వైయస్ పథకాలను తుడిచిపెట్టేస్తున్న కాంగ్రెస్

హైదరాబాద్, 21 ఆగస్టు 2013: ‌

నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల సంక్షేమం కోసం దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కిరణ్‌ ప్రభుత్వం వరుసగా తుడిచిపెట్టేస్తున్నదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. వైయస్ఆర్‌ పథకాలలో అతి ముఖ్యమైన ఆరోగ్యశ్రీ పథకం నుంచి దాదాపుగా 80 ఆస్పత్రులను, 132 జబ్బులను జాబితా నుంచి తొలగించివేయడాన్ని తప్పుపట్టింది. పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు బుధవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం లేదని, పరిపాలన అంతకన్నా లేదని దుయ్యబట్టారు.

ఒక పక్కన ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచిన ప్రభుత్వం తాజాగా గుండె జబ్బున్న పేదవారికి స్టెంట్‌ వేయడానికి ఇంతకు ముందు వరకూ ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని తగ్గించివేయడాన్ని గట్టు తూర్పారపట్టారు. ఒక వైపున అన్ని ధరలూ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన నేపథ్యంలో గుండె ఆపరేషన్‌కు ఇస్తున్న డబ్బులను పెంచాల్సింది పోయి తగ్గించడమేమిటని ప్రశ్నించారు. స్టెంట్‌ ఖరీదు రూ. 10 వేలకు మించకూడదని, మొత్తం ఆపరేషన్‌ ఖర్చు రూ. 60 నుంచి 38 వేలకు కుదించడం దారుణం అన్నారు. ఖర్చు పెరిగిన తరుణంలో స్టెంట్‌ వేయడానికి కనీసం 22 శాతం నిధులను పెంచాలని వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయని తెలిపారు. లేకపోతే‌ నాణ్యమైన పరికరాలు వాడలేమని, ఆపరేషన్‌ను విజయవంతం చేయలేమని, నాసిరకం పరికరాలతో చేసే శస్త్ర చికిత్సతో రోగుల ప్రాణాలకే ముప్పు వస్తుందని వైద్యులు మొరపెడుతున్నారని గట్టు వివరించారు. ఆరోగ్యశ్రీ కింద గుండె ఆపరేషన్లు చేయడానికి ప్రభుత్వం ఆస్పత్రి యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుంది కానీ డాక్టర్లు చేయకపోతే తామేం చేస్తామంటూ ఒక అధికారి చెప్పడాన్ని గట్టు రామచంద్రరావు ఎద్దేవా చేశారు.

అడ్డగోలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ నెల 15 వ తేదీ నుంచి ఆస్పత్రులు ‌గుండె శస్త్ర చికిత్సలనే నిలిపివేసిన వైనాన్ని గట్టు ప్రస్తావించారు. ప్రతి రోజూ ఒక్కో ఆస్పత్రిలో 200 నుంచి 300 ఆపరేషన్లు జరుగుతుంటాయని ఇప్పుడు సుమారు 74 ఆస్పత్రుల్లో వాటిని నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అంటే చేతనైతే బ్రతుకు లేకపోతే చచ్చిపో అనే రీతిలో ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన విధంగా పూర్తి సంతృప్త స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందని గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు.

డాక్టర్‌ వైయస్ఆర్‌ హయాంలో అమలు చేసిన ప్రధాన పథకాల్లో పింఛన్లు కూడ ఉన్నాయని గట్టు తెలిపారు. రాష్ట్రంలో అందరినీ ఇక్కట్ల పాలు చేసిన చంద్రబాబు నాయుడి పరిపాలన ఆదర్శంగా కిరణ్‌కుమార్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజశేఖరరెడ్డిగారి పథకాలకు తూట్లు పొడుస్తూ.. చంద్రబాబు కాలంలో వాటి అమలు ఏ విధంగా ఉందో అలాగే చేయాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఇచ్చే 75 రూపాయల పింఛన్‌ను ఏ రెండు నెలలకో మూడు నెలలకో నిర్వహించే జన్మభూమిలో పంపిణీ చేసేవారన్నారు. ఆ విధానాన్నే ఇప్పుడు కిరణ్‌ తీసుకువచ్చి రచ్చబండ సందర్భంగా ఇస్తామని చెబుతున్నారని దుయ్యబట్టారు.

