విభజన జరిగితే నీటి యుద్ధాలు తప్పవు

హైదరాబాద్, 3 ఆగస్టు 2013:

ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగితే భవిష్యత్తులో నీటి కోసం యుద్దాలు జరిగే పరిస్థితులు తలెత్తుతాయని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి హెచ్చరించారు. కృష్ణానది వరద నీటి మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులు చివరికి చారిత్రక కట్టడాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిని ఆయన తప్పుబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రాజెక్టుల భవితవ్యంపై ఆందోళన వ్యక్తంచేశారు.

రాష్ట్ర రాజధానితో పాటు రెవెన్యూ, హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వంటి అనేక సమస్యలతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించి నీటి సమస్య కూడా ఒకటి ఏర్పడుతుందన్నారు. ఇలాంటి అనేక అంశాలపై స్పష్టత లేకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయం రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసే ప్రమాదముందని మైసూరారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నదీ జలాలపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలు కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో తాజాగా విభజన పేరుతో తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల మధ్య తీవ్ర సమస్యలు తెచ్చిపెడుతుందన్నారు. కృష్ణానది వరదనీటి మిగులు జలాలపై ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు, ఇప్పడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్ల ప్రజలు నీటి కోసం యుద్దాలు చేసుకోవాల్సిన పరిస్ధితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఒకవేళ విభజనకు నిజంగా సిద్ధపడితే మరి సొంత పార్టీ నేతలతో చంద్రబాబు ఎందుకు ఉద్యమాలు, ఆందోళనలు చేయిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అందరితోనూ చర్చించాం, చర్చలు ముగిశాయి అని ఢిల్లీ నాయకులు అంటున్నారని, వారు ఎవరితో చర్చించారో తనకైతే తెలియదని మైసూరారెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని స్టేక్‌ హోల్డర్లతో చర్చించిన దాఖలాలు లేవన్నారు. రాజకీయ పార్టీలు, ట్రేడ్‌ ఆర్గనైజేషన్లు, ఎన్జీవో సంఘాలు, వ్యవసాయ సంఘాలు వేటితోనూ చర్చించలేదన్నారు. సిడబ్ల్యుసి ద్వారా కాంగ్రెస్‌ వైఖరి చెప్పారు కానీ ఆ పార్టీ అయినా చర్చించారో లేదో తెలియదన్నారు.


సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు కొందరు స్పీకర్‌ ఫార్మాట్‌లో తమ రాజీనామాలు సమర్పించారని, మరి కొందరు పిసిసి అధ్యక్షుడికి ఇచ్చారని, యు టర్ను కొట్టిన ఇంకొందరు దిగ్విజయ్‌ సింగ్‌ను కలిసి రాజీనామాలు చేస్తామని చెప్పారట అన్నారు. అయితే.. కమిటీ వేస్తామని, రాజీనామాలు వెనక్కి తీసుకోండి అని చెప్పారట. ఇదంతా ఒక డ్రామా అని, దీన్ని చూస్తుంటే కాంగ్రెస్‌లోనూ చర్చలు అసంపూర్ణంగానే ఉన్నట్టు లెక్క అని మైసూరా వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు విభజన నిర్ణయం తీసుకోవడం అంటే కేవలం సీట్ల కోసమే అన్నారు.


కాంగ్రెస్ పార్టీ ‌నాయకులు రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మైసూరారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గవర్నర్‌కు తమ రాజీనామా లేఖలు ఇవ్వాలి కానీ సిఎంకు, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడికి ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ స్వార్ధం కోసం చేసిన అనాలోచిత చర్యకు సోనియా, చంద్రబాబు బాధ్యత వహించాలని మైసూరారెడ్డి అన్నారు. దేశాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కనీస ఇంగిత ‌జ్ఞానం కూడా లేదా? అని ఆయన నిలదీశారు.


