బాబు అవినీతి జర్నీ

– అమరావతిలో నుంచి సింగపూర్‌ దాకా బాబు అవినీతి 
– ఐటీ దాడుల్లో దొరికిపోతున్న టీడీపీ నాయకులు
– నోట్ల రద్దునూ ఆదాయ వనరుగా మార్చుకున్న ఘనుడు

హిరణ్య కశపుడు తన కుమారుడు ప్రహ్లాదుడుతో నీ దేవుడు ఎక్కడుంటాడో చూపించమంటే ఇందుగలడందుగలడు ఎందెందు వెతికినా అందందే కలడు.. అని విష్ణుమూర్తిని నరసింహ అవతారంలో ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు. సీఎం చంద్రబాబు, టీడీపీ నేత అవినీతి కూడా అచ్చం అలాగే ఉంది. ఆయన చేసిన అవినీతి  ఖండాంతరాలకు పాకిపోయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు కూడా చంద్రబాబు, ఆయన అనుచరుల అవినీతి మూలాలు విస్తరించి పోయి మ్రరిమాను కన్నా బలంగా పాతుకుపోయాయి. ఈ జడలు కట్టుకుపోయిన అవినీతికి తోడు అధికారం కూడా అండగా ఉండటంతో చట్టాలు చంద్రబాబు ఇంటి గుమ్మానికి కాపలాగా ఉపయోగపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. కలుగులో దాక్కున్న కప్పల్లా ఒక్కొక్కరిగా బయటకొస్తుండటంతో టీడీపీ నాయకుల అవినీతి బాగోతం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. 

మోసం చేయడంపైనా ట్రైనింగ్‌
తెలుగుదేశం పార్టీ ఎంత క్రమశిక్షణ గల పార్టీ అంటే అవినీతిలోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ బాబే ఆదర్శం. ఎప్పుడూ విజన్‌తో ముందుకెళ్లాలని... సంక్షోభంలో కూడా అవకాశాలు వెతుక్కోవాలని చెప్పే బాబు మాటలు వారికి శ్రీకృష్ణుడి  జ్ఞాన బోధలాంటిది. అప్పుడప్పుడూ ఇలాంటి విషయాలపై టీడీపీ శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంటుంది. ఇటీవల గుంటూరులో కూడా ఇలాంటి శిక్షణ కార్యక్రమాలే నిర్వహించి నాయకులను చైతన్యం చేసి జన చైతన్య యాత్రల పేరుతో ఊరుమీదకి వదిలారు.  జనాలను ఎలా మోసం చేయాలి.. చెయ్యని పనులు చేశామని ఎలా ప్రచారం చేసుకోవాలి.. పనిని మొదలు పెట్టిన నాలుగు రోజుల్లో అయిపోయిందని ఎలా నమ్మించాలి.. ఇలాంటి ప్రచారం చేసుకోవడంలో బాబు ఎంత చెయ్యి తిరిగిన వాడో కొత్తగా చెప్పేదేమీ ఉండదు. నిన్నటికి నిన్న పోలవరంకు నిధులు కేటాయిస్తూ ఇచ్చిన చెక్కు విషయంలో చంద్రబాబు అండ్‌ కో చేసిన ఓవరాక్షన్‌ అంతా ఇంతా కాదు. కేకు కటింగ్‌లు.. కౌగిలింతలు చూస్తే పోలవరం పూర్తయినంత హంగామా చేశారు. అలాగని పూర్తిగా నిధులు వచ్చాయా అంటే అదీ కాదు. 40వేల కోట్లు నిధులు అవసరం అని అంచానా రూపొందిస్తే కేంద్రం ఇచ్చింది 2వేల కోట్లు కూడా లేవు. అది కూడా గతంలో ఖర్చుచేసిన దానికి రీయింబర్స్‌మెంట్‌ చేసినవే. మరెందుకు అంత పబ్లిసిటీ చేస్తున్నట్టు.. ఏం సాధించారని అని ఆలోచిస్తే ఏమీ ఉండదు. ఈ తతంగమంతా చూస్తుంటే ఎప్పుడు జరుగుతుందో.. అసలు జరుగుతుందో లేదో తెలియని పెళ్లికి పేరంటాలను పిలిచినట్టుంది. 