రూ. 75 ఉన్న పింఛన్‌ను రూ. 200 చేసి ప్రతి నెలా ఒకటవ తారీఖో రెండునో పింఛన్‌ లబ్ధిదారుల గ్రామంలోనే వారికి నేరుగా అందే విధంగా అమలు చేశారని గుర్తుచేశారు. చివరి సారిగా రచ్చబండ కార్యక్రమంలో 2011 డిసెంబర్లో జరిగిందని, అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకూ జరగలేదని గట్టు తెలిపారు. అంటే రచ్చబండలోనే పింఛన్లు ఇస్తామంటే పరోక్షంగా వాటిని ఇవ్వబోమని చెప్పడమే అని నిందించారు. కొత్తగా ఏడు లక్షల మందిని పింఛన్‌కు అర్హులుగా గుర్తించిన జాబితాను ప్రభుత్వం పక్కన పెట్టేసిందని గట్టు ఆవేదన వ్యక్తంచేశారు. పింఛన్‌ తీసుకుంటున్న వారిలో ఎవరైనా మరణిస్తే కొత్తవారికి ఇస్తామన్న చంద్రబాబు తీరునే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం అనుసరించాలని నిర్ణయించడాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు నాయుడి కాలంలో ఉన్న దుర్మార్గపు ఆలోచననే ఇప్పుడు అనుసరిస్తామనడం పట్ల గట్టు విచారం వ్యక్తంచేశారు.

వైయస్ఆర్‌ సిఎం అయ్యే సమయానికి రాష్ట్రంలో 18 లక్షల మందికి పింఛన్లు ఉండేవని, ఆ సంఖ్యను ఆయన 71 లక్షలకు పెంచారని గట్టు గుర్తుచేశారు. వాటిలో ఇప్పుడు 4 లక్షల పింఛన్లు తగ్గిపోయాయని ఆయన తెలిపారు. వైయస్ఆర్‌ మరణించిన తరువాత ఈ నాలుగేళ్ళలో పింఛన్లు ఎలా తగ్గిపోయాయని నిలదీశారు. పోనీ బడ్జెట్‌ పెరగకపోవడం వల్ల తగ్గిపోయాయా అనుకుంటే.. ఆయన హయాంలో లక్షా 3 వేల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్‌ లక్షా 60 వేల కోట్లు పెరిగిందన్నారు. రూ. 60 వేల కోట్ల బడ్జెట్‌ పెరిగినా నాలుగు లక్షల పింఛన్లు ఏ విధంగా తగ్గిపోతాయని ప్రశ్నించారు.

వికలాంగుల పరిస్థితి మరీ ఘోరం :
ఇక వికలాంగుల విషయానికి వస్తే మరీ ఘోరం అని గట్టు విచారం వ్యక్తంచేశారు. వికలాంగుల పింఛన్ల విషయంలో మహానేత వైయస్ఆర్‌ 2008లో అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారన్నారు. ఇంత వరకూ వికలాంగులకు ఇస్తున్న రూ.75 పింఛన్‌ రూ. 200 కు పెంచామని, మళ్ళీ రూ. 500కు కూడా పెంచామని అయినా వారికి సరిపోదని అంగవైకల్య శాతాన్ని బట్టి మరింతగా పెంచాల్సి ఉందని ఆ ప్రకటనలో స్పష్టంచేశారన్నారు. దానిని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదని గట్టు ఆరోపించారు. వికలాంగులకు పెంచాల్సిన పింఛన్‌ను పెంచకపోగా 'సదరం క్యాంపుల' పేరుతో పరీక్షలకు పిలిపించి ఒకటో అరో వైకల్య శాతాన్ని తగ్గించివేసి లబ్ధిదారులైన లక్షా 80 వేల మంది వికలాంగులలో లక్ష మందికి రూ. 500 నుంచి 200 రూపాయలకు పింఛన్‌ను తగ్గించి వేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా ఈ ప్రభుత్వం వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇచ్చే పింఛన్‌ లబ్ధిదారుల్లో సాకులు చూపించి నాలుగు లక్షల మందిని తగ్గించడం అత్యంతా దారుణం, దుర్మార్గం అని గట్టు నిప్పులు చెరిగారు.

2008లో వైయస్‌ రాజశేఖరరెడ్డి వికలాంగులకు పింఛన్‌పై ప్రకటన చేసిన సమయంలో వికలాంగ సంక్షేమ శాసనసభా కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇప్పడు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారని గట్లు గుర్తుచేశారు. అప్పుడు వికలాంగులకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆమె తీసిపడేశారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందిరాపార్కు వద్ద ధర్నా చేస్తున్న వికలాంగుల సమస్యలను పరిష్కరించకపోగా సరికొత్త సమస్యను వారికి తీసుకువచ్చారని ఆరోపించారు.

‌రాష్ట్రానికి కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా వచ్చిన దిగ్విజయ్‌ సింగ్ ప్రజా సమస్యల పరిష్కారానికి ఏమి చేస్తున్నారని గట్టు నిలదీశారు. వైయస్ఆర్‌ పెట్టిన సంక్షేమ పథకాలు ఎందుకు కుంటుపడుతున్నాయని మంత్రులతో ఒక్కసారి సమీక్షించాలని సూచించారు. రాష్ట్రంలో కుంటుపడిన పరిపాలనను గాడిలో పెట్టాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గట్టు రామచంద్రరావు డిమాండ్‌ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top