాన్ని ముందే కళ్లతో చూసేసినట్టు ప్రచారం చేసాయి తెలుగుదేశం ఫేవర్ మీడియా హౌస్ లు. 
మోదీ ముందు బాబు విధేయత 
చంద్రబాబును అసలంటూ నమ్మని వాళ్లు సైతం ఎన్డీయే నుంచి విడిపడ్డాక మోదీతో నేరుగా కలిసే వ్యవహారం గనుక చంద్రబాబు ఏం చేస్తాడో అని ఆసక్తి గా చూసారు..కట్ చేస్తే కట్టుబానిస కట్టప్ప కంటే కనాకష్టంగా, దారుణంగా, హీనంగా ప్రవర్తించాడు చంద్రబాబు. రాష్ట్రాన్ని మోసం చేసారు, అన్యాయం చేసారు అని రోజూ కడివెడు కన్నీళ్లు కారుస్తూ బీజేపీని మోదీనీ దుమ్మెత్తి పోస్తున్న బాబు, ప్రధాని కనిపించగానే ఆసాంతం వంగిపోయి, కుడిఎడమల తేడా కూడా లేకుండా, ప్రధాని పురచేతి షేక్ హ్యాండ్ ను తన కుడిచేతితో అందుకుని అదే పరమ పావనం అన్నంతగా పులకరించి, పరవశించిపోయారు. చారెడు ముఖాన్ని చాటంత చేసుకుని మరీ అట్టహాసమైన వికటాట్టహాసం ఒకటి చేసారు. మోదీ వ్యతిరేక కూటమిలో తానే ముందిడి అంతా నడిపిస్తున్నట్టు, జాతీయ రాజకీయాల్లో చక్రాన్ని బొంగరంలా తిప్పేస్తున్నట్టు నిన్నటిదాకా బిల్డప్ ఇచ్చారు చంద్రబాబు. మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరయ్ విజయన్ కూడా అక్కడే ఉన్నా వారు హుందగా నిలబడితే, బాబు మాత్రం భయ, భక్తి, శ్రద్ధలతో మోదీ ముందు వినంమ్రంగా వంగడాన్ని చూసి వారంతా ఫక్కున నవ్వేశారు. అంతేనా మీడియా ప్రముఖులు కొందరు ఇవి కదా అసలైన రాజకీయాలంటే అని వ్యంగ్యంగా ట్వీట్లు కూడా చేసారు. చంద్రబాబు మోదీపై యుద్ధం ప్రచారం అంతా పటాటోపం అని, కేంద్రంలో పెద్దలను చూస్తే బాబుకు ఆటోమేటిక్ గా భయభక్తులు వాటంతటవే వ్యక్తం అవుతాయని ఈ సన్నివేశంతో అందరికీ కన్ఫర్మ్ అయ్యింది. బాబు భజన మీడియాలు చెమ్చాపట్టుకున్న చంద్రబాబును కరవాలం ఝుళిపిస్తున్నాడని, తుమ్ముతున్న ముఖ్యమంత్రిని దుమ్మురేపుతున్నాడని రాయగల ఉద్దండులని సంపూర్ణంగా గ్రహించారు. 
మసిపూసి మారేడుకాయి
నీతి ఆయోగ్ సమావేశం ఆరంభం అయిన తర్వాత కూడా చంద్రబాబు తన చతురత చూపించారు. ముఖ్యమంత్రులు, ప్రధాని కూడా వచ్చి కూర్చున్నాక చివరాఖరుగా, ఎవ్వరూ పలకరించే వీలు లేకుండా చడీచప్పుడు లేకుండా మోదీ వెనకనుంచి చల్లగా వచ్చి తన సీటులో కూర్చున్నారు బాబుగారు. ఖర్మేమిటంటే దీన్ని కూడా బాబు అనుకూల మీడియా అత్యంత గొప్పగా అభివర్ణించుకుంది. మోదీని పట్టించుకోకుండా చంద్రబాబు వెళ్లి తన సీటులో కూర్చున్నారని, ప్రధానినే లెక్కచేయని డైనమిక్ సీఎమ్ అని ప్రజల్ని నమ్మించేందుకు నానావిధ ప్రయత్నాలు చేసింది. బాబు స్పీచ్ కు బీజేపీ నేత రాజ్ నాథ్ సింగ్ అడ్డుపడ్డారని కూడా చెప్పుకున్నదీ భజన బృందం. సమావేశంలో ప్రతి ముఖ్యమంత్రీ మాట్లాడాల్సి ఉంది కనుక ఒక్కోక్కరికీ ఇచ్చిన నిర్దిష్ట 7 నిమిషాల సమయం పూర్తైందని సమావేశ సమన్వయకర్తగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేస్తే దాన్ని కూడా బాబు స్పీడ్ స్పీచ్ కి భయపడి బ్రేకులు వేయబోయారంటూ కథలు చెప్పుకొచ్చాయి. మైకు దొరికితే తన చరిత్ర డప్పులు, ప్రస్తుత అప్పులు, ఫ్యూచర్ గొప్పలు చెప్పుకునే బాబు, నీతిఆయోగ్ సమావేశంలోనూ తనకిచ్చిన టైమ్ కంటే ఎక్కువ లాక్కుని మరీ యధావిధిగా మైకును నమిలేశారు. 
కన్ క్లూజన్  ఏతావాతా నీతీఆయోగ్ మీటింగ్ వల్ల తేలిందేమయ్యా అంటే బీజేపీతో బాబు సంబంధాలకు ఢోకా లేదు. మోదీ ముందర బాబు కుప్పిగంతలు వేయలేరు. కనీసం గొంతు పెంచి నేరుగా ఒక్కమాటైనా నిలదీసే సీను ఏమాత్రం లేదు. నీతి ఆయోగ్ సమావేశానికి ముందు తన స్పీచ్ నోట్ పాయింట్లు, సమావేశం తర్వాత తన విజన్ గొప్పలు చెప్పుకోవడంతో ఈ కార్యక్రమం శుభప్రదంగా ముగిసింది. చంద్రబాబు చేతిగానితనం దేశవ్యాప్తంగా మరోసారి తెలిసింది. 
 
Back to Top