'మనీస్కీం మోసగాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి'

హైదరాబాద్‌, 10 నవంబర్‌ 2012: దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాష్ట్రంలో ఆర్థిక మోసాలు పెచ్చుమీరిపోతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు మూలింటి మారెప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మనీస్కీంల పేరుతో నిరుపేద మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసి వర్గాలను నిండా ముంచేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రాసిన లేఖను మారెప్ప విడుదల చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మనీ సర్క్యులేషన్‌ పేరుతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కొన్ని ప్రైవేటు సంస్థల ఆట కట్టించాలని ఆ లేఖలో సబితా ఇంద్రారెడ్డికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది. అధిక వడ్డీ ఇస్తామని, తమ సంస్థలో డబ్బు డిపాజిట్‌ చేస్తే ఒక్క ఏడాదిలోనే రెట్టింపు మొత్తం చెల్లిస్తామన్న ఆర్థిక మోసగాళ్ళ మాటలు నమ్మిన నిరుపేదలు తాళిబొట్లు, చెవి కమ్మలు లాంటి వాటిని కూడా తెగనమ్మి ఆ సంస్థల్లో డబ్బులు పెట్టి మోసపోయారన్నారు. కర్నూలు జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిలకు, విజయమ్మకు, పార్టీ సిజిసి సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి వందలాది మంది ప్రజలు ఈ విషయం చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని మరెప్ప తెలిపారు.

ఈ ఆర్థిక మోసగాళ్ళకు అధికార పార్టీ ఎంపి అండదండలు ఉన్న విషయం కూడా బాధితులు వెల్లడించారని మారెప్ప తెలిపారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ముఖ్యంగాకర్నూలు జిల్లాలో రంగస్వామి అనే వ్యక్తి 'శ్రీ నంది యువజన సమాఖ్య' పేరుతో పేదలను దారుణంగా దగా చేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదల నుంచి రంగస్వామి సుమారు 100 కోట్ల రూపాయలు దండుకుని బిచాణా ఎత్తేశాడని మారెప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగస్వామి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మనీ సర్క్యులేషన్‌ సంస్థల చేతిలో మోసపోయి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి చర్యా లేకపోవడంతో బాధితులు తీవ్ర మనో వేదన చెందుతున్నారని మారెప్ప విచారం వ్యక్తం చేశారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఆ పని చేయకపోతే, అన్యాయం చేసిన వారికే కొమ్ము కాస్తే బాధితులు తమ కష్టాలను ఇంకెవరికి చెప్పుకోవాలని వైయస్‌ఆర్‌సిపి సూటిగా ప్రశ్నించింది.

మనీ సర్క్యులేషన్‌ సంస్థల మోసాలపై లేఖ అందించేందుకు పార్టీ ప్రతినిధిగా తనను పంపిస్తున్నట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి వైయస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఫోన్‌ చేసి చెప్పారన్నారు. అయితే, తాను సచివాలయానికి వెళ్ళినప్పుడు సబితా ఇంద్రారెడ్డి అక్కడ లేరని, ఆమె ఇంటికి వెళ్ళినా లేకపోవడంతో చేసేది లేక సబితా రెడ్డి పేషీలోని ఓఎస్‌డికి ఆ లేఖను అందించి వచ్చానన్నారు.

మనీ సర్క్యులేషన్‌ పేరుతో పేదల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మోసగాళ్ళు ఎంత పెద్దవాళ్ళయినా, ఎవరి అండదండలు ఉన్నా వారందరిపై కేసులు నమోదు చేయాలని వైయస్‌ఆర్‌ సీపి డిమాండ్ చేస్తున్నట్లు మారెప్ప తెలిపారు. ఆర్థిక మోసగాళ్ళందరినీ అరెస్టు చేయాలని వైయస్‌ఆర్‌సిపి డిమాండ్‌ చేస్తోందన్నారు.
Back to Top