పరిహారమా.. పరిహాసమా?

– ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కరువు
– నిబంధనల పేరు చెప్పి పరిహారానికి సర్కారు కత్తెర
– నిఘా వర్గాల సమాచారం మేరకే నిధుల విడుదల 
– వైయస్‌ఆర్‌సీపీతో అనుబంధం ఉంటే పరిహారం రాదు
– రైతు కుటుంబాలతో ఆడుకుంటున్న టీడీపీ ప్రభుత్వం

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్న‌దాత‌ల ఆర్థ‌నాదాలు పెడుతున్నా..పాల‌కులు వినిపించుకోవ‌డం లేదు. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా మొదలుకుని రాయలసీమలోని అనంతపురం దాకా రైతులు బలవన్మరణాలకు పాల్పడని ప్రాంతం లేదు. చివరికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైస్‌బౌల్‌ అని గొప్పగా చెప్పుకునే కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో కూడా రైతుల చావుమేళాలు వినిపిస్తున్నాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లా ఆత్మహత్యల పురంగా మారిపోయింది. నిన్న మొన్నటిదాకా ఒక్క అనంతపురం జిల్లాకే పరిమితమైన ఆత్మహత్యల పరంపర ఇప్పుడు మిగిలిన అన్ని జిల్లాలకూ పాకింది. రోడ్లెంట వెళ్తుంటే ఎండి పొలాలు.. నెర్ర‌లు బారిన నేల రైతన్నను రారామ్మని వెక్కిరిస్తూ పిలుస్తుంది. మోడుబారిన వృక్షాలు ఉరికొయ్యలుగా ఆశ్రయమిస్తామని వెటకారం ఆడుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్న దిక్కుతోచని స్థితిలో వేరే దారిలేక నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. కష్టాల్లో వెన్నంటి ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతువా కాదా విచారణ చేసి తేలుస్తామని అపహాస్యం చేస్తోంది. వీలైనంత ఎక్కువ మందికి పరిహారం ఎగ్గొట్టడానికి నిబంధనల పేరుతో పరిహాసం చేస్తుంది. 

==============
నాలుగు రోజులు రెయిన్‌ గన్‌లతో హడావుడి చేసిన చంద్రబాబు కరువును పారదోలానని జ‌బ్బలు చరుచుకున్నాడు. నిజానికి మాత్రం ఆయన స్వహస్తాలతో నీరు చల్లిన పార్టీ నాయకుడి పొలమే ఎండిపోయింది. రైతుల ఆత్మహత్యల నివారణలో విఫలమైన చంద్రబాబు సర్కారు బాధిత కుటుంబాలకు ఇస్తానన్న పరిహారం కూడా చెల్లించకుండా కర్కశానికి పాల్పడుతోంది. అన్నదాతల బలవన్మరణాల పరంపర చంద్రబాబు పాషాణ హృదయాన్ని కదిలించలేకపోతోంది. మృతుల కుటుంబాలకు సహాయం చేసే విషయంలో విచారణలు, నిబంధనలు, కొర్రిలు, నిధుల కొరత వంటి సమస్యలను ప్రభుత్వమే సృష్టించడం ఆందోళన కలిగించే అంశం. ఏపీలో గడచిన మూడేళ్లలో 1,290 మంది రైతుల ఆత్మహత్యలు నమెదుకాగా ఇప్పటి వరకు 169 కేసుల్లోనే పరిహారం అందడం చూస్తుంటే చంద్రబాబు వంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం అనిపిస్తుంది. అందులోనూ 103 కుటుంబాలకు రూ.లక్షన్నర చొప్పున, 66 కేసుల్లో రూ.ఐదు లక్షల వంతున చెల్లించారు. అంటే ఇంకా 1121 మంది కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదు.  కుటుంబ పెద్దను కోల్పోయి అనా«థలైన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో తీరని జాప్యం రాజ్యమేలుతోంది. చనిపోయింది రైతా కాదా అని ధ్రువీకరించేందుకు నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు పడుతోంది. నివేదికలొచ్చాక నిధులు మంజూరు చేయడానికి మరికొన్ని మాసాలు గడుస్తోంది. జిల్లా కలెక్టర్లు తమ వద్ద నిధులుంటే కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి అనంతరం రీయింబర్స్‌మెంట్‌ కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. లేకపోతే నిధులొచ్చే వరకు ఎదురు చూస్తున్నారు. పరిహారం కోసం రైతు కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

