దర్యాప్తు జరిగితే చంద్రబాబుకు జీవిత ఖైదే

హైదరాబాద్‌, 19 సెప్టెంబర్ 2013:

చంద్రబాబు నాయుడి ఆస్తులపై దర్యాప్తు జరిగితే జీవితాంతం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె‌ గురువారంనాడు మీడియాతో మాట్లాడారు. 'ఏమయ్యా.. నీకూ ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఎట్లా చదువుకున్నాడో.. ఎట్లా పెరిగాడో... ఎట్లా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడో.. ఏయే దేశాల్లో ఏయే వ్యాపాలు చేస్తున్నాడో.. ఇవన్నీ తెలిసిన విషయాలే. మీ తొమ్మిదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని నీ కొడుకు సంపాదించాడని కేసు వేస్తే... దాని ఆధారంగా విచారణ పేరుతో, కేవలం ఆరోపణలతో నాలుగేళ్ళ పాటు నీ కొడుకును జైల్లో పెడితే... ఎలా ఉంటుంది? చంద్రబాబూ!' అని పద్మ ఆగ్రహంగా ప్రశ్నించారు. గడచిన నాలుగేళ్ళలో 40 అంశాల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎన్నికల దగ్గర నుంచి పదవుల పందేరం వరకూ చంద్రబాబు కుమ్మక్కయ్యారన్నారు.

శ్రీ వైయస్ జగ‌న్‌పై కేసులన్నీ రాజకీయ కోణంతోనే వేశారని పద్మ అన్నారు. న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం శ్రీ జగన్‌కు బెయిల్ ఖాయమని న్యాయ స్థానాల నుంచి, ప్రజల నుంచి వ్యక్తమవుతున్న తరుణంలో చంద్రబాబు చేసిన పనేమిటన్నారు. టిడిపి ఎంపి నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీల బృందం మొత్తం ఢిల్లీ వెళ్ళి సిబిఐని, సివిసిని, ఈడీని అందర్నీ కలిసి కీచురాళ్లరొద చేస్తున్నారన్నారని విమర్శించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ రాకుండా చేయాలన్నదే వారి దుష్ట ప్రయత్నం అని నిప్పులు చెరిగారు. దర్యాప్తు చేసిన తర్వాత సిబిఐ 10 ఛార్జిషీట్లు వేసిందన్న విషయం వారు మరిచారన్నారు.

దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేస్తున్నది చంద్రబాబు కాదా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. కోర్టు విచారణలో ఉన్న కేసును కూడా ప్రభావితం చేయడానికి ఆయన యత్నిస్తున్నారన్నారు. ఇలా టిడిపి తలదూర్చడంతోనే ఈ కేసు రాజకీయ కేసు అని చెప్పకనే చెప్పారన్నారు. రెండేళ్ళ క్రితం తాము చెప్పిన మాటనే ఇప్పుడు టిడిపి నాయకులు అక్షరాలా రుజువు చేస్తున్నారన్నారు. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని దోషిగా నిర్ధారించే ఆధారాల్లేవు కాబట్టే టిడిపి శ్వేతపత్రం డ్రామా ఆడుతోందని పద్మ విమర్శించారు. శ్రీ జగన్‌పై కేసు నిలబడదని తేలిపోయింది కాబట్టే శ్వేపత్రం వేస్తామని టిడిపి చెబుతోందని అన్నారు. శ్వేతపత్రం వేయాల్సి అవసరం టిడిపికి ఏమిటని నిలదీశారు. శ్వేతపత్రం వేయడానికి టిడిపి నాయకులెవరని ప్రశ్నించారు.

