వెంటిలేట‌ర్‌పై వ్య‌వ‌సాయం

  • కరువులో చంద్రబాబు రికార్డు బ్రేక్‌
  • రాష్ట్రాన్ని దుర్భిక్షాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చిన టీడీపీ స‌ర్కార్‌
  • వ‌ల‌స‌ల్లో బీహార్‌ను మించిన ఏపీ
  • పెద్ద నోట్ల ర‌ద్దుతో వ్య‌వ‌సాయ రంగం కుదేలు
  • ఏపీలో వ్య‌వ‌సాయ రంగంపై వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్య‌క్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ప్ర‌త్యేక క‌థ‌నం
 హైదరాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగం వెంటిలేట‌ర్‌పై ఉంద‌ని, రైతుల పరిస్ధితి మరింత దయనీయంగా మారిందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్ర‌బాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దుర్భిక్షాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. బాధ్యత కల్గిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఆత్మవంచన చేసుకుంటూ రాష్ట్రం వెలిగిపోతున్నట్టు మాట్లాడటం ప్రజల ఆత్మాభిమానంపై దెబ్బకొట్టడమే అన్నారు. గతంలో ఎన్నడూలేని కరువును రాష్ట్రం ఎదుర్కొంటుందని, లక్షలాది ఎకరాల్లో భూములు బీడులుగా మారాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయ రంగంపై తీవ్ర ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయ‌ని, ఈ విష‌యంపై మేథావులు ఒక‌సారి ఆలోచించాల‌ని నాగిరెడ్డి కోరారు. వ్య‌వ‌సాయ రంగ ప‌రిస్థితుల‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్య‌క్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ప్ర‌త్యేక క‌థ‌నం..

ఇదే చంద్ర‌బాబు క‌రువు రికార్డు
చంద్రబాబు అనేకసార్లు తన రికార్డులు తనే బ్రేక్‌ చేస్తున్నట్టు ప్రకటించుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరువు మూలంగా 2003లో ఆహార ధాన్యాల ఉత్పత్తి కనిష్ట స్థాయిలో 107 లక్షల టన్నులు.. ఇదే ఆయన కరువు రికార్డ్‌ అన్నారు. ప్రస్తుతం 2016-17 రాష్ట్రంలో ఇంతకుముందున్నెడూ లేనటువంటి కరువుతో ఆయన రికార్డును ఆయనే బ్రేకు చేసుకున్నారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యే నాటికి ఏపీలోని 13 జిల్లాల్లో అన్ని పంట‌లు క‌లిపి ఖ‌రీఫ్‌లో 43.86 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో సాగు అయ్యేవి. బాబు సీఎం అయ్యాక మొద‌టి సంవ‌త్స‌రం 40.96 ల‌క్ష‌ల హెక్టార్లు, రెండో సంవ‌త్స‌రం 36.34 ల‌క్ష‌ల హెక్టార్లు, మూడో ఏటా 38.62 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో సాగు చేశారు. అంటే సాగు విస్తీర్ణం గ‌ణ‌నీయంగా త‌గ్గింది. బాబు సీఎం కాక‌ముందు ర‌బీలో 27.26 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో పంటలు పండించేవారు. బాబొచ్చాక సాగు విస్తీర్ణం మొద‌టి ఏడాది 23.19 ల‌క్ష‌ల హెక్టార్లు, రెండో ఏటా 22.76 ల‌క్ష‌ల హెక్టార్లు, ఈ ఏడాది 19.47 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో సాగు చేస్తున్నారు. ఈ లెక్క‌ల‌ను ప‌రిశీలిస్తే ఖ‌రీఫ్‌, ర‌బీ రెండు సీజ‌న్ల‌లో కూడా సాగు విస్తీర్ణం త‌గ్గింది.

