దోషులను శిక్షించడంలో పాలకులు విఫలం:రోజా


హైదరాబాద్, 2 జనవరి 2013: మహిళలపై జరుగుతున్న అకృత్యాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రోజా తీవ్రంగా ఖండించారు. దేశ వ్యాప్తంగా మహిళలపై దారుణాలకు పాల్పడుతున్న నిందితులను శిక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. చట్టాలను కఠినతరం చేయకుండా నిందితులకు పరోక్షంగా పాలకులు తోడ్పడుతున్నారని, ఆ ధైర్యంతోనే మహిళలపై అకృత్యాలకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి నియోజకవర్గంలోనే యువతిపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినా నిందితులను శిక్షించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. నగరంలోని ఆస్పత్రిలో అందరు చూస్తుండగానే ఒక యువతిపై దాడి చేసిన సంఘటన జరిగిందంటే ప్రభుత్వం ఏ మేరకు పని చేస్తుందో అర్థమైపోతోందన్నారు.

     న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వేళితే పోలీసులే అత్యాచారాలకు పాల్పడుతున్నారని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన 100 మందిలో 10 మందికి కూడా శిక్ష పడటంలేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోజా చెప్పారు. బాధిత మహిళలు తమకు జరిగిన అన్యాయాలను నలుగురి ముందు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకునే దుస్థితిలో ఉన్నారని అన్నారు. వారు చెప్పుకోవడానికి సరైన వేదికలు లేక పోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో మహిళా కమిషన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

     మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. మహిళలపట్ల వారికి ఉన్న గౌరవం ఏంటో ఆ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. మహిళలను ఒక వస్తువులా చూస్తున్నారని, మనుషులుగా చూడటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

     అత్యాచారాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై చర్చించి చట్టం తీసుకు వచ్చేందుకు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని రోజా డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో దారుణాలు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు.  ఢిల్లీ బాధితురాలికి అండగా ఆందోళనకు దిగిన యువతపై లాఠీచార్జీ, బాష్పపవాయు ప్రయోగించడం దురదృష్టకరమన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు అత్యాచారాలకు గురయ్యారు, ఎంతమందిని శిక్షించారో పాలకులు వెల్లడించాలని రోజా డిమాండ్ చేశారు.

Back to Top