రహదారుల దిగ్బంధంలో పాల్గొనండి

హైదరాబాద్, 5 నవంబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేడానికి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 6,7 తేదీల్లో రహదారుల దిగ్బంధం పిలుపు‌నకు ప్రజలంతా సహకరించాలని పార్టీ సీఈసీ సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి విజ్ఞప్తిచేశారు. 7వ తేదీన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) సమావేశం ఉన్నందున కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో మరోసారి స్పష్టం చేయడానికి రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. రహదారుల దిగ్బంధం కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శోభా నాగిరెడ్డి కోరారు. రహదారుల దిగ్బంధాన్ని దృష్టిలో పెట్టుకుని 6,7 తేదీల్లో ప్రయాణాలు వాయిదా వేసుకుని సహకరించాలని అన్నారు.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నిన్న హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధుల బృందం కలిసిందని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మరోసారి వినతిపత్రం సమర్పించిందని శోభా నాడిరడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఇంతకు ముందుకు కూడా శ్రీమతి విజయమ్మ నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్రపతిని రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి కలిసిందన్నారు. రాష్ట్రపతి హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా శ్రీ జగన్‌ నేతృత్వంలో కూడా తమ బృందం కలిసి.. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఎలాంటి సంప్రదాయాలు పాటించారో అలాగే మన రాష్ట్రం విషయంలో పాటించాలని ఆదేశించాలని కోరామన్నారు. దేశంలో జరిగిన రాష్ట్రాల విభజనలన్నీ ఎస్సార్సీనో లేక అసెంబ్లీ తీర్మానం ఆధారంగానో చేసుకుని నిర్ణయం తీసుకున్నవి అన్నారు. అలాంటి సంప్రదాయాలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుని ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడిందని శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. అలాంటి నిర్ణయాలను ఆపగలిగిన శక్తి రాష్ట్రపతికి ఉంది కాబట్టి ప్రజల అభిప్రాయాలను శ్రీ జగన్‌ ద్వారా తెలియజేసినట్లు చెప్పారు.

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్రామాను బాగా రక్తికట్టిస్తున్నారని శోభా నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు కాంగ్రెస్, టీడీపీలు రెండూ కారణం అయ్యాయని దుయ్యబట్టారు. రాష్ట్రం కోసం ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నానని చెప్పిన చంద్రబాబు హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతికి ప్రజల సమస్యలను వివరించేందుకు ఎందుకు కలవలేదని నిలదీశారు. రాష్ట్రం విడిపోతే తమ భవిష్యత్తు అంధకారం అయిపోతుందని ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు ఇన్ని రోజులుగా దీక్షలు, ఆందోళనలు చేస్తుంటే రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళేందుకు బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడైతే చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిరాహార దీక్ష ఎందుకు చేశారని ప్రశ్నించారు. సీమాంధ్ర టీడీపీ నాయకులు విభజనను ఆపమంటారని, అదే పార్టీ తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి దయాకరరావు వారి మీద ఫిర్యాదు చేశామంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు అనుకున్నంత అమాయకులు ప్రజలు కాదని గుర్తుచేశారు. చంద్రబాబు అనుమతి లేకుండానే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెళ్ళి రాష్ట్రపతిని కలుస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో డ్రామాలాడి రాష్ట్రంలో ఆయన మరో డ్రామా ఆడుతున్నారన్నారు.