పొట్ట చేత‌ప‌ట్టుకొని..
రాష్ట్ర విభ‌జ‌న‌లో పారిశ్రామిక‌, సేవారంగం, ప‌రిశోధ‌న సంస్థ‌లు చాలా వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్లిపోవ‌డంతో ఏపీ దేశంలోనే వ్య‌వ‌సాయ ఆధారిత రాష్ట్రంగా మిలిగిపోయింది.బాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో 664 మండ‌లాల‌కు 2014-2015లో  238 మండ‌లాలు, 2015-2016లో 359 మండ‌లాలు, 2016-2017లో 301 మండ‌లాల‌ను క‌రువు ప్రాంతాలుగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. సీఎం చంద్రబాబు నాయుడు కరువును జయించామన్నారు.. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తానంటున్నారు.. కానీ రాష్ట్ర ప్రజలు వేల గ్రామాల్లో త్రాగడానికి కూడా నీరు లేక, చేయటానికి పని దొరకక, పశువులకు పశుగ్రాసం లేక, పొట్ట చేత పట్టుకొని దినసరి కార్మికులుగా పక్క రాష్ట్రాలకు వలస పోవడంతో ఏపీ నేడు బిహార్‌ను మించిపోయింది. దేశ జీడీపీలో వ్య‌వ‌సాయ రంగం వాటా14 శాతం అయితే, ఉమ్మ‌డి ఏపీ జీడీపీలో ఈ వాటా 22 శాతం. ప్ర‌స్తుతం ఏపీ జీడీపీలో వ్య‌వ‌సాయ రంగం వాటా 27 శాత‌మ‌ని ప్ర‌భుత్వ‌మే ప్ర‌క‌టించింది. గ‌త మూడేళ్ల‌లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయింది. సాగు చేసిన ప్రాంతాల్లో కూడా వ‌ర్షాభావం మూలంగా ల‌క్ష‌ల హెక్టార్ల‌లో పంట‌లు ఎండిపోయాయి. కొన్ని చోట్ల దిగుబ‌డులు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయి.తాగునీటి సంక్షోభం, ప‌శుగ్రాసం కొర‌త కార‌ణంగా ప‌శువుల‌ను క‌బేళాల‌కు అమ్ముకొని రాష్ట్రం నుంచి ల‌క్ష‌లాది రైతు కుటుంబాలు, కౌలు రైతు కుటుంబాలు, వ్య‌వ‌సాయ కార్మిక కుటుంబాలు పొట్ట చేత ప‌ట్టుకొని దిన‌స‌రి కార్మికులుగా చివ‌ర‌కు ప‌ట్ట‌ణాల్లో ఇంటిప‌ని మ‌నుషులుగా, వాచ్‌మెన్లుగా ప‌క్క రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్తున్నారు. రాష్ట్రంలో ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతుంటే సీఎం చంద్ర‌బాబు ఆత్మ‌వంచ‌న చేసుకుంటూ రాష్ట్రం వెలిగిపోతున్న‌ట్లు మాట్లాడ‌టం రాష్ట్ర ప్ర‌జ‌ల ఆత్మాభిమానం మీద దెబ్బ‌కొట్ట‌డ‌మే.

క‌రెన్సీ క‌ష్టాలు
కేంద్ర ప్ర‌భుత్వం గ‌తేడాది న‌వంబ‌ర్‌లో పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డంతో వ్య‌వ‌సాయ రంగం కుదేలైంది. వ్యవసాయరంగంలో అత్యధికంగా లావాదేవీలు జరిగే నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో నోట్ల రద్దు నిర్ణయం వల్ల రైతుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖరీఫ్‌ పంట అమ్ముకునే సమయం, రబీ పూర్తి స్థాయిలో మొదలయ్యే సమయంలో చేతిలో చిల్లి గవ్వ లేక రైతులు నానా అవస్థలు పడ్డారు. అత్య‌ధికంగా కూలీల‌కు నోట్ల రూపేణా మాత్ర‌మే చెల్లించాల్సి ఉంటుంది. ర‌బీ పెట్టుబ‌డుల‌ కోసం అనేక మంది రైతులు బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో డ‌బ్బులు దాచుకున్నారు.  అనూహ్యంగా న‌వంబ‌ర్ 9 నుంచి ప్ర‌భుత్వం పెద్ద నోట్లు ర‌ద్దు చేసింది. దీంతో సేవింగ్ ఖాతాల నుంచి డ‌బ్బుల విత్‌డ్రాయిల్‌కు నిబంధ‌న‌లు విధించ‌డంతో పెట్టుబ‌డుల‌కు డ‌బ్బులు లేక రైతులు ఇబ్బందులు ప‌డ్డారు.దీంతో పెట్టుబ‌డుల కోసం ప్రైవేట్ వ‌డ్డీ వ్యాపారుల వ‌ద్ద రూ.3 నుంచి రూ.4 వ‌డ్డీకి రైతులు అప్పులు చేశారు. అలాగే బ్యాంకుల నుంచి  రూ.2 వేల నోటును ఇవ్వ‌డంతో చిల్ల‌ర దొర‌క్క అవ‌స్థ‌లు ప‌డ్డారు.దీనికి తోడు బ్యాంకుల నుంచి ర‌బీ రుణాలు, బంగారంపై రుణాలు మంజూరు చేయ‌లేదు. వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల అమ్మ‌కంలో మార్కెట్‌లో క్యాష్ లేక వ్యాపారులు కొనుగోలు చేయ‌క వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ధ‌ర‌లు ప‌డిపోయాయి.

