మోడీ కొట్టాడు. జగన్‌ తిట్టాడు. పవన్‌ మొట్టాడు

 


నిన్నొకటి చెప్పి, నేడొకటి చెప్పేవాళ్ళను పట్టుకుని ఎవరైనా ఏమంటారు? ఏమని నిలదీస్తారు?
చెప్పిందొకటి...చేసిందొకటి..ఇంకా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్‌? అని ఎవరైనా అంటారు. ఇంకా మండితే నిలదీసి ప్రశ్నిస్తారు.  
పూటకో మాట చెప్పే చంద్రబాబును పట్టుకుని ’ ఏం మొహం పెట్టుకుని ఇంకా మాట్లాడుతున్నావని’ ఈ రాష్ట్రప్రజలు ఎన్నిసార్లు అన్నా తప్పు లేదు. ఒకవేళ అలా అని ఐదుకోట్ల ఆంధ్రులు అన్నా చంద్రబాబుగారికి చెవికెక్కుతుందనుకోలేం. ఎందుకంటే.. ఆయనదదో తరహా. పుట్టి బుద్దెరిగినప్పటినుంచి ఏ పూటకా మాట... ఏ గడప కాడ ఆ పాట పాడేరకం మరి!!

ఈ రోజు పార్లమెంటు సాక్షిగా ప్రత్యేకహోదా రగులుతోంది. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి ఉనికిని గట్టిగా చాటుతోంది. నాలుగేళ్లుగా కేంద్రప్రభుత్వానికి వంతపాడి...వారు చెప్పినట్టే విని..హోదా వద్దులే, ప్యాకేజీ సరేలే అన్న బాబుగారు, ఇప్పుడు తేడా రాగానే ప్లేటు ఫిరాయించారు. అదే నాలుగేళ్లుగా ప్రత్యేకహోదాపై అలుపెరగని పోరాటం చేస్తున్న విపక్షనేత జగన్‌ ఎక్కడ క్రెడిట్‌ కొట్టేస్తాడోనని, ఇప్పుడు కిందపడ్డా నాదే పై చెయ్యంటూ ఆయాసపడుతున్నారు శ్రీమాన్‌బాబుగారు. ప్రజలంతా బాబుగారి రాజకీయం చూస్తూనేవున్నారు. కల్లబొల్లి కబుర్లను అర్థం చేసుకుంటూనే వున్నారు.  దిక్కుమాలిన స్థితిలో పడి, దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ...దేశంలోనే సీనియర్‌ పొలిటీషియన్ను అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. తాను నిప్పంటూ...తుప్పుపట్టిన తన రాజకీయాలతో రాష్ట్రానికి చేటు తెస్తున్నారు. 
ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీపైనా నిజాయితీగా నిలబడని చంద్రబాబు.. ప్రజలను నమ్మించి మోసగించడం నిజం. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా వరాలు గుప్పించి, ఆ  పై గద్దెనెక్కి కూర్చున్న బాబుగారు.. తనవారికోసం, తన చుట్టూ పోగయిన వందిమాగద సందోహం కోసం మినహా ప్రజలకంటూ చేసిన మంచంటూ ఒక్కటంటే ఒక్కటీ లేదు. 

