జగన్‌ చుట్టూ జాతీయ రాజకీయాలు

హైదరాబాద్, 18 అక్టోబర్ 2013:

2014 ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాల్లో శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఒకరి వద్దకు
వెళ్ళే పరిస్థితుల్లో శ్రీ జగన్‌ ఉండబోరన్నారు. దేశ రాజకీయాలు శ్రీ జగన్‌
చుట్టూ తిరుగుతాయన్నది గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబుకు ఉమ్మారెడ్డి
సూచించారు. వచ్చే ఎన్నికల తరువాత దేశంలో కాంగ్రెస్‌ పార్టీ వాసి కోల్పోతుందని చెప్పారు. ఇప్పుడున్న కనీస గుర్తింపు కూడా దానికి ఉండదన్నారు. ఈ
దేశంలో సోనియా గాంధీ అ‌డ్రస్ లేకుండా పోతారన్నారు. రాహుల్‌ గాంధీ కలలు
నిజమయ్యే ప్రసక్తి లేనే లేదన్నారు. అలాంటి వారిని పట్టుకుని వేళ్ళాడుతున్న
చంద్రబాబు పరిస్థితి ఊగిసలాటలో ఉందన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి యుపిఎకు మద్దతు ఇవ్వాలనే ప్రశ్నే
ఉత్పన్నం కాదని ఉమ్మారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పార్టీ కేంద్ర కార్యాయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో
పార్టీ నాయకులు గౌతంరెడ్డి, జంగా కృష్ణమూర్తిలతో కలిసి ఉమ్మారెడ్డి
మాట్లాడారు.

కాంగ్రెస్‌ నాయకులు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్‌ సింగ్‌లతో సంబంధాలు, మిత్రత్వం చంద్రబాబు నాయుడికి ఇంకా కొనసాగుతున్నాయా? అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబు నాయుడే అని అందరికీ తెలిసిందే అన్నారు.  వైయస్ఆర్‌ కాంగ్రెస్, శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై పదేపదే చంద్రబాబు చేస్తున్న గోబెల్సు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబు నాయుడు తాను యూత్‌ కాంగ్రెస్‌లో అత్యంత ప్రధానమైన మిత్రులమని గులాం నబీ ఆజాద్‌ అనేక సార్లు చెప్పారని ఉమ్మారెడ్డి తెలిపారు. చంద్రబాబు తనకు చాలా ముఖ్యమైన స్నేహితుతుడని దిగ్విజయ్‌సింగ్‌ పలుమార్లు అన్నారన్నారు. అదే సంబంధాలు వారితో చంద్రబాబు ఇప్పటికీ కొనసాగిస్తున్నారా? అని ప్రశ్నించారు. తన రక్తంలో 30 శాతం కాంగ్రెస్‌దే ప్రవహిస్తోందని చంద్రబాబే స్వయంగా గతంలో అన్న వైనాన్ని గుర్తుచేశారు. ఆ రక్తం 30 నుంచి 70 శాతానికి పెరిగిందా? అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకూ ప్రతిసారీ కాంగ్రెస్‌తో చంద్రబాబే కుమ్మక్కయ్యారని నిప్పులు చెరిగారు. అలాంటిది సోనియా దత్తపుత్రుడు శ్రీ జగన్‌ అనడంలో ఔచిత్యం లేదన్నారు. బెయిల్‌ నిబంధనలకు సడలించాలని కోర్టును శ్రీ జగన్‌ కోరినా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న అత్యంత ఆదరణను చూసి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిరాశా, నిస్పృహల్లో కూరుకుపోయారని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడంలేదనుకున్న చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు నాయుడు చేసుకుంటున్న ఒప్పందాలు, దానితో కుమ్మక్కయిన విధానాలను ఎవరూ గమనించడంలేదని భ్రమిస్తున్నారని అన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్, కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కై, ఒప్పందాలు చేసుకున్నాయంటూ చంద్రబాబు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా వీటి మధ్య ఇలాంటి ఒప్పందాలే ఉంటాయని పదే పదే మాట్లాడుతుండడం సరికాదన్నారు.

అబద్ధాన్ని ఎన్ని ఎక్కువ సార్లు చెబితే ప్రజలను అంత బాగా నమ్మించవచ్చనే భ్రమల్లో చంద్రబాబు ఉన్నారని ఉమ్మారెడ్డి ఎద్దేవా చేశారు. 175 నియోజకవర్గాలకు పరిమితమైన ఉద్యమం సమైక్య ఉద్యమం ఎలా అవుతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని చంద్రబాబు ప్రశ్నించడాన్ని తప్పుపట్టారు. సమైక్య ఉద్యమం అంటే 294 నియోజకవర్గాల్లో ఉండాలని కాదని, సమైక్యాన్ని కోరుకునే వారికి సంబంధించిందే తప్ప సమైక్యంగా ఉండాలని ఒక ప్రాంతంలో ఉద్యమం వచ్చిందన్నారు. ప్రజల శ్రేయస్సు, రాష్ట్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమైక్యంగా ఉండాలన్నంతమాత్రానా కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని చాలా విడ్డూరంగా ఉందన్నారు.

294 నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ పార్టీ రెండు ప్రాంతాలుగా చీల్చాలని కోరుకుంటోందని ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. దానికి 2008లోనే మద్దతిచ్చింది చంద్రబాబు నాయుడున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి మద్దతు పలికిన వ్యక్తే ఇప్పుడు కాంగ్రెస్, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యారనడం ఏమి సమంజసం అన్నారు.