చంద్రబాబు అవినీతికి సంబంధించి వంద అంశాలున్నాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళు ఉన్న సమయంలో జైలు శిక్షకు గురి కావాల్సిన 18 ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారని పద్మ తెలిపారు. వీటిపై చంద్రబాబు నాయుడు రోజుకొక శ్వేతపత్రం విడుదల చేయాలని పద్మ డిమాండ్‌ చేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటకు వస్తే తట్టుకోలేమని చంద్రబాబు నుంచి టిడిపి నాయకుల వరకూ బేజారెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్‌ వస్తుందనుకుంటున్న తరుణంలో మతి భ్రమించి వ్యవస్థలను, కేంద్రాన్ని, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని వాసిరెడ్డి విమర్శించారు. శ్రీ జగన్‌ను జైల్లోనే ఉంచాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటున్నా‌రని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్నచిల్లర పనులు, దిగజారి చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే ఆయన ఒక రాజకీయ నాయకుడా అని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా, కుట్రలు పన్నినా ఆయన గురించి వైయస్ఆర్‌ కుటుంబం ఏనాడూ ఏకవచనంతో మాట్లాడలేదని వాసిరెడ్డి పద్మ ప్రస్తావించారు. ప్రజల హృదయాల్లో గూడుకట్టున్న ప్రజా నాయకుడిని జైలులోనే ఉంచాలంటున్న ఇంత దుర్మార్గుడైన చంద్రబాబును రాజకీయ నాయకుడిగా గుర్తించాల్సి అవసరం కనిపించడంలేదన్నారు.

ఎన్టీ రామారావు కూడా చేయలేని పనిని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చేశారని రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. సిబిఐని ఉసిగొల్పి రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి, అరెస్టులు చేయించి జాతీయ స్థాయిలో కళంకాన్ని నెత్తిన పూసుకున్న కాంగ్రెస్‌తో చంద్రబాబు నాయుడు కుమ్మక్కై తన టిడిపిని కూడా భూస్థాపితం చేసుకుంటున్నారని విమర్శించారు. అవిశ్వాస సమయంలో మీ పార్టీ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఏమొచ్చిందని జాతీయ మీడియా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు పడ్డారని పద్మ దుయ్యబట్టారు. తలెత్తుకోలేని, నోరు విప్పలేని, సమాధానం చెప్పలేని ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నారన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో పన్నుల శాఖ మంత్రిగా ఉన్న దగ్గర నుంచి తొమ్మిదేళ్ళు సిఎం పనిచేసిన దగ్గర నుంచి జరిగిన ఆర్థిక అవకతవకలు, జరిగిన డీల్సు, వచ్చి జీవోలు, ఎమ్మార్, ఐఎంజి భారత కేసులు వీటన్నింటిపైనా నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగితే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా జైలులో ఉండాల్సిన పరిస్థితి వస్తుందని నిప్పులు చెరిగారు. చంద్రబాబు, ఆయన కొడుకు ఏయే దేశాల్లో ఏయే వ్యాపారాలు చేస్తున్నారో 20 ఏళ్ళుగా వారి పాస్‌పోర్టులను బయటపెట్టాలని పద్మ డిమాండ్‌ చేశారు. వీటన్నింటిపైనా త్వరలో వచ్చే ప్రభుత్వం దర్యాప్తు జరిపించదనుకుంటున్నావా? అని హెచ్చరించారు. మరణించిన వైయస్‌ రాజశేఖరరెడ్డిపై ప్రేలాపనలు పేలితే.. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలు నుంచి బయటికి రాకుండా చేసేస్తే.. పబ్బం గడిచిపోతుందనుకుంటున్నావా? అని ఆమె ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమని, చంద్రబాబు, చిదంబరం, సోనియాల రాజరికం కాదన్నారు. చంద్రబాబు, ఆయన కొడుకు జైలులో ఉండే రోజు త్వరలోనే వస్తుందని పద్మ గుర్తుచేశారు.

