అపురూప అతిథికి ఆత్మీయ స్వాగతం

గుంటూరు : నగరం జనసంద్రమే అయింది. ఏ వైపు చూసినా జనమే జనం. ఏ మూలకు వెళ్ళినా కిటకిటలాడిన ప్రజలు. తమ అభిమాన నాయకుడు, దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ తమ వద్దకే వచ్చిందన్న ఆనందంతో గుంటూరు నగర ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. వందలాది కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్న తమ ఆడ బిడ్డకు అపూర్వ స్వాగతం పలికారు. తొలిసారిగా గుంటూరు నగరంలోకి అడుగుపెట్టిన శ్రీమతి షర్మిలను మక్కువతో అక్కున చేర్చుకున్నారు. గల్లీ గల్లీ నుంచి పిల్లా పాపతో ఆమెకు ఎదురేగి అభిమానంతో అఖండ స్వాగతం పలికారు. ఆమె కోసం రోజంతా వేచి ఉన్నారు. ఆమె నడిచే దారిలో పూలు చల్లారు. శ్రీమతి షర్మిలను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు.

అపురూప అతిథి శ్రీమతి షర్మిల రాకతో గుంటూరులో పండగ వాతావరణం నెలకొంది. నగర ప్రధాన రహదారులన్నీ ఆమెకు స్వాగతం పలికేందుకు... ఆమె యాత్రకు మద్దతు తెలిపేందుకు జనంతో కిటకిటలాడాయి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు, ప్రజల నినాదాలతో గుంటూరు నగరం మార్మోగింది. ఇసుకేసినా రాలనంతగా....ఊళ్లకు ఊళ్లు తరలివచ్చినట్టుగా... మేడలు...మిద్దెలు వెన్నువిరిగేలా ప్రజలు తరలిరావడంతో నగరంలోని అన్ని ప్రధాన రహదారులు జనప్రవాహాన్ని తలపించాయి.

శ్రీమతి షర్మిల వెంట జనప్రవాహం :
శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికేందుకు... ఆశీర్వదించేందుకు... మహానేత వైయస్‌ను ఆమెలో చూసుకునేందుకు, సమస్యలు వివరించేందుకు ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు సాగిన మరో ప్రజాప్రస్ధానంలో శ్రీమతి షర్మిల వెంట జనప్రవాహం వడివడిగా సాగింది. జిల్లాలోని వికలాంగులు మూడు చక్రాల సైకిళ్లపై అధిక సంఖ్యలో తరలివచ్చి ఆమెకు సంఘీభావం పలికారు. దారి పొడవునా మహిళలు పెద్ద సంఖ్యలో ఎదురొచ్చి నుదుట కుంకుమ దిద్ది హారతులు అందించారు. బాధలతో సతమతమవుతున్న మహిళలు, వృద్ధుల సమస్యలను తెలుసుకుంటూ శ్రీమతి షర్మిల ముందుకు సాగారు.

గుంటూరులోని హౌసింగ్ బోర్డు సమీపంలో ఏర్పాటు‌ చేసిన బస నుంచి శ్రీమతి షర్మిల శుక్రవారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం చుట్టుగుంట వద్దకు అధిక సంఖ్యలో చేరిన ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటప్పయ్య కాలనీకి చేరుకున్నారు. మధ్యలో మిర్చియార్డులో పనిచేస్తున్న మహిళా కూలీలను పరామర్శిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. ‌అనంతరం మున్సిపల్ స్కూ‌ల్ విద్యార్ధులు ఎదురేగి ఆమెకు అభివాదం తె‌లిపారు. బాగా చదువుకోవాలంటూ వారికి శ్రీమతి షర్మిల సూచించారు. శ్రీనివాసరావుపేటలో ఏర్పాటు చేసిన దివంగత వైయస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అచ్చయ్యడాబా సెంటరు, రామనామ క్షేత్రం, సంపత్‌నగర్‌ల మీదుగా వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన రాత్రి బసకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు. సాయంత్రం నల్లచెరువు ప్రధాన రహదారి మీదుగా పాదయాత్ర సాగింది.

జనహర్షం... పూలవర్షం :
కిలోమీటరు మేర ప్రజలు బారులు తీరి శ్రీమతి షర్మిలపై పూలవర్షం కురిపించారు. పదిహేడవ డివిజన్‌లో ఏర్పాటు చేసిన‌ మహానేత వైయస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఏటుకూరు రోడ్డు మీదుగా చాకలికుంట దాటిన తరువాత కన్యాకా పరమేశ్వరి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి పట్నంబజారు, మార్కెట్‌సెంటరు, జిన్నాటవర్ మీదుగా వెళుతూ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్సు కార్యాలయం వద్ద ఎ.పి. వస్త్ర వ్యాపారుల సమాఖ్య ప్రతినిధులు అందించిన వినతిపత్రం తీసుకున్నారు. మాయాబజారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రసంగం తరువాత బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి పొన్నూరురోడ్డు మీదుగా సంగడిగుంట లాంచెస్టర్ ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన వై‌యస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

శ్రీమతి షర్మిల ప్రసంగానికి విశేష స్పందన :
శ్రీమతి షర్మిల గుంటూరు నగరంలోని సమస్యలను తన ప్రసంగంలో ప్రస్తావించడంతో ప్రజల నుంచి హర్షం వ్యక్తం అయింది. గుంటూరు నగరానికి రానున్న 30 సంవత్సరాల్లో తాగునీటి సమస్య లేకుండా‌ మహానేత వైయస్ తీసుకున్న చర్యలను ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేస్తున్నదో ఆమె వివరించారు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై శ్రీమతి షర్మిల విమర్శనాస్త్రాలు సంధించినపుడు... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నపుడు జనం నుంచి విశేష స్పందన లభించింది. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన మేలును గుర్తు చేసినపుడు గుంటూరు నగరం గుండె నిండుగా కృతజ్ఞతలు తెలిపింది.
Back to Top