కార్పొరేట్‌ స్థాయి రాజకీయనేతనంటూ ప్రజాస్వామిక వ్యవస్థను భ్రష్టుపట్టించారు. తానే రాష్ట్రం, రాష్ట్రమే తానన్నట్టుగా...ప్రజల ఉనికినే గుర్తించని కబోదిగా మారిపోయారు. నిన్నామొన్నటి దాకా గల్లీలోనైనా, ఢిల్లీలోనైనా చక్రం తిప్పడంలో మా బాబు వీరుడు, శూరుడు అని తెగనీల్గిన నారా శ్రేణులే బిత్తరపోయేలా..బాబుగారు ఇప్పుడు ఏడుపు రాగం అందుకున్నారు. మోడీ కొట్టాడు. జగన్‌ తిట్టాడు. పవన్‌ మొట్టాడు అని అమాయక తెలుగుప్రజల సానుభూతి కోసం కొత్తరాజకీయానికి తెరలేపుతున్నారు. ఇప్పుడే కాదు, గతంలోనూ బిజెపీతో దోస్తీ కట్టి సాగిన బాబుగారు, ఇప్పుడు మైనారిటీలను వలలో వేసుకునే క్రమంలో బిజెపీకి కటీఫ్‌ చెప్పాననే  స్థాయికి దిగజారిపోయారు.  సంక్షోభసమయాల్లో సమర్ధుడైన నాయకుడంటూ బాబుగారి తోకమీడియాలు తరచూ కోతలు కోస్తు్తంటాయి. రాస్తుంటాయి. నిజానికి సంక్షోభానికి అసలు కారణం చంద్రబాబుగారే నన్నది దాచిపెడుతుంటాయి. 

ప్రత్యేకహోదా విషయమే తీసుకుందాం. అదేమన్నా సంజీవనా?అని ఎకసెక్కాలాడిందీ బాబే. ప్రత్యేక ప్యాకేజీతో రాజీపడిందీ బాబే. అన్ని రకాలుగా చెడ్డతర్వాత, ప్రత్యేకహోదా వదులు కోవడం వల్ల ఎపికి ఎంత కష్టం, ఎంత నష్టమని జనమంతా రోడ్డెక్కుతున్న సందర్భమిది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని హక్కులను జారవిడిచేసి, తన వ్యక్తి గత స్వార్థప్రయోజనాల కోసం రాజకీయాలను నడిపి, ఇప్పుడు రైతులనుంచి, సమస్త వృత్తుల సమస్త జాతి జనాల్ని సంక్షోభపరిస్థితుల్లోకి నెట్టేసింది బాబుగారు మరెవరు? సమర్ధుడైన బాబు ఈ సంక్షోభం నుంచి బయటపడొచ్చేమో, తప్పుకోవచ్చేమో గానీ ఆయనగారి అసమర్ధ, నీతిమాలిన రాజకీయాల వల్ల నష్టపోయిన ప్రజల కష్టం తీరడానికి చాలా కాలమే పడుతుంది. 

పి.యస్ః
నలభై ఏళ్లుగా ప్రజలకోసమే కష్టపడుతున్నానని బాబుగారు అనగానే, బాబుగారి అబ్బాయి నాన్న కష్టం పగవారికి కూడా వద్దని జోకులేస్తారు. ఇక వందిమాగధులైతే ఇన్ని దశాబ్దాలుగా మీరింతగా కష్టపడిపోయారని చెబుతుంటే, అసెంబ్లీ సాక్షిగా బాబుగారికి కంటతడి! నిజంగానే నన్ను నేను మరిచి, వాచీ, ఉంగరం కూడా కొనుక్కోకుండా ప్రజలకోసం ఇంత కష్టపడిపోయానా?అని నాకే ఆశ్చర్యమేస్తోంది అని బాబుగారు అంటుంటే, నిజంగానే బాధేస్తోంది. మనవడిని ఇన్ని రోజులు చూడలేదు. భార్యతో మాట్లాడటానికే టైం లేదు.  ప్రజలే తప్ప మరేదీ లేకుండా.. ఆ విధంగా ముందుకు పోతున్నానని బాబుగారు  చెబుతుంటే, దేశం కోసం ప్రజలకోసం ప్రాణాలను తృణపాయాలుగా వదిలేసిన వారు,  సమాజశ్రేయస్సు కోసం ఆస్తులను హారతి కర్పూరంలా కరిగించేసినవారిని తలచుకోకుండా వుండలేం. వారిని తలచుకుంటే మాత్రం బాబుగారి మాటలకు..చేష్టలకు సిగ్గుపడక తప్పదు. 
 
Back to Top