ఎన్నిక‌ల హామీల‌కు తూట్లు
2014వ సంవ‌త్స‌రంలో నిర్వ‌హించిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో రైతుల‌కు చంద్ర‌బాబు అనేక హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గ‌డుస్తున్నా ఏ ఒక్క హామీ సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేదు. నిబంధ‌న‌ల మెలిక‌తో రైతు రుణాల మాఫీకి టోపీ పెట్టారు. అలాగే ధ‌ర‌ల స్థీరీక‌ర‌ణ నిధి, ఇత‌ర హామీల‌కు చంద్ర‌బాబు తూట్లు పొడిచారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగం దేశంలోనే తీవ్ర సంక్షోభంలో ఉంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్య‌వ‌సాయ వృద్ధి రేటు 14 శాతం సాధించామ‌ని చెబుతున్నారు. ప్ర‌కృతి వైప‌రీత్యాల వ‌ల్ల పంట న‌ష్ట‌పోయిన‌ప్పుడు హుడా క‌మిటీ రిపోర్టు ప్ర‌కారం ఎక‌రాకు రూ.10 నుంచి 15 వేలు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని చంద్ర‌బాబే 2010లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసి డిమాండ్ చేశారు. అయితే ఇంత‌వ‌ర‌కు న‌ష్ట‌పోయిన రైతుల‌కు ఎలాంటి ప‌రిహారం చెల్లించ‌లేదు. తాను అధికారంలోకి వ‌చ్చాక వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ధ‌ర‌లు ప‌డిపోయిన‌ప్పుడు రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌ల కోసం రూ.5 వేల కోట్ల‌తో ధ‌ర‌ల స్థీరీక‌ర‌ణ నిధిని ఏర్పాటు చేస్తామ‌ని వీధివాడా చెప్పారు. ఈ ఏడాది ఉల్లి, త‌మోట‌, కంది, పెస‌ర ధ‌ర‌లు కుప్ప‌కూలినా ఆ ఊసే లేదు. స్వామి నాథ‌న్ సిఫార్సులు అమ‌లు చేసి రైతులకు లాభ‌సాటి ధ‌ర‌లు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. గ‌త మూడేళ్లుగా ముష్టివేసిన‌ట్లుగా ప్ర‌ధాన పంట‌లైన వ‌రికి క్వింటాల్‌కు రూ.50 చొప్పున రెండు సార్లు, మ‌రోసారి రూ. 60 మ‌ద్ద‌తు ధ‌ర పెంచారు. ప‌త్తికి ఇదే ప‌రిస్థితి, వేరుశ‌న‌గ‌కు వంద రూపాయ‌ల బోన‌స్ కేంద్రం పెంచినా ఇక్క‌డ చెల్లించ‌లేదు. వ్య‌వ‌సాయ అనుబంధ రంగాలైన చేప‌ల పెంప‌కంలో 45 శాతం వృద్ధి రేటు సాధించామ‌ని, ప‌శుపోష‌ణ‌లో గ‌ణ‌నీయంగా వృద్ధిరేటు సాధించామ‌ని గొప్ప‌లు చెబుతున్నారు. దేశంలోనే మంచినీటి చేప‌ల పెంప‌కానికి ఏపీ పుట్టినిల్లు లాంటింది. దేశంలో ఎక్క‌డికి వెళ్లినా ఏపీ చేప‌లు దొరుకుతాయి.  అయితే టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక చేప‌ల ఉత్ప‌త్తి త‌గ్గింది. మ‌ద్ద‌తు ధ‌ర లేక చేప‌ల పెంప‌కం రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. 60 శాతం చేప‌ల పెంప‌కానికి కృష్ణా జ‌లాలు ప్ర‌ధాన వ‌న‌రు. అయితే 2016-2017లో చేప‌ల పెంప‌కానికి నీరు లేక చేప‌ల చెరువులు ఎండిపోతున్నాయి. ఇన్‌పుట్ స‌బ్సిడీ ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్‌లో ఉన్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. పంట దెబ్బ‌తిన్న పొలాలు ఎన్యుమ‌రేష‌న్‌లోనే మోసం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయ‌ల దోపిడీకి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌న‌సు ఉర‌క‌లు పెడుతుంది. కానీ పంట దెబ్బ‌తిని తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతుకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించేందుకు మ‌నస్సు చ‌లించ‌దు. బాబు నిర్వాకంతో బ్యాంకుల్లో బంగారంపై రుణాలు పుట్ట‌డం లేదు. స‌న్న‌, చిన్న‌కారు రైతులు ప్రైవేట్ వ‌డ్డీ వ్యాపారుల వ‌ద్ద 36 నుంచి 40 శాతం వ‌డ్డీకి రుణాలు తెచ్చుకుంటున్న దుస్థితి నెల‌కొంది. ప్ర‌కృతిని జ‌యించ‌టం మాన‌వుల‌కు సాధ్యం కాదు. కానీ మ‌న ముఖ్య‌మంత్రి క‌రువును జ‌యించాన‌ని గొప్ప‌లు చెబుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్య‌వ‌సాయ రంగంపై తీవ్ర ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. మేథావులు ఒక్క‌సారి ఆలోచించాలి.
Back to Top