కుమ్మక్కు వల్ల బెయిల్‌ వస్తుందని ఎందుకు ప్రచారం చేయదలచుకున్నావు చంద్రబాబూ అని పద్మ నిలదీశారు. తెలంగాణకు ఇచ్చిన లేఖ సంగతేంటి? దాన్ని వెనక్కి తీసుకోండి అని సీమాంధ్ర ప్రజలు నిలదీస్తుంటే.. టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయండని మేం అడుగుతుంటే.. దాన్ని పక్కనపెట్టి, దృష్టి మళ్ళించేందుకే కాంగ్రెస్‌తో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కుమ్మక్కైంది కనుక శ్రీ జగన్‌కు బెయిల్‌ వచ్చిందని కాకమ్మ కబుర్లు చెబుతూ.. కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరుగుదామనుకుంటున్నావా? అని దుయ్యబట్టారు.‌ దర్యాప్తు పూర్తయిన తరువాత కింది కోర్టులు బెయిల్ ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన తీర్పును ఈ సందర్భంగా పద్మ చదివి వినిపించారు. బెయిల్‌ను అరాచకమైనదిగా, కుమ్మక్కు రాజకీయంగా చిత్రీకరించేందుకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఇంత అడ్డగోలు భాష్యం నిన్ను రాజకీయ నాయకుడిగా గుర్తించాలా ఎవరన్నా? అని వ్యాఖ్యానించారు.

1999 నుంచి ఒక్క ఎన్నికలో కూడా గెలవలేని దద్దమ్మ చంద్రబాబు 16 నెలలుగా శ్రీ జగన్‌ జైలులో ఉన్నా ఒక్క విజయాన్ని కూడా సొంతం చేసుకోలేక చతికిలపడిన ప్రతిపక్ష నేతవి అని దుయ్యబట్టారు. శ్రీ జగన్‌ బయటికి వస్తే.. నీ కాళ్ళ కింద భూమి కదులుతుందని, నీ టిడిపి దిక్కు లేకుండా పోతుందని... నీ కొడుకు దేశాలు పట్టుకుని పారిపోవాల్సి వస్తుందని చెప్పి బెయిల్‌ మీద కూడా కారుకూతలు కూస్తున్నావా? అని పద్మ ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. నీ లాగే వ్యవస్థలను మేనేజ్‌ చేసుకోమని చెప్పదలచుకున్నావా? అన్నారు. చీకట్లో చిదంబరాన్ని, అందరి కాళ్ళు పట్టుకుని అయినా కేసులు లేకుండా చేసుకోవాలని చెప్పదలచుకున్నావా? అని ప్రశ్నించారు.

మొనగాడిలా నిలబడాలనే సందేశాన్ని శ్రీ జగన్మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు ఇచ్చారని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎవరెంత దుర్మార్గం చేసినా సద్విమర్శ మాత్రమే చేయాలన్నది తమకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి నేర్పిన పాఠం అని చెప్పారు. చంద్రబాబు, ఆయన వందిమాగధులు చేస్తున్న అరాచకాన్ని, పొందుతున్న రాక్షసానందాన్ని చూశాక బజారు తిట్లు తిట్టినా తప్పులేదన్నారు.

అభియోగం ఎదుర్కొన్న భారతి సిమెంట్సుకు కూడా ఇవ్వని సిబిఐ చార్జిషీట్‌ ఈనాడు పత్రికకు ఏ విధంగా అందిందో చెప్పాల్సిన అవసరం ఉందని పద్మ అన్నారు. ఆరోపణలనే తీర్పు అన్నట్లు, నిర్ధారణ జరిగినట్లు ఆ పత్రిక రాయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆర్థిక నేరారోపణలలో నిందితుడిగా ఉన్న రామోజీరావు న్యాయమూర్తిలా శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద తీర్పు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని పద్మ నిప్పులు చెరిగారు. ఏది విచారణో, ఏది న్యాయమో, ఏది తీర్పో కూడా తెలియకుండా ప్రచురించడాన్ని ఆమె విమర్శించారు. ఇదేనా జర్నలిజం విలువ అన్నారు. శ్రీ జగన్‌ను ఎదుర్కోవడం కోసం అన్ని విలువలనూ ధ్వంసం చేయదలచుకున్నారా? అన్నారు. మీకు దమ్ముంటే.. శక్తి ఉంటే శ్రీ జగన్‌ను ప్రజల్లో ఎదుర్కోండి అని పద్మ సవాల్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top