తెలంగాణలోని నెట్టెంపాడు (22 టిఎంసిలు - ఆయకట్టు 2 లక్షల ఎకరాలు), కల్వకుర్తి (25 టిఎంసిలు - ఆయకట్టు 3.40 లక్షల ఎకరాలు), ఎస్ఎల్‌బిసి (30 టిఎంసిలు - ఆయకట్టు 3.70 లక్షల ఎకరాలు) .. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలకు చెందిన అతి ముఖ్యమైన ప్రాజెక్టులని మైసూరారెడ్డి తెలిపారు. ఇవన్నీ కృష్ణా నదిపై ఆధారపడిన ప్రాజెక్టులే. శ్రీశైలం డ్యాం ద్వారా నీరు లభ్యం కావలసిన ప్రాజెక్టులన్నారు. ఈ ప్రాంతాలు చాలా వెనుకబడిన ప్రాంతాలన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య ఉందని, జనం ఇక్కట్లు పడుతున్నారని మైసూరా విచారం వ్యక్తంచేశారు. వారి బాధలు తొలగించేందుకు అవసరమైన ప్రాజెక్టులు ఇవి అన్నారు.


ఇక రాయలసీమలో కరువు పీడిత ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టులు తెలుగుగంగ (29 టిఎంసిలు -(1.14 లక్షల ఎకరాలు కర్నూలు, 1.17 లక్షల ఎకరాలు కడప, 2.65 లక్షల ఎకరాలు నెల్లూరు, 49 వేల ఎకరాలు చిత్తూరు), గాలేరు - నగరి (38 టిఎంసిలు - 1.55 లక్షల ఎకరాలు కడపలోను, .103 లక్షల ఎకరాలు చిత్తూరు జిల్లాలోను), హంద్రీ -నీవా (40 టిఎంసిలు - 80 వేల ఎకరాలు కర్నూలులో, 3.45 లక్షల ఎకరాలు అనంతపురములో, 1.40 లక్షల ఎకరాలు చిత్తూరు జిల్లాలో) అని మైసూరారెడ్డి తెలిపారు. కోస్తాలోని ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు (3.36 లక్షల ఎకరాలు ప్రకాశం, 76,500 ఎకరాలు నెల్లూరు జిల్లాలో) కూడా ఉందన్నారు. వీటితో పాటు నాగార్జున సాగర్‌ కింద తెలంగాణ అయినా, ఆంధ్రా అయినా మనకు కేటాయించిన జలాల కంటే అదనంగా వాడుకుంటున్నారని అన్నారు. కృష్ణా డెల్టాలోనూ కేటాయించిన నీటి కంటే ఎక్కువ వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి సౌలభ్యం రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుందని, విడిపోతే ఆ సౌకర్యం ఉండదని మైసూరారెడ్డి తెలిపారు.


కృష్ణా నది అంతర్రాష్ట్ర నది అని, ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటకకు మన మధ్య నదీజలాల వివాదాలు జరుగుతున్నాయని మైసూరారెడ్డి గుర్తుచేశారు. ట్రిబ్యునల్‌ తీర్పును అనుసరించి మన రాష్ట్రానికి కేటాయించింది 811 టిఎంసిలు అన్నారు. నెట్టెంపాడు, కల్వకుర్తి, ఎస్ఎల్‌బిసి, తెలుగుగంగ, గాలేరు - నగరి, వెలిగొండ, హంద్రీ - నీవా ప్రాజెక్టులు అదనపు - మిగులు జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టులన్నారు. వీటిపై వేలాది కోట్లు ఖర్చుపెట్టారన్నారు. రేపు మన రాష్ట్ర విభజన జరిగితే.. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నదీజలాల బోర్డులు ఏర్పడతాయని, అప్పుడు ఈ ప్రాజెక్టులకు కేటాయించేందుకు చుక్క నీరు కూడా లేదన్నారు. ఈ కారణంగా ఈ ప్రాజెక్టులకు అదనంగా నీటి కేటాయింపులు ఉండబోవన్నారు. దీనితో ఈ ప్రాజెక్టుల కింద ఉన్న ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులకు గురికావలసి వస్తుందని మైసూరా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కారణంగా నీటి యుద్ధాలు చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు.


మిగులు జలాల ఫార్ములాను ముందుకు తెచ్చింది టిడిపి ప్రభుత్వ హయాంలోనే అని మైసూరారెడ్డి తెలిపారు. మిగులు జలాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిందీ టిడిపియే అన్నారు. మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన టిడిపి ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించమని, విభజనకు అడ్డు కాబోమని తీర్మానాలు చేసిందని, లేఖలు రాసిందని, అఖిలపక్ష సమావేశంలోనూ చెప్పిందన్నారు. ఈ విషయాన్ని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నిన్న మొన్న స్వయంగా ఒప్పుకున్నారు కూడా అన్నారు. తీవ్ర కష్టాల్లో ఉన్న ఈ మూడు ప్రాంతాల్లోని ఈ ప్రాజెక్టుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా అనాలోచితంగా, హస్వ దృష్టితో, రాజకీయ స్వార్థం కోసం లేఖ ఇచ్చిన టిడిపి ఇప్పుడు రాయలసీమ, ఆంధ్రా ప్రాంతంలోని ఎమ్మెల్యేలు, ఎంపిలను రాజీనామాలు చేయమంటోందని మైసూరా నిప్పులు చెరిగారు.