బయటకొస్తున్న అవినీతి కప్పలు
చెరువును ఎండబెడితే కప్పలు బయట పడినట్టు నోట్ల రద్దు నిర్ణయంతో చంద్రబాబు అండ్‌ కో అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా తమిళనాడులో సీఎస్‌గా పనిచేస్తున్న రామ్మోహన్‌రావు ఇంటిపై నిర్వహించిన ఐటీ సోదాల్లో నల్లధనం భారీగా వెలుగు చూసింది. ఈయన టీడీపీ మాజీ నాయకుడు ఆదికేశవుల నాయుడికి స్వయానా సోదరుడైన బద్రీనాథ్‌కు వియ్యంకుడు. పైగా రామ్మోహన్‌రావు తల్లి ప్రకాశం జిల్లాలోని బిట్రగుంట మండలం బిట్రగుంట గ్రామం సర్పంచ్‌గా కూడా పనిచేశారు. ఇదొక్కటి చాలు ఈయన కుటుంబానికి టీడీపీతో ఎలాంటి సంబంధాలున్నాయో చెప్పడానికి. అంతకుముందు టీటీడీ బోర్డు మెంబర్‌ శేఖర్‌రెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో భారీ ఎత్తున కొత్త కరెన్సీ, కేజీల కొద్దీ బంగారం బయటపడిన విషయం తెలిసిందే. శేఖర్‌రెడ్డిని చంద్రబాబే ఏరి కోరి టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమించుకున్నాడు. ఇంకా ముందుకెళ్లి అప్పటి  పరిస్థితులు చూస్తే బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిపై నిర్వహించిన ఐటీ సోదాల్లో భారీ ఎత్తున నగదు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఆస్పత్రిని టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కుమార్తె నిర్వహిస్తున్నారు. మరో వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి... ఈయన టీడీపీ సీనియర్‌ నాయకుడు, నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. పేదవాడిగా, నిజాయతీ పరుడిగా ప్రజల ముందు బిల్డప్‌ ఇచ్చే సోమిరెడ్డికి హాంకాంగ్, మలేసియా, సింగపూర్‌ తదితర దేశాల్లో ఆయన కూడబెట్టిన అక్రమాస్తులు వెలుగు చూశాయి. దాదాపు వెయ్యి కోట్ల వరకు దాచిన ఆస్తులకు సంబంధించిన సోమిరెడ్డి అవినీతి బాగోతాన్ని  వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌ రెడ్డి బట్టబయలు చేశారు. అయితే సోమిరెడ్డి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టడం వెనుక బాబు ప్రోత్సాహం ఉందని,  ఆ ఆస్తులన్నీ చంద్రబాబువేనని ఆయనకు సోమిరెడ్డి బినామీ అని రాష్ట్రం మొత్తం కోడై కూస్తోంది.  ఇంకొంచెం ముందుకెళితే గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిపై ఐటీ సోదాలు నిర్వహించగా భారీగా నగదు వెలుగు చూసిన విషయం అప్పట్లో సంచలనం రేపింది. 

నోట్ల రద్దునూ వాడేసుకున్న బాబు
సంక్షోభాన్ని కూడా అవకాశంగా వాడుకోవడం బాబుకు తెలిసినట్టు మరెవరికీ తెలియదు. మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయంతో దేశమంతా డబ్బుల్లేక అతలాకుతలం అవుతుంటే చంద్రబాబులో మాత్రం బాధ కొంచెం కూడా కనిపించలేదు. పైగా నాకేమీ ఇబ్బంది లేదు.. అన్నీ ప్రభుత్వం చూసుకుంటుందని సిగ్గు లేకుండా చెప్పుకు తిరుగుతున్నాడు. నోట్ల రద్దును ప్రకటించడానికి సరిగ్గా రెండు రోజుల ముందు హెరిటేజ్‌ను కంపెనీని ఫ్యూచర్‌ గ్రూపుకు అమ్ముకుని లాభపడిన ఘనుడు చంద్రబాబు. క్యూలైన్లలో నిల్చోలేక జనం అల్లాడిపోతుంటే సమస్యకు పరిష్కారం ఎలా చూపాలో పక్కనపెట్టి మజ్జిగ పంపిణీ చేస్తానని చెప్పుకొచ్చాడు. హెరిటేజ్‌ కంపెనీకి ఆర్డర్లు ఇచ్చి నాలుగు రాళ్లు వెనకేసుకోవడం.. నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చుకోవడం. గత వేసవికాలంలో కూడా ఇలాగే మజ్జిగ పంపిణీ పథకం పెట్టి నియోజకవర్గానికి రూ. 3 కోట్లు వంతున 39 కోట్లుకు జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏదేమైనా అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు అండ్‌ కో సంపాదించిన అవినీతి ఆస్తులు బయటకొస్తున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణంలో జరగుతున్న తంతు గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. అధికారికంగా జీవోలు జారీ చేసి స్విస్‌ చాలెంజ్‌ పేరుతో చేస్తున్న దోపిడీపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, న్యాయస్థానాలు గగ్గోలు పెట్టిన సంగతి మరువలేం. మొత్తం మీద బాబు అండ్‌ కో అవినీతి గుంటూరు జిల్లా అమరావతి నుంచి చెన్నై, బెంగళూర్‌ మీదుగా సింగపూర్‌ వరకు పాకింది. మున్ముందు ఇంకెన్ని అవినీతి బాగోతాలు వెలుగుచూడాలో మరి. 
Back to Top