ప్రజలకు ఏ సందేశం ఇవ్వడానికి మళ్ళీ ఈ నెలలో సీమాంధ్ర ప్రాంతంలో ఆత్మగౌరవ యాత్ర చేస్తారని ప్రశ్నించారు. రాజధాని హైదరాబాద్‌ను పోగొట్టి ఏ ముఖం పెట్టుకుని వచ్చావని విద్యార్థులు తప్పకుండా చంద్రబాబును నిలదీస్తారని అన్నారు. సాగునీటి కోసం ఇప్పటికే ఇరు ప్రాంతాల రైతుల మధ్య విభేదాలున్నాయని, విభజన జరిగిన తరువాత ఆత్మహత్యలు జరిగితే ఏమి సమాధానం చెబుతాన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని రెండు నెలలు జీతాలు వదులుకుని ఉద్యమాలు చేసిన ఉద్యోగులకు చంద్రబాబు ఏమి జవాబు చెబుతారన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ ఢిల్లీలో దీక్ష చేసిన చంద్రబాబు సమన్యాయం అంటే ప్రజలు ఎలా నమ్ముతారనుకుంటున్నారని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలు, ఉద్యమకారులను మోసం చేస్తూ.. సోనియా గాంధీ నిర్ణయాలకు ఎక్కడా అవాంతరాలు రానివ్వకుండా చక్కగా అమలు చేస్తున్నారని శోభా నాగిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ డ్రామాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా కేంద్రం నుంచి అధికారులు వస్తే.. రాష్ట్రంలోని అధికారులతో చక్కగా సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవాది అయితే అలాంటి సహకారం అందించకూడదన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నాం.. రాష్ట్రం నుంచి సమాచారం ఇవ్వబోము అని చెప్పాలన్నారు. పోతే మరో మూడు నెలలు ఉండే సీఎం పదవే పోతుందన్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానం పెట్టమని చెబుతున్నా కిరణ్‌ స్పందించడంలేదన్నారు. విభజన నిర్ణయాన్ని ఆపడానికి సీఎం ఏం చర్య తీసుకున్నారని నిలదీశారు. రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల అభిమతాన్ని కేంద్రానికి తెలియజేయమన్నారు. విభజన నిర్ణయం జరగక ముందే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేసి పంపిస్తే.. కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్ళేది కాదన్నారు. విభజనకు ముందే మేం వ్యతిరేకిస్తున్నామన్న సందేశాన్ని కేంద్రానికి ఇవ్వలేని నిస్సహాయ స్థితిలోకి సీఎం నెట్టేశారని దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులందరం రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించి ఉంటే కేంద్రం దూకుడుగా నిర్ణయం చేసేది కాదన్నారు. కేంద్రం ఇంతగా నిర్ణయం చేయడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన సహకారం కాదా? అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్‌, టీడీపీలు ప్రజవ విశ్వాసం కోల్పోయాయని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం సుమారు 50 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే.. డిపాజిట్లు కోల్పోయిన పార్టీలని ఎద్దేవా చేశారు. డిపాజిట్లు కోల్పోయిన పార్టీల నిర్ణయంపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడిందంటే.. చాలా దురదృష్టకరం అన్నారు.

కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు ఎంతగా ఉందంటే.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ నల్గొండ జిల్లాలోని భారీ వర్షాలు, వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనకు వెళితే పోలీసులను పెట్టి అడ్డుకున్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి 12 గంటలు కూడా తిరగక ముందే చంద్రబాబు నాయుడు అదే ప్రాంతానికి వెళితే మాత్రం ఈగ కూడా వాలకుండా చేసి, రెడ్‌ కార్పెట్‌ పరిచి మరీ పర్యటన చేయించారని ఆరోపించారు. కిరణ్‌ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబు నాయుడే అని, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తీసుకుంటే దానికి అనుకూలంగా లేఖ ఇచ్చి మద్దతు ఇస్తున్నదీ ఆయనే అని శోభా నాగిరెడ్డి ఆరోపించారు.

మన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే.. అంతవరకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుందని శోభా నాగిరెడ్డి తెలిపారు. ప్రజల నమ్మకాన్ని అన్ని రకాలుగా నిలబెట్టుకుంటుందని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ గ్రామ సభలు తీర్మానాలు చేసి ప్రధానికి, జీఓఎంకు ఇ మెయిళ్ళు పంపించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపు మేరకు 9,368 గ్రామాల్లో తీర్మానాలు చేసి పంపించినట్లు తెలిపారు.

Back to Top