రెండు పక్కలా డ్రామాలు ఆడుతున్న టిడిపి ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మైసూరారెడ్డి హెచ్చరించారు. టిడిపి లేఖ ఇచ్చింది కనుక మేం నిర్ణయం తీసుకున్నాం అని కాంగ్రెస్‌ చెబుతోందని అన్నారు. అంటే.. రాష్ట్ర విభజనకు బాధ్యత అక్కడ సోనియాగారు, ఇక్కడ చంద్రబాబుగారు అని మైసూరారెడ్డి ఆరోపించారు. వీరికి ఈ మూడు ప్రాంతాల ప్రజలకూ సమాధానం చెప్పాల్సి బాధ్యత ఉందన్నారు. ఇప్పుడు సిగ్గూ ఎగ్గూ లేకుండా రాజీనామాలకు ప్రోత్సహించడం తమను మభ్యపెట్టడానికే అని ప్రజలు వీరి తీరును స్పష్టంగా గుర్తిస్తున్నారన్నారు. సమస్యలను చర్చించకుండా రాజకీయ లబ్ధి కోసం నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని, దొంగదారిన ఎమ్మెల్యేలను రాజీనామాలకు పురికొల్పడం కేవలం కాంగ్రెస్, టిడిపిల ఎత్తుగడ మాత్రమే అని మైసూరా విమర్శించారు. కొత్త రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబు అంటున్నారని, ఇంత నిర్వాకమూ చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడడం ఆయనకే చెల్లిందని దుయ్యబట్టారు.


విభజన నిర్ణయంతో ప్రాంతాలకు మేలు జరగదని మైసూరారెడ్డి అన్నారు. మెర్జర్‌, డీ మెర్జర్‌ల వల్ల ఖమ్మం జిల్లాలో సమస్యలు వస్తాయన్నారు. కొన్ని ప్రాంతాలు వచ్చి ఖమ్మంలో కలిశాయని, నల్గొండ జిల్లాలోనూ కొన్ని ప్రాంతాలు పోతాయన్నారు. నీటి సమస్యకు తోడు ఇలాంటి సమస్యలు కూడా ఎదురవుతాయని మైసూరా అన్నారు. ఇన్ని చిక్కుముడులతో కూడిన సమస్య రాష్ట్ర విభజన అని ఆయన అభివర్ణించారు. శరీరాలు కలిసిపోయి పుట్టిన బిడ్డలను విడదీయడం ఎంత కష్టమో రాష్ట్ర విభజనా అంతే క్లిష్టతరమైనదన్నారు.


అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందే చెప్పిందని మైసూరారెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలోని భాగస్వామ్య పక్షాలతో చర్చించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. అలాంటి కసరత్తు చేయని కాంగ్రెస్, టిడిపిలదే దీనికి పూర్తి బాధ్యత అన్నారు.


ఇప్పుడు యుపిఎ ప్రభుత్వం అంటూ ఏదీ లేదని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు మైసూరా బదులిచ్చారు. ఇప్పుడు ఉన్నది సిబిఐ ప్రభుత్వం అన్నారు. భవిష్యత్తులో లౌకిక వాదులతో కలుస్తామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ చెప్పిందే తప్ప యుపిఎతో కలుస్తామని చెప్పలేదని మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. లౌకిక వాదులు ఎంతమంది వస్తారో ఎవరు వస్తారో చూద్దామన్నారు.


సోనియాగాంధీకి కానీ, దిగ్విజయ్‌ సింగ్‌కు కానీ, గులాం నబీ ఆజాద్‌కు గానీ పైన పేర్కొన్న ప్రాజెక్టులన్నీ మిగులు జలాలపై ఆధారపడినవి అని తెలుసా? అని మరో ప్రశ్నకు బదులుగా అన్నారు. అవన్నీ తొంభై శాతం పూర్తవుతున్న ప్రాజెక్టులే అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top