ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం పెట్టాలి

హైదరాబాద్, 2 ఫిబ్రవరి 2013: ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రధాన ప్రతిపక్షం అయితే... మైనార్టీలో పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై టిడిపి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. తన చేతిలో ఉన్న ఆయుధాన్ని వినియోగించకుండా గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తే ఫలితం ఏమీ ఉంటుందని వ్యాఖ్యానించింది. అవిశ్వాసం పెట్టకపోతే కాంగ్రెస్‌ పార్టీతో ఒప్పందం చేసుకున్నామని బహిరంగంగా చెప్పాలని నిలదీసింది. లేకపోతే కాంగ్రెస్‌ పార్టీతో టిడిపి లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్టేనని ఆరోపించింది. వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి శనివారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో టిడిపి తీరును తూర్పారపట్టారు.

రాష్ట్రంలో ఒక్క క్షణమైనా అధికారంలో కొనసాగే అర్హత కాంగ్రెస్‌కు లేదని టిడిపి అంటోందని, మైనార్టీలో పడిన ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని మైసూరారెడ్డి నిలదీశారు. 'పిల్లి శాపాలకు ఉట్లు తెగవు' అని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
తొమ్మిది మంది కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారని, ఆయన ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడినట్లే అని మైసూరారెడ్డి పేర్కొన్నారు. అయితే, అన్ని పార్టీలూ ఏకమైనా సరే తమకేమీ ఢోకా లేదని కొందరు కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారన్నారు. మరి కొందరైతే తమ ప్రభుత్వానికి  టిడిపి మద్దతు ఉన్నందున ఇబ్బందేమీ లేదని చెబుతున్నారన్నారు. అంటే ప్రజా వ్యతిరేక కాంగ్రెస్‌ ప్రభుత్వానికి టిడిపి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రజలు, తాము భావించాల్సి వస్తున్నదని మైసూరా అన్నారు.

 ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వంపై టిడిపి ఎందుకు అవిశ్వాసం పెట్టదని ఆయన నిలదీశారు. నిజానికి ప్రభుత్వానికి బలం తగ్గినప్పుడు దానిపై అవిశ్వాసం పెట్టడం ప్రధాన ప్రతిపక్షం బాధ్యత అని మైసూరారెడ్డి అన్నారు. ఇలాంటి సమయం కోసమే ఎక్కడైనా ప్రతిపక్షం కాచుక్కూర్చుంటుందన్నారు. అయితే, మన రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తీరు అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజ రంజకంగా పాలిస్తోందని, రాష్ట్రంలో ఎలాంటి సమస్యలూ లేవని భావిస్తే దానికి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేయాలని మైసూరారెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రజల తరఫున టిడిపి పోరాడ దలచుకుందా? లేదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏమీ చేయకపోతే ప్రభుత్వానికి టిడిపి మద్దతు ఇస్తున్నట్లే లెక్క అన్నారు. ప్రజాకంటక ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందో లేక ప్రజల పక్షాన పోరాడుతుందో టిడిపి స్పష్టంచేయాలన్నారు. కాంగ్రెస్‌, టిడిపిల మధ్య మద్దతు ఉందా లేదా వెల్లడించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన బాగుందని టిడిపి అంటే అవిశ్వాసం గురించి తాము మాట్లాడబోమని ఆయన స్పష్టం చేశారు.

అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం పెడితే.. తమ పార్టీ తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తుందని మైసూరారెడ్డి తెలిపారు. ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రధాన ప్రతిపక్షానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం 'అవిశ్వాసం' అని దాన్ని టిడిపి ఎందుకు వినియోగించడంలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు పార్టీ రాష్ట్రంలో కనుమరుగైపోతుందని మైసూరా అన్నారు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేల్చుకుందాం రమ్మని టిడిపికి ఆయన సవాల్‌ విసిరారు.

ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలంటే అసెంబ్లీలో కనీసం 30 మంది సభ్యుల బలం ఉండాలని, వైయస్‌ఆర్‌సిపికి అంత బలం లేదని మైసూరారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ టిఆర్‌ఎస్‌ అవిశ్వాసం పెడితే వైయస్‌ఆర్‌సిపి మద్దతు ఇస్తుందా? అన్న ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఆయన బదులిస్తూ... 'జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంద'ని వ్యాఖ్యానించారు.
Back to Top