ఆత్మహత్యలకు ఆజ్యం పోస్తున్న భూ దోపిడీ
దేశవ్యాప్తంగా వర్షాభావం, పంటల దిగుబడి వంటి అంశాల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఏపీలో వాటికి తోడు రాజధాని, బందరు పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టుల భూసేకరణ ప్రభావం కూడా తోడై రైతుకు బతుకు మీద భరోసా లేకుండా పోయింది. ఇపుడు పరిస్థితి ఎలా ఉందంటే భోగాపురం భూసేకరణ ప్రాంతాల్లోని యువకులకు గతంలో కుదిరిన నిశ్చితార్థాలను కూడా ఆడపిల్ల వారు రద్దు చేసుకుంటున్నారు. చంద్రబాబు ఎక్కే విమానం దిగే విమానంగా ఆకాశయానంలో మునిగి తేలుతుంటే మంత్రులు సొంత పనుల్లో తలమునకలై రైతులను పట్టించుకోవడం లేదు. ఈ సీజన్‌లో వరి, పత్తి, మిర్చి, పొగాకు ఇలా ఏ పంట వేసినా రైతుకు నిరాశే మిగిలింది. మంచి లాభాలు తెచ్చే పంటగా ప్రసిద్ధి పొందిన పొగాకు కూడా రైతుకు పొగబెట్టడంతో పశ్చిమగోదావరి జిల్లాలో కూడా రైతులు పురుగుల మందులు తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గిట్టుబాటు ధర లభించక ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పొగాకు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే పత్తి, మిర్చి సాగుచేసిన గుంటూరు జిల్లా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో వరి, పొగాకు రైతులు సంక్షోభంలో ఉన్నారు. రాజధాని, బందర్‌ పోర్టు భూసేకరణతో ఆ ప్రాంత రైతు కుటుంబాల్లో కంటికి నిద్ర కరువైంది. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఎక్కడా అమలు కావడం లేదు. బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడం లేదు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ఖర్చులు బాగా పెరిగాయి. వర్షాభావం, కరువు, అప్పులు, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి అనేక సమస్యలు రైతును చుట్టుముట్టాయి. పిల్లల చదువులు, వైద్యఅవసరాలు తదితరాలకు అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులు పెరిగి రైతులు ఆర్థిక సుడిగుండాల్లో చిక్కుకుపోయాడు. పొగాకు గిట్టుబాటు ధర అంశమే తీసుకున్నా కేంద్రమంత్రి వచ్చారు.. వెళ్లారు. రైతుకు ఒరిగింది మాత్రం లేదు.

పరిహారం పేరుతో పరిహాసం 
ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం అందించేందుకు విధిస్తున్న నిబంధనలతో పరిహారం అందుకోలేని పరిస్థితి ఉంది. ఆత్మహత్యలకు ముందు పొరబాటుగా రైతు ఎవరితోనైనా ఘర్షణ పడ్డట్టుగా ఏ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదై ఉన్నా సాధారణ వ్యక్తి ఆత్మహత్యగా పరిగణించి పరిహారం ఆపేస్తున్నారు. అలాగే పంట రుణాలను పంట పెట్టుబడులుగా కాకుండా పిల్లల చదువులు, పెళ్లిళ్ల్లకు వాడినట్టు తెలిసినా రైతు ఆత్మహత్య కింద నమోదు చేయడం లేదు. ఆఖరుకు ఆత్మహత్య సమయంలో రైతు తాగి ఉన్నా పరిహారం నిరాకరిస్తున్నారు. గతంలో పోలీస్‌స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా స్థానిక రెవెన్యూ అధికారులు నివేదిక ఇస్తే పరిహారం అందేది. నూతన ప్రభుత్వంలో రెండునెలల క్రితం వరకు రైతుల ఆత్మహత్యలపై డీఎస్పీ, ఆర్డీవో, వ్యవసాయశాఖ జేడీలతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణ నివేదికే ఫైనల్‌గా ఉండేది. ఇపుడు ఈ త్రిసభ్య కమిటీ నివేదికలను కూడా ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తున్నది. నిఘా వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నది. రైతు విపక్ష పార్టీల సానుభూతిపరుడని తమ్ముళ్లు నివేదించినా పరిహారం ఆపేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 129మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. 65 మందికి మాత్రమే రెండు విడతల్లో పరిహారం అందించారు. అవికూడా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, విపక్ష నేత వైఎస్‌ జగన్‌ పర్యటన సందర్భంగా హడావుడిగా రాత్రికిరాత్రి ఇచ్చినవే అధికం.

