బాబు రాజకీయ బినామీ పవన్

హైదరాబాద్, 1 ఏప్రిల్ 2014:

సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌, ఒక వర్గం మీడియా టీడీపీతో చేతులు కలిపి, ఆ పార్టీకి అనుకూలంగా వకాల్తా తీసుకుని వ్యవహరిస్తున్నట్లు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిప్పులు చెరిగింది. జనసేన పార్టీ ‌పేరుతో ప్రజల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్‌ అసలు ముసుగు ఇప్పుడు తొలగిపోయిందని‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. దిగజారుడు రాజకీయాలను పవన్ కల్యా‌ణ్ ప్రోత్సహిస్తున్నారని పద్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాడు పద్మ మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబు నాయుడు గడచిన పదేళ్ళుగా చెబుతున్న మాటలనే పవన్‌ కల్యాణ్ వల్లించారని పద్మ ఆరోపించారు. చంద్రబాబు‌ నాయుడు ప్రజలను నేరుగా ఓట్లు అడగలేక మోడి, పవన్‌ కళ్యాణ్ ముసుగు పెట్టుకు‌ని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడిని విమర్శించకపోవడం వల్లే పవన్‌ కళ్యాణ్కు ‌యెల్లో మీడియా వత్తాసు పలుకుతోందని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ప్రతి ఎన్నికల ముందు అబద్ధపు, నిరాధారమైన వార్తలను ప్రచురించడం యెల్లో మీడియాకు ఒక అలవాటుగా మారిపోయిందని ఆమె దుయ్యబట్టారు. టీడీపీ తరఫున వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయడానికి ఈ సారి పవన్‌ కళ్యాణ్‌తో యెల్లో మీడియా చేతులు కలిపిందని తూర్పారపట్టారు. వార్తల పేరుతో ఈనాడు పత్రిక సొంత కథనాలు అల్లుతోందని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ శిఖండులే‌ అన్నారు. సామాన్య ప్రజలు ఆలోచించినట్లుగా కూడా పవన్ కళ్యాణ్‌ ఆలోచించలేకపోతున్నార‌ని పద్మ విమర్శించారు.

నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన రంగాను దారుణంగా హతమార్చడంపైన, పరిటాల రవిపై పలు క్రిమినల్‌ కేసులుండడంపై ఎందుకు మౌనంగా ఉన్నారో పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెప్పాలని పద్మ డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అయోమయంలో పవన్‌ కళ్యాణ్‌ కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఇక రాజకీయ పార్టీ అని ఎందుకు ప్రకటించుకున్నారని నిలదీశారు.  పవన్ పెట్టిన పార్టీని పార్టీ అనాలో...‌ క్లబ్బు అనాలో తెలియని పరిస్థితిలో మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఆసరా ఇవ్వాల్సిన అవసరం పవన్ ఏ‌మి వచ్చిందని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలవడం ఈనాడు రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకు అవసరమని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. చంద్రబాబును నమ్ముకున్న పారిశ్రామికవేత్తలకు ఆయన గెలుపు అవసరం అని, అలాగే పారిశ్రామికవేత్తల నుండి ఎంపీలుగా అవతారం ఎత్తినవారికి చంద్రబాబు గెలుపు అంతే అవసరమని పద్మ అన్నారు. సీఎం పీఠం ఇక తనకు దక్కే అవకాశం లేదని చంద్రబాబుకు తెలుసని అందుకే వెనక నుంచి వారంతా చక్రం తిప్పుతున్నారన్నారు. చంద్రబాబును అడ్డం పెట్టుకుని తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు భావజాలాన్ని ఈనాడు చెప్పకనే చెబుతుందన్నారు.

బినామీ వ్యాపారాలలో చంద్రబాబు దిట్ట అని, బినామీల చేత రాజకీయాలు నడిపించడంలో కూడా ఆయన అందె వేసిన చెయ్యి అని పవన్‌ కళ్యాణ్‌ మాటల ద్వారా రుజువవుతోందని వాసిరెడ్డి వ్యాఖ్యానించారు. పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు నాయుడి బినామీ రాజకీయ నాయకుడని అన్నారు.

చంద్రబాబుతో బీజేపీకి బంధం కుదిరిన తర్వాత మోడీని ఆకాశానికి ఎత్తాలని రామోజీరావుకు అనిపిస్తోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. మోడీ గెలుపు చారిత్రక అవసరమని అంతకు ముందు ఎప్పుడూ ఈనాడు ఎందుకు చెప్పలేదన్నారు. అందుకే మోడీ కోసం మూడు పేజీలు కేటాయించారని మండిపడ్డారు. పవన్ కల్యా‌ణ్ ఇంటర్వ్యూ కూడా దీనిలో భాగమేనని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. చంద్రబాబు-పవ‌న్ కల్యా‌ణ్ కాంబినేష‌న్లో ఓట్లు వస్తాయన్న ఆశతో‌నే పవన్ను ఈనాడు ఆకాశానికి ఎత్తేస్తోందన్నారు. పవ‌న్ కొత్తగా‌ ఇప్పుడే రాజకీయాల్లోకి రాలేదని, 2009లో పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనలో‌ ఇన్ని గొప్ప లక్షణాలు రామోజీకి ఎందుకు కనిపించలేదని నిలదీశారు.

రాజకీయంగా విభేదించిన శ్రీ వైయస్‌ జగన్‌పై కక్షతో కాంగ్రెస్‌ పార్టీ కేసులు పెట్టిందని, 90 రోజుల్లో రావాల్సిన బెయిల్‌ కూడా రాకుండా చేసిందని పద్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. 16 నెలల పాటు జైలులోనే నిర్బంధించిందన్నారు. నిరంతరం 'సేవ్‌ కాంగ్రెస్‌ మిషన్'‌లో ఉన్న చంద్రబాబు నాయుడితో చేతులు కలపడం వల్ల పవన్‌ కళ్యాణ్ 'కాంగ్రెస్‌ హటావో' నినాదానికి ప్రయోజనమే లేకుండా పోతుందని ఆమె వ్యాఖ్యానించారు.  2009లో శత్రువైన చంద్రబాబు నాయుడు 2014కు వచ్చేసరికి మిత్రుడైపోయాడా అని ఎద్దేవా చేశారు.
టీడీపీ - వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ మధ్య ఏ అంశంపైనైనా తులనాత్మకమైన బహిరంగ చర్చకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వాసిరెడ్డి పద్మ తెలిపారు.

Back to Top