సమైక్య శంఖారావం అంటే టిడిపికి హడల్

హైదరాబాద్, 22 అక్టోబర్ 2013:

సమైక్య శంఖారావం సభ అంటే సీమాంధ్ర టిడిపి నాయకులకు కూడా భయం పట్టుకుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పులు చెరిగారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటే తమ పబ్బం గడవదనే వారు కూడా విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆ క్రమంలోనే సమైక్య శంఖారావం సభకు హాజరు కావద్దని సీమాంధ్రులను కోరారని దుయ్యబట్టారు. సీఎం కిరణ్‌, చంద్రబాబు నాయుడు ఇద్దరూ సమైక్య ద్రోహులని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కుట్రలో భాగంగానే సీఎం ఉద్యమాన్ని నడిపించారని, ఆ కుట్రలో భాగంగానే మళ్లీ ఉద్యమాన్ని విరమింపజేశారని ఆరోపించారు. మంత్రుల బృందం దగ్గరకు వెళ్లడమంటేనే విభజనకు అంగీకరించడమని ఆమె అన్నారు. టీడీపీ సీమాంధ్ర నేతలు కూడా రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ముమ్మర వర్షాకాలంలోనూ విద్యుత్‌ కోతలేంటి?:

గడచిన రెండు నెలలుగా ‌భారీగా వర్షాలు పడినప్పటికీ హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో అక్టోబర్ నెల నుంచే విద్యుత్‌ కోతలు విధిస్తున్న దుస్థితిపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. అక్టోబర్‌ నెలలోనే విద్యుత్‌ కోతలు ఈ విధంగా ఉంటే రాబోయే రోజుల్లో కరెంటు పరిస్థితి ఏమిటి అని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ‌ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టింది. సమైక్యాంధ్రపై కాంగ్రెస్, టిడిపిలు రెండూ పిల్లిమొగ్గలు వేస్తున్న విధానంపైనా ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. తెల్లారి లేస్తే.. శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై కలవరింత, ఆయనపై విమర్శిలు చేయడం తప్పితే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ప్రజా సమస్యలేవీ పట్టడం లేదని పద్మ ఆరోపించారు.

హైదరాబాద్‌లోనే మూడు గంటలు విద్యుత్‌ కోతలు విధించడంతో పాటు పరిశ్రమలకు పీక్‌ అవర్‌లో సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్య విద్యుత్‌ సరఫరా నిలిపివేయడాన్ని పద్మ తప్పుపట్టారు. కరెంటు కోతల కారణంగా రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని, రెండు నెలల క్రితమే కోతలను ఎత్తివేసిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ విద్యుత్‌ సరఫరాల నిలిపివేయడమేమిటని ప్రశ్నించారు. గ్రామాల్లో సుమారు 12 గంటలు విద్యుత్‌ సరఫరా ఉండడం లేదన్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌రెడ్డి 2011 అక్టోబర్‌లో అడుగుపెట్టినప్పడు మొదలైన విద్యుత్‌ కోతలు ఇప్పటికి ఇంకా కొనసాగుతున్నాయని తూర్పారపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అంతకన్నా బాధ్యత లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్న కనీస బాధ్యత లేకుండా టిడిపి నాయకులు వ్యవహరిస్తున్నారని తూర్పారపట్టారు.

సామాన్యులు అతలాకుతలం అవుతున్న తీవ్రమైన సమస్య విద్యుత్‌ కోతల అమలు అని పద్మ విచారం వ్యక్తంచేశారు. అయినప్పటికీ ప్రజలు అడగొద్దు.. ఆలోచించొద్దు అనే విధంగా సీఎం కిరణ్‌ వ్యవహరించడం సరికాదని విమర్శించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి సమైక్య ముసుగు వేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. కరెంటు కోతలు, ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు సతమతం అవుతుంటే.. కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజల గురించి , దుష్ట కాంగ్రెస్‌ పాలనను నిలదీయాలన్న కనీస బాధ్యతను మర్చిపోయి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రీ జగన్‌ తలంపు, కలవరింత తప్ప మరో సమస్య, ఇంకో పేరు గుర్తురావడంలేదని విమర్శించారు.