ఐదు లక్షల పరిహారం కొందరికే..
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్‌ ఫండ్‌) నుంచి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.లక్షన్నర చెల్లించేందుకు 2004 జూన్‌ 1న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవో 421 జారీ చేసింది. లక్ష ఎక్స్‌గ్రేషియాకు, యాభైవేలు చనిపోయిన రైతు చేసిన అప్పులన్నింటినీ ఏకమొత్తంలో ఒకేసారి చెల్లించడానికి కేటాయించింది. బాధిత కుటుంబాలకు అర్హతలు చూసి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంది. రాష్ట్ర విభజనానంతరం 2014 జూన్‌ 8న నవ్యాంధ్రలో టీడీపీ అధికారంలోకొచ్చాక రైతుల ఆత్మహత్యలు కొనసాగాయి. తొలుత జీవో 421 అమలును పక్కనపడేయడంతో రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. దిగొచ్చిన సర్కారు స్పెషల్‌ ప్యాకేజీని రూ.ఐదు లక్షలకు పెంచుతూ 2015 ఫిబ్రవరి 19న జీవో 62 జారీ చేసింది. మూడున్నర లక్షలు ఎక్స్‌గ్రేషియా, లక్షన్నర రుణాల వన్‌టైం సెటిల్‌మెంట్‌కు కేటాయించింది. పాత జీవోలో ఉన్న తతిమ్మా అంశాలన్నీ అమలవుతాయంది. అమల్లో ఒక మెలిక పెట్టింది. రాష్ట్ర విభజనకు ముందు సంభవించిన మరణాలకు లక్షన్నరేనని, టీడీపీ అధికారంలోకొచ్చాక నమోదైన ఆత్మహత్యలకు మాత్రమే ఐదు లక్షలంది. 

త్రీమెన్‌ కమిటీ అస్తవ్యస్తం
నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం రైతుల ఆత్మహత్యలు 2014లో 160, 2015లో 516. ఇంకా 2016 లెక్కలను వెల్లడించనప్పటికీ 614 నమోదైనట్లు తెలుస్తోంది. మూడేళ్లవీ కలుపుకుంటే మొత్తం బలవన్మరణాలు 1,290 కాగా ఇప్పటి వరకు సర్కారు 169 కుటుంబాలకే పరిహారం అందించినట్లు íసీఎంఆర్‌ఎఫ్, రెవెన్యూ, వ్యవసాయశాఖలు చెబుతున్నాయి. 103 కేసులకు లక్షన్నర, 66 కుటుంబాలకు ఐదు లక్షలు చెల్లించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పోలీస్‌ రికార్డులు, ప్రభుత్వ దృష్టికొచ్చిన ఆత్మహత్యలపై విచారణ అంతూపొంతూ లేకుండా సాగుతోంది. నిర్ధారణకు ముగ్గురితో కమిటీ ఉంది. ఆర్‌డీఓ లేక సబ్‌కలెక్టర్‌ కమిటీకి ఛైర్‌పర్సన్‌ కాగా వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు (ఏడీ), పోలీస్‌ డిపార్టుమెంట్‌ నుంచి డీఎస్పీ సభ్యులు. చాలా కేసుల్లో కమిటీ విచారణలు జరగట్లేదు. కొన్ని కేసుల్లో తీవ్ర జాప్యమవుతోంది. 

కనబడుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యం
– కౌలు రైతులను వ్యవసాయ కార్మికుల జాబితాలో వేసి పరిహారం ఎగ్గొడుతున్నారు. 
– మహిళా రైతులను బాధితులుగా నమోదు చేయట్లేదు. 
– బాధిత కుటుంబాలకు పరిహారంతోపాటు ఆర్థిక తోడ్పాటు కోసం ప్రభుత్వ స్కీంలను వర్తింపజేయాల్సి ఉండగా ఎక్స్‌గ్రేషియాతో సరిపెడుతున్నారు.
– రైతు కుటుంబాల్లో చదువుకుంటున్న పిల్లలుంటే సోషల్‌వెల్ఫేర్‌ స్కూళ్లలో, హాస్టల్స్‌లో చేర్పించాలి. ఇల్లు లేకపోతే ఐఏవై ఇల్లు (పూర్తి సబ్సిడీ) ఇవ్వాలి. 
– జీవనోపాధి సాగించేందుకు స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేయాలి. పింఛన్లు ఇవ్వాలి. 
– రుణాల వన్‌టైం సెటిల్‌మెంట్‌కు కేటాయించిన ప్యాకేజీని బ్యాంకుల్లో జమ చేస్తున్నారు తప్ప అప్పులోళ్లతో మాట్లాడి సెటిల్‌ చేయట్లేదు. దీంతో పరిహారం పొందిన రైతు కుటుంబాలు పాత రుణ బకాయిలను వడ్డీలు, చక్రవడ్డీలతో చెల్లించాల్సి వస్తోంది. 

అమ్మేసిన పొలం అడ్డుపడ్డది..
అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం గొల్లపల్లికి చెందిన రైతు తలారి శ్రీనివాసులుకు 1.20 ఎకరాలు ఉండేది. బోరు ఎండిపోగా లక్ష అప్పుచేసి రెండు బోర్లు వేయించాడు. చుక్క నీరు పడలేదు. అప్పటికే వ్యవసాయం కోసం రూ.1.50 లక్షలు, కూతురు పెండ్లికోసం మరో లక్ష అప్పు చేశాడు. కొత్త బోర్లలో చుక్క నీరు రావడంలేదని తెలియడంతో అప్పులు ఇచ్చినవారు ఇంటిముందు వాలిపోయారు. వారి ఒత్తిడి భరించలేక పొలం, ఇల్లు అమ్మేశాడు. అయినా లక్ష అప్పు మిగిలింది. దిక్కుతోచక అమ్మేసిన పొలానికి వెళ్లి అక్కడే చెట్టుకు ఉరివేసుకున్నాడు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునే సమయానికి ఆయనకు పొలం లేదు కాబట్టి బాబు సర్కారు నుంచి ఆ కుటుంబానికి పైసా పరిహారం అందలేదు.

మద్యం సేవించడం శాపమైంది...
ఇక అనంతపురం జిల్లా పామిడి మండలంలోని అన్నంపల్లి గ్రామానికి చెందిన రైతు ఓబన్న (30)సొంత పొలం రెండు ఎకరాలకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సేద్యం చేసేవాడు. వరుస కరువులతో పంటలు పండక.. పెట్టుబడి కోసం, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు, వాటి వడ్డీలు తడిసి మోపెడయ్యాయి. దీనికితోడు ఇద్దరు కూతుళ్లు. భవిష్యత్తు, పూటగడవని స్థితి, అప్పులవాళ్ల వేధింపులు మనోవ్యధను కలిగించాయి. ఆత్మహత్య చేసుకునేందుకు ధైర్యం చాలలేదు. దీంతో మద్యం సేవించి ఉరి వేసుకున్నాడు. పోస్టుమార్టం రిపోర్టులో మద్యం సేవించినట్లు తేలడంతో బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం నిరాకరించింది.
Back to Top