టిడిపికి ఇదే ఆఖరి మహానాడు

హైదరాబాద్, 27 మే 2013:

తెలుగుదేశం పార్టీకి ఇదే ఆఖరి మహానాడు అని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జి. శ్రీకాంత్‌రెడ్డి అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు తాను గతంలో చేసిన తప్పిదాలను మహానాడు వేదిక నుంచి ఒప్పుకుంటారని, ప్రజలకు ఉపయోగపడే సందేశం ఇస్తారని అందరూ భావించారన్నారు. అయితే అలాంటిదేమీ లేకుండా ఆయన తనలోని అసహనాన్ని, ఈర్ష్యను బయటపెట్టుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పైపెచ్చు చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బెల్టు షాపులు తీసుకువచ్చిన చంద్రబాబే ఇప్పుడు తనకు అధికారం ఇస్తే వాటిని తీసేస్తానని చెప్పడంలో ఔచిత్యం లేదని ఆయన విమర్శించారు. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఒకే ఒక ప్రతిపక్షం టిడిపియే అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మహానాడు వేదిక నుంచి‌ మహానేత వైయస్, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డిపైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్‌రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి క్షమించడం వల్లే చంద్రబాబు నాయుడు జైలుకు పోకుండా బయటే ఉన్నారన్న విషయాన్ని శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. 36 శాతం ఉన్న టిడిపి ఓటు బ్యాంకు 19 శాతానికి తగ్గిపోవడానికి చంద్రబాబు తీరే కారణం అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే టిడిపి పూర్తిగా  కనుమరుగు కాబోతోందని అన్నారు. చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేక ఓటు ఉండదని, అయితే టిడిపి విషయంలో అది కాదని రుజువవుతోందన్నారు.

ఏలేరు, ఐఎంజి కుంభకోణం, టిడిపి హయాలోం విడుదలైన జిఓలపైన సరైన దర్యాప్తు జరిగితే చంద్రబాబు సహా ఆయన కేబినెట్‌ మొత్తం జైలు ఊచలు లెక్కపెడుతూ ఉండేదని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఏడాది కాలంగా జైలులో నిర్బంధించడం అక్రమం అని ఆయన నిప్పులు చెరిగారు.  కేంద్రంలో చక్రం తిప్పేది వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రమే అని శ్రీకాంత్‌రెడ్డి ధీమాగా చెప్పారు.

మహానాడు వేదికపై తాను ఏం చేయదలచుకున్నారో చెప్పకుండా కేవలం శ్రీ జగన్‌ ఒక్కరే లక్ష్యంగా అవాకులు చెవాకులు మాట్లాడారని శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో తాను చేసిన తప్పిదాలను ఒప్పుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడాన్ని తప్పుపట్టారు. చంద్రబాబుపై ఉన్న అనేక అభియోగాలపై చర్యలు తీసుకుంటామని 1998లో బిజెపి ప్రకటించిన వెంటనే వారి వద్దకు వెళ్ళి పొత్తు పెట్టుకుని 1999లో అధికారంలోకి వచ్చారన్నారు. తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిడిపి ఘోరంగా ఓడిపోవడమే కాకుండా మొన్నటి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా కోల్పోయి వైనాన్ని పరిశీలిస్తే చంద్రబాబుకు ఇదే చివరి మహానాడు కానున్నదని శ్రీకాంత్‌రెడ్డి విశ్లేషించారు.

