సోనియా రహస్య పుత్రుడు చంద్రబాబు

హైదరాబాద్ :

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన విషయంలో సోనియా గాంధీకి రహస్య పుత్రుడిగా వ్యవహరిస్తూ అన్ని రకాలుగా సహకరిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌ఆరోపించింది. విభజన విషయంలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి వింత నాటకం ఆడుతున్నాయని పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు,‌ అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌కు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆమె విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శోభా నాగిరెడ్డి మాట్లాడారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్న 24 గంటల లోపే చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ, కొత్త రాజధాని కోసం నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు కావాలని అడిగారని, అలాంటి వ్యక్తికి తమ పార్టీని విమర్శించే అర్హత లేదన్న్డారు. రాష్ట్రాన్ని విభజించాలన్న సోనియా నిర్ణయాన్ని తమ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
‘రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ంతా రాజీనామా చేశాం. అసెంబ్లీని ఏర్పాటు చేసి సమైక్య తీర్మానం చేయాలని గవర్నర్, స్పీకర్‌లను కలిసి వినతిపత్రాలిచ్చాం. శ్రీ జగన్మోహన్‌రెడ్డి, శ్రీమతి విజయమ్మ నిరాహార దీక్షలు చేశారు. సీఎంకు లేఖ రాశాం. విభజనను అడ్డుకోవాలని జాతీయ పార్టీలన్నింటినీ కలిసి మద్దతు కోరుతున్నాం. సీఎం కుర్చీలో ఉన్న కిరణ్, ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు ఏం చేస్తున్నట్లు? మాట్లాడితే చరిత్రలు చెప్పుకుంటున్న చంద్రబాబు విభజనను అడ్డుకోవడానికి ఒక్క ప్రయత్నమైనా చేశారా?’ అని ప్రశ్నించారు. అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని టీడీపీ నేతలు ఒక్కరోజైనా డిమాండ్ చేశారా అని ప్రశ్నించారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే ‌చంద్రబాబు అసెంబ్లీ ప్రోరోగ్‌పై మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబు దిగజారుడు మాటలు :
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్ జాతీయ పార్టీలన్నింటి మద్దతు కూడగడుతుంటే ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ ‌నాయకులు కూడబలుక్కుని ఒకే విధంగా మాట్లాడుతున్నారని శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు మరీ దారుణంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‌శ్రీ జగన్ కుప్పం రాకూడదట. ఎందుకని ప్రశ్నిస్తే.. అది పవిత్రమైన నియోజకవర్గమని ఆయన అంటారు. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం మిగతా 293 నియోజకవర్గాలు అపవిత్రమైనవా?’ అని ప్రశ్నించారు. ఆ పార్టీకే చెందిన మరోనేత యనమల రామకృష్ణుడు గత రెండేళ్లుగా శ్రీ జగన్ అనే మాట‌ తప్ప మరేమీ పలకడంలేదన్నారు. వారి అధినేత మాదిరి చీకట్లో వెళ్లి చిదంబరంను కలిసే నైజం తమది కాదన్నారు.

సీఎం కిరణ్ ధోరణి చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. కేంద్రాన్ని ఎదిరించైనా విభజనను అడ్డుకుంటానని చెబుతున్న కిరణ్, నాలుగు నెలలుగా సాగుతున్న విభజన ప్రక్రియను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నం ఏదైనా ఉందా? అని‌ శోభా నాగిరెడ్డి అడిగారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన రోజే సీఎం పదవికి రాజీనామా చేసి ఉంటే, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి విభజన ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయేదన్నారు. సోనియా గాంధీని ఎదిరిస్తే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కూడా కొనసాగనివ్వరని కిర‌ణ్‌కు తెలుసని అన్నారు.

Back to Top