వైద్య పర్యాటకం పేరుతో మరో దుబారాకి రంగం సిద్ధం


విశాఖ భాగస్వామ్య సదస్సు కొత్త కొత్త రంగుల కళ్లద్దాలు ఎపి ప్రజల కళ్లకు పెడుతూనే ఉంది. ఈ ఏడాది కూడా అలాంటి పనులే చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సు పరిశ్రమలను రాష్ట్రానికి తేవడం మాటేమోగానీ, బోలెడన్ని విమర్శలకు మాత్రం కేంద్రం అవుతోంది. అందుకు కారణం స్వయంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే. 
విశాఖ భాగస్వామ్య సదస్సులో పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా చేసిన ప్రకటన నిజంగా హాస్యాస్పదంగానూ, తెలుగు ప్రజలకు కోపాన్ని తెప్పించేదిగానూ ఉంది. వైద్యపర్యాటక ప్రోత్సాహానికి విదేశాల్లో సదస్సులు అంటూ ఆయనిచ్చిన స్టేట్ మెంట్ చూస్తే, ఖజానాకు గండి పెట్టి మరోసారి టూర్లు వేయడానికి అధికార యంత్రాంగం ప్లాన్లు వేసిందని అనుకోవాల్సి వస్తోంది. 

విదేశాల్లో భారీ సదస్సులు

వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే ఏడాది నుంచీ ఆఫ్రికా, మధ్య తూర్పు దేశాల్లో భారీ సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు ముఖేష్ కుమార్. ఇతర దేశాలకు వెళ్లి అక్కడి వారికి ఆంధ్రప్రదేశ్ లోని ఆసుప్రతుల్లో సౌకర్యాలు ఏస్థాయిలో ఉన్నాయో అవగాహన కల్పించి, ఇక్కడికి రావడానికి ప్రోత్సహిస్తారట. రాష్ట్రం నుంచి వైద్య నిపుణులను సైతం విదేశాలకు తీసుకెళ్లి వైద్య పర్యాటకంపై ప్రచారం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. వెల్ నెస్ టూరిజం కోసం రిసార్టుల్లో ఆయుర్వేద, నేచురోపతీ అందుబాటులో ఉంచుతామని, విజయవాడ భవానీ ద్వీపంలోనూ ఇలాంటి రెండు రిసార్టులు ఏర్పాటు చేస్తామని ఆయన తెలియజేసారు. 

తెలుగు ప్రజల ఆరోగ్యానికి దిక్కులేదు...

ఆల్రెడీ హైదరాబాద్ మెడికల్ హబ్ గా పేరు తెచ్చుకుంది. కార్పొరేట్ ఆసుపత్రులన్నీ అక్కడే పాగా వేసి ఉన్నాయి. ఆఫ్రికాతో పాటు, ఇతర దేశాల నుండి రోగులు అక్కడితో పోలిస్తే చవకగా వైద్యం దొరికే హైదరాబాద్ కు వచ్చి వైద్యం చేయించుకు వెళుతున్నారు. కానీ వీళ్లంతా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులనే సంప్రదిస్తారు. ప్రభుత్వా సుప్రతిలో వైద్యం చేయించుకునేందుకు విదేశాల నుంచి ఎవ్వరూ ఇక్కడకు సాధారణంగా రారు. ఇక ఎపి ప్రభుత్వం తలపెడుతున్న వైద్య పర్యాటకం కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు విదేశీ రోగులను రమ్మని పిలిచే ఆహ్వానమే. ప్రైవేటు ఆసుపత్రుల అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫు నుంచి ఇంత తాపత్రయపడం నిజంగా చంద్రబాబుకు, కార్పొరేట్ కల్చర్ పై ఉండే ప్రేమకు నిదర్శనం. 

ఒక పక్క రాష్ట్ర ప్రజలు సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేక, మందులు లేక పేషంట్లు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి, తమ ఆస్తులు అమ్ముకుని మరీ వైద్యం చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లినా ప్రాణాలు గాల్లో దీపాలే. విశ్వ రాజధానిగా అమరావతిని చేస్తాను అని కోతలు కోసే చంద్రబాబు, విజయవాడలో కాన్పుకోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకోవడం గురించి కనీసం పట్టించుకోలేదు. ఇంక్యుబేటర్లు లేక మరణించే చిన్నారులను పట్టించుకోడు. ఆసుపత్రుల్లో ఎలుకల బారిన పడి మరణిస్తున్న పసికందుల గురించి ఆలోచించరు. కుక్క కాటుకు, పాము కాటుకు కూడా ఏరియా ఆసుపత్రుల్లో మందులు లేని పరిస్థితి. గిరిజనులకు వైద్యం కావాలంటే కావిళ్లు కట్టించుకుని దగ్గర్లో ఉన్న పట్నాలకు తీసుకుపోవాల్సిందే. మురికి కూపాలుగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయడానికి, నిధులు ఇవ్వడానికి మనసు రాదు. కానీ కార్పొరేటు ఆసుప్రతుల్లో వైద్యం చేయించుకునేందుకు రమ్మని విదేశీ రోగులను ఆహ్వానించేందుకు, దాని ద్వారా ఆదాయాన్ని పొందేందుకు బోలెడన్ని ప్రణాళికలు వేసుకుంటున్నారు. 

ఆరోగ్యశ్రీ ని నిర్వీర్యం చేసి

లక్షలాది మంది పేద ప్రజల ప్రాణాలను నిలబెట్టి, వారి జీవితాల్లో దీపం వెలిగించిన పథకం ఆరోగ్యశ్రీ. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఈ పథకం ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. మోడీ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీని ఆదర్శంగా తీసుకుని దేశ ప్రజలకు 5లక్షల వరకూ ఉచిత వైద్యబీమా ఆలోచన చేస్తోందంటే అందుకు కారణం వైఎస్సారే. అలాంటి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసాడు చంద్రబాబు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాద్ ఉంటుందని చట్టం చెప్పినా, హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ ని రద్దు చేసాడు. ఎన్నో వ్యాధులను ఆరోగ్యశ్రీ లిస్టు నుంచి తొలగించారు. కాంక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సకు ప్రభుత్వ సహాయంలో కోత పెట్టాడు. 
చంద్రబాబు తీరే అంత. ప్రజల ఆరోగ్యాన్ని కూడా తన వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించుకునే ముఖ్యమంత్రి దేశం మొత్తంలో చంద్రబాబు తప్ప మరెవ్వరూ ఉండరు. 

 
Back to Top