దిగ్విజయంగా సమైక్య శంఖారావం

హైదరాబాద్, 27 అక్టోబర్ 2013:

రాష్ట్రం నలు మూలల నుంచీ ముఖ్యంగా హైదరాబాద్‌ ప్రాంతం నుంచి వచ్చి సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. సమైక్య శంఖారావం సభ ద్వారా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ముక్తకంఠంతో ఆకాంక్షించడమే కాకుండా ఢిల్లీ పీఠం కదిలేలా నినదించిన అందరికీ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పింది. భారీ వర్షాలు కురుస్తున్నా.. విపరీతమైన ఇబ్బందులు ఎదురైనా.. చలించకుండా మనస్పూర్తిగా వచ్చి సభను ఆశీర్వదించి, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, తెలుగుజాతి ఒకే మాట, ఒకే బాట, ఒకే రాష్ట్రంగా ఉండాలి.. అలాంటి వారికే తమ సంపూర్ణ సహకారం ఉంటుందని స్ఫూర్తినిచ్చిన వారందరికీ అభినందనలు తెలిపింది. పార్టీ అధినే శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో శనివారం హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావం సభ విజయవంతమైంది. ఈ సందర్భంగా పార్టీ సీజీసీ సభ్యుడు, రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమైక్య శంఖారావం సభను వివరంగా రిపోర్టు చేసిన మీడియా ప్రతినిధులందరికీ ఆయన అభినందనలు చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షాలు కురిసి, వరదలు ముంచెత్తిన సమయంలో కూడా హైదరాబాద్‌లో ఇంతకు ముందెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో అత్యధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమైక్య శంఖారావం సభ విజయవంతం అయిందని కొణతాల రామకృష్ణ ఆనందం వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సభకు హారజైన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. ఎల్బీ స్టేడియానికి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, దివంగత ‌ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డికి ఏదో అవినాభావ సంబంధం ఉందన్నారు. ఇదే ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ.. ఉచిత విద్యుత్, రైతులకు రుణ మాఫీ చేస్తూ ఇదే వేదిక నుంచి ఆదేశాలిచ్చిన వైనాన్ని కొణతాల గుర్తుచేశారు. రెండవసారి ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడి నుంచే చేస్తూ.. వ్యవసాయానికి 7 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

రాష్ట్ర విభజన వల్ల ఎన్నో ఇబ్బందులుంటాయని ఇప్పటికైనా ఢిల్లీ పెద్దలు తమ నిర్ణయంపై పునరాలోచిస్తారన్న విశ్వాసాన్ని కొణతాల వ్యక్తంచేశారు. అధికార, ప్రధాన ప్రతిపక్షంలోని నాయకులు రాష్ట్ర విభజన ఖాయమని అనుకుంటూ.. విభజనకు కావాల్సిన పంపకాలు ఎలా చేయాలనే ఒడంబడికలు చేసుకుంటున్నప్పటికీ మన రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే తాము భావిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవించే ఎవ్వరైనా ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

వర్షాలు, వరదలతో అపార నష్టం :
రాష్ట్రంలో ఒక పక్కన రుతుపవనాలు, మరో పక్కన తుపాను రెండూ మిళితమై గడచిన ఐదు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల కోస్తా ఆంధ్ర విపరీతంగా దెబ్బతిన్నదని కొణతాల పేర్కొన్నారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని నదులు పొంగి ప్రవహించి ఊళ్ళను ముంచెత్తాయని అన్నారు. చాలా చోట్ల రోడ్లు, గట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి వాటి నుంచి బయటికి వచ్చిన నీటితో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నారు. సుమారు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని కొణతాల విచారం వ్యక్తంచేశారు. గత నాలుగైదేళ్ళలో జరగనంత భారీ ఎత్తున పంట నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్రలో ఆదివారం నాడు కూడా భారీ వర్షం పడుతూండడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయన్నారు. రాజమండ్రి నుంచి రెలు సౌకర్యాలు తెగిపోయాయన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 30 మందికి పైగా వ్యక్తులు మరణించారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంత స్థాయిలో విపత్తును ఈ మధ్య కాలంలో చూడలేదన్నారు.

వర్షాలు, వరద బాధితులను శ్రీమతి విజయమ్మ పరామర్శిస్తున్నారు :
ప్రభుత్వం వెంటనే స్పందించి, సహాయ, పునరావాస కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ప్రభుత్వానికి కొణతాల విజ్ఞప్తిచేశారు. పంట నష్ట పరిహారాన్ని ఎంత మేరకు చెల్లించాలనే అంశంపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. వర్షం, వరద పీడిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాల్లో చురుగ్గా పొల్గొనాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు పార్టీ తరఫున కొణతాల పిలుపునిచ్చారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఆది, సోమ, మంగళవారాల్లో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని ఆయన తెలిపారు.

సమైక్య రాష్ట్రాన్ని నిలబెట్ట గల సమర్థుడు శ్రీ జగన్‌ :
సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని, 30 సీట్లు తెచ్చుకుని ఆ సభ్యుల ద్వారా ప్రధాన మంత్రిని నిర్ణయించే శక్తి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రావాలని, తద్వారా మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవాలన్నది శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆలోచన అని ఒక ప్రశ్నకు కొణతాల సమాధానం చెప్పారు. సమైక్యాన్ని కోరుకునే ప్రధాని వస్తే.. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్నది ఆయన ఆకాంక్ష అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం రాజకీయంగా తీసుకున్నది కాబట్టి రాజకీయ సంక్షోభమైనా రావాలి లేదా నిర్ణయాధికారంలో ఈ ప్రజలు ఉండాలన్నది శ్రీ జగన్‌ అభిమతం అన్నారు. సమైక్య రాష్ట్రాన్ని నిలబెట్ట గలిగే శక్తి శ్రీ జగన్‌కే ఉందని మరో ప్రశ్నకు బదులిచ్చారు. మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ తరువాత అంతటి ప్రభావవంతుడైన నాయకుడు ఒక్క శ్రీ జగనే అన్నది జగమెరిగిన సత్యం అన్నారు. విభజన వాదానికి వీడ్కోలు పలికే మొదటి సభ నిన్నటి సమైక్య శంఖారావం అని మరో ప్రశ్నకు కొణతాల అభివర్ణించారు.

Back to Top