అవసరం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్‌ను టిడిపి కాపాడుతోందని అనేక సందర్భాల్లో రుజువవుతోందని ఉమ్మారెడ్డి తెలిపారు. పాదయాత్ర చేసినప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని ప్రతి రోజూ చంద్రబాబు నాయుడ అనే వారని గుర్తుచేశారు. కానీ ప్రభుత్వాన్ని దింపేసే అధికారం వచ్చినప్పడు మాత్రం ఆయన ముందుకు వచ్చేవారు కాదన్నారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం టిడిపి అవిశ్వాసం పెడితే పడిపోతుందని అన్ని పార్టీలూ సలహా ఇచ్చాయన్నారు. కాని చంద్రబాబు మాత్రం అందుకు ముందుకు రాలేదన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అవిశ్వాసం పెడితే.. దేశ, రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టిడిపి సభ్యులకు చంద్రబాబు విప్‌ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడారని విమర్శించారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయించారన్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారనడానికి ఇది నిదర్శనం కాదా అన్నారు. కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కైన వైనాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టివి చర్చలో చెప్పిన విషయాన్ని ఉమ్మారెడ్డి ప్రస్తావించారు. నాలుగున్నరేళ్ళుగా కాంగ్రెస్‌ పార్టీని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాపాడుతూనే ఉన్నారని అన్నారు. ఒకే అవాస్తవాన్ని, ఒకే అబద్ధాన్ని పదిసార్లు చెబితే ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటన్నారు.

మరో పార్టీతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కయ్యే ప్రశ్న రానే రాదన్నారు. స్వతంత్రంగా నిలబడుతుందన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌ 294 నియోజకవర్గాల్లోనూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందన్నారు. ప్రతి ఎన్నికలోనూ ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకునే చంద్రబాబు నాయుడు టిఆర్ఎస్‌తో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ కుమ్మక్కయిందని ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా 2009లో టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నది చంద్రబాబు నాయుడే అని ఉమ్మారెడ్డి గుర్తుచేశారు. అయినా చంద్రబాబుకు ఫలితం దక్కలేదని ఆయన ఎద్దేవా చేశారు.

సోనియా గాంధీ స్క్రిప్టును కాంగ్రెస్, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అమలు చేస్తాయంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉమ్మారెడ్డి తిప్పికొట్టారు. ఈ నెల 3న బొత్స సత్యనారాయణ, టిడిపి ఎంపి సిఎం రమేశ్‌ మూడు గంటల పాటు చేసిన మంతనాలను చూస్తేనే ఎవరి స్క్రిప్టును ఎవరు అమలు చేస్తున్నారన్నది వెల్లడవుతుందన్నారు. సమైక్యాంధ్ర కోసం శ్రీ జగన్మోహన్‌రెడ్డి నిరాహార దీక్ష చేస్తుంటే.. దానికి కౌంటర్‌గా సోనియా స్ర్కిప్టు మేరకే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. మూడవ తేదీన బొత్స, రమేశ్‌ భేటి జరిగితే 4వ తేదీన చంద్రబాబు ఢిల్లీలో దీక్ష ప్రారంభించడం అంటే అది సోనియా స్క్రిప్టు ప్రకారమే అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమనా? లేక విభజించమని దీక్షలో కూర్చున్నారా? అని జాతీయ మీడియా అనేక మార్లు అడిగినా ఆయన దగ్గర సమాధానం లేదన్నారు. ఢిల్లీలో దీక్ష చేసి అభాసు పాలై చంద్రబాబు తిరిగివచ్చారని అన్నారు.

బెయిల్‌పై బయటికి వచ్చిన శ్రీ జగన్‌కు ప్రభుత్వం రెడ్‌కార్పెట్‌ వేసిందన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఉమ్మారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శ్రీ జగన్‌ 16 నెలలు జైలులో ఉన్నారని, ఏడుసార్లు బెయిల్‌కు దరఖాస్తు చేశారన్నారు. ఆరుసార్లు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసిన తరువాత నాలుగు నెలల్లో సిబిఐ అన్ని చార్జిషీట్లూ దాఖలు చేయాలని, ఆ తరువాత బెయిల్‌కు దరఖాస్తు చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. సెప్టెంబర్ 9 వ తేదీతో ఆ గడువు అయిపోయిందన్నారు. ఆ రోజున కాకుండా 13వ తేదీనో, 14 వ తారీఖునో చార్జిషీట్లు వేస్తే సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చిన విషయాన్ని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. అలా వచ్చిన బెయిల్‌ తప్పని చంద్రబాబు ఎలా అంటారని నిలదీశారు. శ్రీ జగన్‌ ఫోబియా టిడిపి నాయకులలో పూర్తిగా ఆవరించిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి రెండుసార్లు ఓడిపోయిందని, మూడోసారి కూడా పోతుందనే భయంతో తన పరిస్థితి ఏమవుతుందో అని ఊహించుకోలేక, తట్టుకోలేక లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

కోర్టులను అవమానించేలా, వాటి నిర్ణయాలను తప్పుపడుతూ చంద్రబాబు మాట్లాడడం తగదని ఉమ్మారెడ్డి హితవు పలికారు. కోర్టు తీసుకోబోయే నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన విషయాలన్నారు.

Back to Top