బెల్టుషాపులు తెచ్చి గ్రామాలను నిర్వీర్యం చేసిందే చంద్రబాబు నాయుడని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. 2009 ఎన్నికలు ముందు పట్టపగలే 12 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తానని చేసిన వాగ్దానాలకు చంద్రబాబు తరువాత మర్చిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చక్రం తిప్పిన చంద్రబాబు కరవు వస్తే రైతులకు ఎలాంటి వెసులుబాటూ చేయలేదన్నారు. మహానేత వైయస్‌ సిఎం కాగానే రైతుల రుణాలను రీషెడ్యూల్‌ చేయించారని, వడ్దీ మాఫీ చేయించారని గుర్తుచేశారు. కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎత్తేసింది చంద్రబాబు కాదా? అని శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. ఎన్టీ రామారావు కుర్చీ లాగేసుకుని మానసికంగా కుంగిపోయి ఆయనను చనిపోయేలా చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ ఆయన నామ భజనే చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌పై పదే పదే లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేస్తుండడాన్ని శ్రీకాంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అదో ఊతపదంలా మాట్లాడుతున్న చంద్రబాబుకు అసలు అవగాహన ఉందా? అని ఆయన నిలదీశారు. సుప్రీంకోర్టుకు సిబిఐ చెప్పిన ప్రకారం 70 శాతం విచారణ పూర్తయిందని, రూ. 1030 కోట్ల వరకు కేసును ఫైల్‌ చెప్పింది చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. శ్రీ జగన్‌పై వస్తున్న ఆరోపణలపై నిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని, కడిగిన ముత్యంలా ఆయన బయటికి వస్తారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ప్రజాదరణ ఉన్నదన్న అక్కసుతోనే శ్రీ జగన్మోహన్‌రెడ్డికి సంవత్సర కాలం జీవితాన్ని వ్యర్ధం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ‌బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవద్దనే తీర్పు దేశంలోనే మరెక్కడా లేదన్నారు. వీటన్నింటినీ గమనించినందువల్లే శ్రీ జగన్‌కు జనాదారణ మరింతగా పెరుగుతోందన్నారు.

సిబిఐ చార్జిషీట్‌లో వేసిన అభియోగాలు కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రూ.16 వేల కోట్లు ప్రయోజనం కలిగితే‌ శ్రీ జగన్ సంస్థల్లో రూ. 32 వేల కోట్లు పెట్టుబడులు పెట్టారనడాన్ని ఆయన తప్పుపట్టారు.‌ శ్రీ జగన్‌పై చేస్తున్న ఆరోపణలను నిరూపించలేకపోగా సంవత్సర కాలంగా ఎందుకు జైలులో పెట్టి వేధిస్తున్నారని ఆయన నిలదీశారు.సాక్షులను ప్రభావితం చేస్తారు కనుకే శ్రీ జగన్‌ను బయటికి రానివ్వమని సిబిఐ వాదించడంపై నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతలు ఏలుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

శ్రీ జగన్‌పై చంద్రబాబుకి ఎందుకు అంత ద్వేషం అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. శ్రీ జగన్‌ను జనంలో ఉండకుండా చేయాలని సిబిఐ, టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు కుట్ర చేశాయని ఆరోపించారు. నిబంధనల ప్రకారం కాకుండా ఎఐసిసి ఆదేశాల ప్రకారం సిబిఐ పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఇలాంటి కక్ష పూరితమైన దర్యాప్తు మరే నాయకుడిపైనా జరిగి ఉండదన్నారు. కేవలం రాజకీయ కుట్రతోనే సిబిఐ శ్రీ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోందన్నారు. కేంద్రంలో ఒక న్యాయం, రాష్ట్రంలో మరో న్యాయంలా సిబిఐ వ్యవహరిస్తోందని విమర్శించారు. అటు కాంగ్రెస్‌కు, ఇటు టిడిపికి ఢిల్లీ‌లోని కాంగ్రెస్ అధిష్టానమే హైకమాండ్‌గా వ్యవహరిస్తోందని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ అధిష్టానం నిర్దేశకత్వంలో చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో తనపై విచారణ జరగకుండా మేనేజ్‌ చేసుకుంటున్న చంద్రబాబు ఇతరులపై ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఒక్క పథకం ద్వారా అయినా ప్రజలకు లబ్ధి చేకూరిందా? అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌, టిడిపిలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.

Back to Top