ఉచిత విద్యుత్‌ను ఎగ్గొట్టేందుకే దొడ్డిదారులు :
రైతులకు ఉచిత విద్యుత్‌ను ఎగ్గొట్టడానికి రాష్ట్రప్రభుత్వం దొడ్డిదారులు వెతుకుతోందని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. నగదు బదిలీ పథకాన్ని ఉచిత విద్యుత్‌ను అనుసంధానం చేయాలని ఎత్తుగడలు వేస్తోందన్నారు. ఉచిత విద్యుత్‌ను ప్రపంచ బ్యాంకు ఒప్పుకోదని 2004కు ముందు చంద్రబాబు నాయుడు అన్నారని, ఇప్పుడు కిరణ్‌ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు అనుగుణంగా ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. కానీ ప్రపంచ బ్యాంకు మెడలు వంచి, షరతులను కాదని మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన వైనాన్ని వాసిరెడ్డి పద్మ ప్రస్తావించారు. వ్యవసాయ విద్యుత్‌కు ఇచ్చే సబ్సిడీ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం చాలా ప్రమాదకరమైన విషయం అన్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలను ఒక్కొక్కటి అటకెక్కించే విధానంపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరమూ పోరాటం చేస్తూనే ఉందని పద్మ పేర్కొన్నారు. పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అనేక దీక్షలు, ఆందోళనలు చేశారని గుర్తుచేశారు. ప్రజల తరఫున ప్రతి విషయంలోనూ పోరాడుతున్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని అన్నారు. అన్ని జబ్బులకూ జిందా తిలిస్మాత్‌ మందు అన్నట్లుగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమస్యల నుంచి పారిపోయేందుకు సమైక్య నినాదాన్ని ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. అంతే తప్ప కిరణ్‌ సమైక్య వాది కాదు, సమైక్య ఉద్యమ ద్రోహి అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు సమైక్య ఉద్యమం చేసేలా రెచ్చగొట్టింది.. నీరుగార్చింది కిరణే అని పద్మ ఆరోపించారు. రాష్ట్ర విభజన ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారని పద్మ ఎద్దేవా చేశారు.

విభజన విధివిధానాలను రూపొందించేందుకు ఏర్పటైన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) దగ్గరికి వెళ్ళడమంటేనే విభజనను అంగీకరించినట్లు అని పద్మ వ్యాఖ్యానించారు. ఉద్యోగులను జీఓఎం వద్దకు వెళ్ళమని కిరణ్‌ ప్రోత్సహిస్తున్నారంటే కేంద్రం చేసిన విభజన నిర్ణయాన్ని సానుకూలం చేయడానికే అన్నారు. జీఓఎఒకు టిడిపి వారేమి చెబుతారు? కిరణ్‌కుమార్‌రెడ్డి ఏమి చెబుతారని ప్రశ్నించారు. విభజన ఎలా చేయండి అని చెబుతారని, నాలుగైదు లక్షల కోట్లు ఇవ్వండని చెబుతారు అన్నారు. విభజనను అంగీకరించిన చంద్రబాబు సమైక్య ద్రోహి కాక మరేమవుతారని ప్రశ్నించారు.

సమైక్యం వైపు నిలబడాల్సిన అవసరం ఉందని.. పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేద్దామని, చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోవద్దని శ్రీ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని పద్మ గుర్తుచేశారు. జెండాలు పక్కన పెట్టకపోయినా ఎజెండా మాత్రం ఒక్కటే సమైక్యాంధ్ర ఉండాలన్నారన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్రానికి చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోమని కోరామని, లేదా సమైక్యానికి మద్దతుగా చంద్రబాబు లేఖ రాసినా తాను సంతకం చేస్తానని శ్రీ జగన్‌ ముందుకు వచ్చారన్నారు.

సమైక్యానికి మూడు పార్టీలు అనుకూలమని, టిడిపి కూడా అదే దారిలోకి వస్తే.. మరో పార్టీని కూడా ఒప్పించి ఐదు పార్టీలకు మెజారిటీ పెరుగుతుందని దానితో విభజన ప్రక్రియ ఆగిపోతుందని పద్మ అన్నారు. విభజన లేఖను వెనక్కి తీసుకుని చంద్రబాబు నాయుడు సమైక్యం వైపు నిలబడాలని కోరారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసిన విధంగా చంద్రబాబు కూడా అసెంబ్లీని సమావేశపరచాలని, సమైక్య తీర్మానం చేయాలని అని ఉంటే కేంద్రం మీద ఒత్తిడి ఉండేదన్నారు. విభజన జరగడం కిరణ్, చంద్రబాబులకు అవసరం కనుక, సమైక్యానికి తూట్లు పొడవాలనుకుంటున్నారు కనుక అసెంబ్లీ తీర్మానం చేయకుండా తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. తమ పబ్బం గడవదు కనుక సమైక్యమంటేనే వీరిద్దరూ జడుసుకుంటున్నారన్నారు.

