రామాయణంలో పిడకల వేటలా బాబు తీరు

హైదరాబాద్, 3 అక్టోబర్ 2013:

చంద్రబాబు నాయుడి సరళి చూస్తుంటే 'రామాయణంలో పిడకల వేట' మాదిరిగా ఉందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి విమర్శించారు. రాష్ట్రమంతా ఢిల్లీ వైపు ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే.. చంద్రబాబు అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చట్టం, నిబంధనలు గురించి చంద్రబాబు నాయుడు తెలుసుకుని మాట్లాడాలని మైసూరారెడ్డి సూచించారు. చంద్రబాబు నాయుడికి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఫోబియా పట్టుకున్నదని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై మైసూరారెడ్డి నిప్పులు చెరిగారు. విభజన అంశం ఇరు ప్రాంతాల మధ్య సున్నితమైన సమస్య అయినపుడు కేంద్రం ఆచి తూచి వ్యవహరించాలని అన్నారు. విభజనపై నిర్ణయం తీసుకున్నాం కదా అని ముందుకెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మైసూరారెడ్డి హైచ్చరించారు.

ఢిల్లీలో కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఏమి జరుగుతుందో అని రాష్ట్ర ప్రజలంతా ఉత్కంఠగా చూస్తుంటే.. తొమ్మిదేళ్ళు పరిపాలించి, బాధ్యత గల ప్రతిపక్షంలో ఉండి, ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు అది మరిచిపోయి, కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ను సిబిఐ డైరెక్టర్ కలవడంపై మండిపడడం రామాయణంలో పిడకల వేట మాదిరిగా ఉందని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. ‌దిగ్విజయ్‌సింగ్‌ను సిబిఐ డెరెక్టర్‌ కలిసిన విషయంపై కూడా చంద్రబాబు నాయుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. తొమ్మిదేళ్ళు పాలించిన వ్యక్తికి న్యాయవాది కావాల్సిన అవసరం లేదని మైసూరా అన్నారు. చట్టం, నిబంధనల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందన్నారు. తన బాధ్యతను విస్మరించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం దురదృష్టకరం అన్నారు.

సిఆర్‌పిసి సెక్షన్‌ 173 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత కేసును వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థ మీద ఉంటుందని మైసూరా వివరించారు. ఏ వ్యక్తినైనా అరెస్టు చేసిన తరువాత 90 రోజుల లోగా చార్జిషీట్‌ వేయకపోతే కూడా స్టాట్యుటరీ బెయిల్‌ వస్తుందన్నారు. ఈ నిబంధనలను తుంగలో తొక్కి, వక్ర మార్గాలు పట్టి, చట్టాన్ని వక్రీకరించి, సుప్రీంకోర్టు ఆదేశాలను అడ్డు పెట్టుకుని సిబిఐ ఇష్ట ప్రకారం దర్యాప్తు చేసినా చంద్రబాబు నాయుడు పల్లెత్తు మాట మాట్లాడలేదేమని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ చార్జిషీట్‌ వేసిన వైనాన్ని ఆయన గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఒకమారు నాలుగు నెలలు గడువు ఇస్తే.. ఆరు మాసాలైనా సిబిఐ చార్జిషీట్‌ వేయలేదని చెప్పారు. మరోసారి నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జీషీట్‌ వేయమని చెప్పిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ పనిచేసిందన్నారు.

చార్జిషీట్‌ వేసేంత వరకూ కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి సాక్షులను శ్రీ జగన్ ప్రభా‌వితం చేస్తారేమో అంటూ ఆయనకు బెయిల్‌ రానివ్వకుండా సిబిఐ తరఫున వాదిస్తున్న న్యాయవాదులు అడ్డుపడిన వైనాన్ని మైసూరారెడ్డి ప్రస్తావించారు. అయినా.. చట్టపరిధిలోనే పోరాడాలని భావించామని, ఎవరినీ పల్లెత్తు మాట అనలేదన్నారు. తుది చార్జిషీట్‌ వేసిన తరువాత చట్టం ప్రకారమే శ్రీ జగన్‌ బెయిల్‌ కోసం పిటిషన్‌ వేసినట్లు తెలిపారు.

కానీ, వివరాలు తెలుసుకోకుండా 'ఎద్దు ఈనిందంటే.. దూడను కట్టేయండి' అనే తీరులో అసత్యమైన ఆరోపణలతో అభాండాలు వేయడం చంద్రబాబుకు తగదని మైసూరారెడ్డి సూచించారు. కోర్టు విచారణలో ఉన్న అంశాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చంద్రబాబుకు తగదన్నారు. మంచి సాంప్రదాయం కూడా కాదన్నారు.

కోర్టులో సిబిఐ మెమో దాఖలు చేసింది శ్రీ జగన్‌ కేసులో కాదని మైసూరారెడ్డి వివరణ ఇచ్చారు. సిసి 114 కింద వాన్‌పిక్‌ కేసులో ఆ మెమో దాఖలు చేశారన్నారు. సెక్షన్‌ 309 ప్రకారం కేసు వాయిదా వేయమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోరారన్నారు. అన్ని చార్జిషీట్లు వేశామని, విచారణకు స్వీకరించవచ్చు అని సిబిఐ తరఫు న్యాయవాది చెప్పినప్పుడు.. నోటి మాటగా కాకుండా రాతపూర్వకంగా ఇవ్వలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చినప్పుడు మెమో దాఖలు చేయమని న్యాయమూర్తి కేసును 23వ తేదీకి వాయిదా వేశారని మైసూరా వివరంగా చెప్పారు. ఆ కేసుకు సంబంధించి సిబిఐ మెమో ఫైల్‌ చేస్తే.. శ్రీ జగన్‌కు బెయిల్‌ ఇవ్వడానికే మెమో దాఖలు చేశారని, సిబిఐతో డీల్‌ కుదిరిందని ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ విధంగా మాట్లాడుతున్నారని ఆయన నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఇలా బాధ్యతా రహితంగా మాట్లాడడం చాలా తప్పు అన్నారు. దురదృష్టకరం కూడా అన్నారు. టిడిపి నాయకులు, వారికి సంబంధించిన మీడియా కూడా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని హెచ్చరించారు.

సున్నితమైన రాష్ట్ర విభజన సమస్యపై కేంద్రం ఒంటెత్తు పోకడలతో నిర్ణయం తీసుకోవడం మంచిది  కాదని ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు మైసూరా సమాధానం చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజలూ భావోద్వేగాలకు గురైనప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పరిష్కరించాలన్నారు. అలాంటిది తమ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్సును రాహుల్‌ గాంధీ చెబితే ఉపసంహరించుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఆ ఆర్డినెన్సును వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ తప్పు పడుతోందన్నారు. అలాంటి ఆర్డినెన్సును అసలు తెచ్చి ఉండాల్సింది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది 10 జన్‌పథ్‌ పంజరంలో చిలుకలా తయారైందని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తి కనుసన్నల్లో కేంద్రప్రభుత్వం పనిచేయడం మంచి సంప్రదాయం కాదన్నారు.

Back to Top