రాజకీయ వేధింపులతోనే జగన్‌ నిర్బంధం

హైదరాబాద్, 26 మే 2013:‌

రాజకీయ వేధింపుల్లో భాగంగానే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఏడాది కాలంగా జైలులో నిర్బంధించారని వైయస్‌ఆర్‌ సిఎల్పీ ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ఆరోపించారు. విచారణ నెపంతో శ్రీ జగన్ను జైల్లో ఉంచి సోమవారాని ఏడాది పూర్తి అవుతుందని‌ ఆమె తెలిపారు. సిబిఐ తీరుకు నిరసనగా సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మంగళవారం ఉదయం 10:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో  నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.  ఆ రోజున హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద జరిగే నిరసన దీక్షలు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పాల్గొంటారని వివరించారు.  ఈ నిరసనలలో పాల్గొనే కార్యకర్తలు వేసవితాపాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులకు ఈ సందర్భంగా శోభానాగిరెడ్డి సూచించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో శోభా నాగిరెడ్డి పార్టీ నిర్వహించే నిరసన కార్యక్రమాలను వివరించారు.

శ్రీ జగన్‌ను జైల్లో పెట్టి, అన్యాయం చేస్తున్నందుకు ప్రతి పేదవాడు బాధపడుతున్నారని శోభా నాగిరెడ్డి అన్నారు.   దేశంలో ఎక్కడా జరగని విధంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.‌ శ్రీ జగన్ మీద పెట్టిన ఆరోపణల్లో ఏ ఒక్క దాన్నీ రుజువు చేయలేరని కాంగ్రెస్‌, టిడిపిలు, సిబిఐకి కూడా తెలుసన్నారు. చార్జిషీట్ల పేరుతో సిబిఐ ఈ కేసు విచారణను కావాలనే జాప్యం చేస్తోందని శోభా నాగిరెడ్డి విమర్శించారు. ఇలా చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేయమని కాంగ్రెస్‌, టిడిపిలు సిబిఐకి నిర్దేశిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించి ఐదు చార్జిషీట్లు వేశారన్నారు.  సిబిఐ ఒక రాజకీయ అస్త్రంగా మారిపోయిందని ఆమె విచారం వ్యక్తంచేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని వేధించడానికే సిబిఐ ఇలాంటి దుశ్చర్యకు దిగిందని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ జగన్‌కు బెయిల్‌ రానివ్వకుండా చేస్తూ సిబిఐ రాజ్యాంగ ఉల్లంఘనకు దిగజారిపోయిందని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. సిబిఐని కాంగ్రెస్‌ పార్టీ పావుగా వాడుకుంటోందని ఆమె విమర్శించారు. శ్రీ జగన్‌పై వచ్చిన ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా చూపించలేదన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే శ్రీ జగన్‌ను కుట్ర చేసి జైల్లో పెట్టారని అన్నారు.

‌మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతోందని శోభా నాగిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కిరణ్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అవిశ్వాసం పెడతామన్న చంద్రబాబు నాయుడు ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నాననడం, లోక కల్యాణం కోసం కృషి చేస్తున్నాననడం, అవినీతిపై ధర్మపోరాటం చేస్తున్నానని చెప్పడం పెద్ద కామెడీగా ప్రజలు తీసుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు పెడతానన్న అవిశ్వాసంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయుడు డ్రామాలను కట్టిపెట్టాలని శోభా నాగిరెడ్డి సూచించారు. ప్రభుత్వం పడిపోదని నిర్ధారించుకున్న తరువాతే అవిశ్వాసానికి ముందుకు వచ్చారా? చంద్రబాబు నాయుడుగారూ అని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీలో సరిపడినంత సంఖ్యాబలం లేదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. మైనార్టీలో ఉన్న ఈ ప్రభుత్వం చంద్రబాబు అండ చూసుకునే ప్రజల మీద ధరలు పెంచేసి ఆర్థిక భారాలు వేయడానికి వెనుకాడడం లేదని దుయ్యబట్టారు.

ఈ ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్షం టిడిపి, దాని అధ్యక్షుడు చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారాలు పడడానికి చంద్రబాబే కారణం అని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ఒక పక్కన అవిశ్వాస తీర్మానం పెడతామని చంద్రబాబు చెబుతూనే మరో పక్కన ఈ ప్రభుత్వం బలంగా ఉందని చెబుతుండడాన్ని శోభా నాగిరెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. అవిశ్వాస తీర్మానం విషయంలో చంద్రబాబు లోపాయికారి ఒప్పందం జరిగిందని ప్రజలు అనుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌, టిడిపిలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజా శ్రీ జగన్‌ వైపు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపునే ఉన్నారని శోభా నాగిరెడ్డి తెలిపారు. ప్రజల్లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బలం‌గా ఉన్న నేపథ్యంలో తమను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు వైయస్‌ఆర్ క్రాంగ్రె‌స్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని విలేక‌రులు అడిగిన ప్రశ్నకు శోభా నాగిరెడ్డి సమాధానం చెప్పారు

Back to Top