సమైక్య శంఖారావానికి వెళ్ళొద్దని టిడిపి ఫత్వాలు :
వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే సమైక్య శంఖారావం సభకు వెళ్ళవద్దని సీమాంధ్రకు చెందిన టిడిపి నాయకులే ఫత్వాలు జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్ర టిడిపి నాయకులకు చేతనైతే.. చీమూ నెత్తురూ ఉంటే.. వారు తింటున్నది అన్నమే అయితే.. సమైక్యం విషయంలో చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. రాష్ట్రం విడిపోతే ఒక్క సీమాంధ్రే కాదు తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాలూ అన్యాయం అయిపోతాయని చెప్పే సరైన నాయకుడు ఒక్కడైనా టిడిపిలో ఉన్నారా? అని ప్రశ్నించారు. అలా ఎవరైనా ఉండి ఉంటే చంద్రబాబు నాయుడిని ఎందుకు నిలదీసి అడగడంలేదన్నారు. సీమాంధ్ర ప్రజల ఉద్యమాలు మీ బండ మనసులను కరిగించలేకపోయాయా? అని నిలదీశారు. లేఖ వెనక్కి తీసుకోండి అని చెప్పే ధైర్యం సీమాంధ్ర టిడిపి నాయకులలో ఒక్కరికీ లేదా? అన్నారు. దేవినేని, సోమిరెడ్డి, పయ్యావుల నోళ్ళు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. సమైక్యమంటే ఎందుకు మీకు అంత భయం అని నిలదీశారు. సమైక్య శంఖారావం సభను శ్రీ జగన్‌ హైదరాబాద్‌లో పెడితే మీకు వచ్చిన నష్టమేంటని సూటిగా ప్రశ్నించారు. ఆ సభకు వెళితే ఎవరికో ప్రయోజనం అనే అబద్ధాలు మాట్లాడే పరిస్థితి మీకు వచ్చిందా? అన్నారు.

రాష్ట్రం విడిపోతేనే నాలుగు సీట్లు, ఓట్లు వస్తాయని ఊహించుకుంటున్నారు కనుకే సీమాంధ్ర టిడిపి నాయకులు కూడా సమైక్యాంధ్రకు గండికొట్టేందుకు సిద్ధమయ్యారని పద్మ దుయ్యబట్టారు. విభజన వాదులు కనుకే సమైక్య శంఖారావం సభపై తెలంగాణ వాదులు చేస్తున్న విషప్రచారాన్నే వారూ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన రోజునే చంద్రబాబు సహా సీమాంధ్రలోని కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు కూడా పదవులను వదిలేస్తే విభజన ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడేది  కాదన్నారు. నాలుగైదు లక్షల కోట్లతో కృష్ణా నీటిని తెస్తరా? గోదావరి నీరు తెస్తారా? ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు, తెలంగాణ దాటి నదుల నుంచి నీరు కిందకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ట్రిబ్యునల్సు వేస్తే నీటి గొడవలు పరిష్కారం అవుతాయా? అని ప్రశ్నించారు. ప్యాకేజీలతో, కొత్త రాజధానితో సమస్య పరిష్కారం కాదన్నారు. కష్టమైనా నష్టమైనా పరిష్కరించుకోవాల్సింది సమైక్యాంధ్రలోనే అన్నారు. విడిపోతే తెలుగువారికి గుర్తింపు ఉండబోదన్నారు.

విభజన వాజమ్మ రాజకీయాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని టిడిపి నాయకులకు పద్మ హితవు పలికారు. శ్రీ జగన్‌ కాళ్ళు పట్టుకుని గుంజి ముందుకు పోదామనుకుంటే.. అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నది వాస్తవం అన్నారు. సమైక్యాన్ని కోరుకునే కోట్లాది మంది మూడు ప్రాంతాల్లోనూ ఉన్నారని, సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షలాదిగా తరలి వస్తున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Back to Top